
- రూ.65,799 కోట్లకు చేరిన రెవెన్యూ
- రూ.11 చొప్పున డివిడెండ్.. 20 వేలు తగ్గిన ఉద్యోగుల సంఖ్య
- లిస్ట్ఎంగేజ్‌లో 100 వాటా కొనుగోలు
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ2) లో రూ.12,075 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.11,909 కోట్లతో పోలిస్తే ఇది 1.4 శాతం ఎక్కువ. అన్ని వ్యాపార విభాగాల్లో, ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగాల్లో మంచి పనితీరు కనబరిచామని, అందుకే ప్రాఫిట్ పెరిగిందని కంపెనీ పేర్కొంది. టీసీఎస్‌కు క్యూ2లో కార్యకలాపాల ద్వారా రూ.65,799 కోట్ల ఆదాయం రాగా, గత ఏడాది ఇదే క్వార్టర్‌లో వచ్చిన రూ.64,259 కోట్లతో పోలిస్తే 2.39 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది జూన్ క్వార్టర్ (క్యూ1) తో పోలిస్తే మాత్రం టీసీఎస్ లాభం క్యూ2లో 5.3 శాతం తగ్గింది. కానీ ఆదాయం 3.7 శాతం పెరిగింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ ఆధారిత టెక్నాలజీ సేవల సంస్థగా మారాలని చూస్తున్నామని టీసీఎస్ సీఈఓ కృతివాసన్ పేర్కొన్నారు. ఇందుకోసం ట్యాలెంట్ ఉన్న ఉద్యోగులను నియమించుకుంటున్నామని, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను డెవలప్ చేస్తున్నామని తెలిపారు. కంపెనీ టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ (టీసీవీ) క్యూ2లో 10 బిలియన్ డాలర్లుగా ఉంది.
టీసీవీ అంటే ఒక కస్టమర్ నుంచి కాంట్రాక్ట్ మొత్తం పీరియడ్‌లో అందుకునే రెవెన్యూ. కంపెనీ సీఎఫ్‌ఓ సమీర్ సెక్సారియా మాట్లాడుతూ, “క్రమశిక్షణతో పనిచేయడంతో కంపెనీ మార్జిన్స్ పెరిగాయి. ఈ క్వార్టర్‌లో అన్ని విభాగాల్లో మంచి వృద్ధి కనిపించింది. జీతాల పెంపు, ఫ్యూచర్ అవసరాలకు రెడీగా ఉండడం, కొత్త భాగస్వామ్యాలను పెంచుకోవడంపై ఫోకస్ పెట్టాం”అని పేర్కొన్నారు. కాగా, క్యూ2 లో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య సుమారు 20 వేలు తగ్గి 5,93,314 గా ఉంది.
భారత్‌లో తగ్గిన ఆదాయం
ఉత్తర అమెరికా మార్కెట్లలో టీసీఎస్ రెవెన్యూ తగ్గింది. ఏడాది లెక్కన క్యూ2లో 0.1శాతం పడింది. లాటిన్ అమెరికా మార్కెట్లలో 1.8శాతం వృద్ధి చెందగా, భారత్‌లో మాత్రం 33.3శాతం పడింది. మొత్తం ఆదాయంలో ఇండియా నుంచే వచ్చే రెవెన్యూ వాటా 5.8శాతంగా ఉంది. గతేడాది ఇదే టైమ్‌లో టీసీఎస్ రెవెన్యూలో ఇండియా వాటా 8.9శాతంగా ఉంది.
షేరుకు రూ.11 డివిడెండ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రెండో ఇంటెరిమ్ డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. షేరుకి రూ.11 ఇవ్వనుంది. ఇందుకోసం ఈ నెల 15 ను రికార్డ్ డేట్‌గా నిర్ణయించారు. వచ్చే నెల 4న డివిడెండ్ చెల్లింపు ఉంటుంది. టీసీఎస్ షేర్లు గురువారం రూ.3,061.95 వద్ద ముగిశాయి. ఒక శాతం లాభపడ్డాయి.
కొత్త పెట్టుబడులు..
ఏఐ, డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఇండియాలో ఫుల్లీ ఓన్డ్ సబ్సిడరీని ఏర్పాటు చేశామని టీసీఎస్ ప్రకటించింది. ఒక గిగావాట్ సామర్థ్యం గల ఏఐ డేటా సెంటర్‌ను నిర్మిస్తామని తెలిపింది. మరోవైపు అమెరికన్ కంపెనీ లిస్ట్ఎంగేజ్‌లో 100శాతం వాటాను 72.80 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశామని ప్రకటించింది. లిస్ట్‌ఎంగేజ్ మార్కెటింగ్ క్లౌడ్, సీఆర్‌ఎం, డేటా క్లౌడ్, ఏజెంట్‌ఫోర్స్, ఏఐ అడ్వైజరీ సర్వీసెస్ వంటి బిజినెస్‌లలో ఉంది.