
- మొత్తం ఆదాయం రూ. 63,437 కోట్లు
- రూ. 11 చొప్పున ఇంటెరిమ్ డివిడెండ్
న్యూఢిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నికర లాభం ఈ ఏడాది జూన్‌తో ముగిసిన మొదటి క్వార్టర్లో ఏడాది లెక్కన 5.98 శాతం పెరిగి రూ. 12,760 కోట్లకు చేరుకుంది. సీక్వెన్షియల్‌గా నికర లాభం 4.38శాతం వృద్ధి చెందింది. గత జూన్ క్వార్టర్లో రూ. 12,040 కోట్లు, మార్చి క్వార్టర్లో రూ. 12,224 కోట్లు నికర లాభాన్ని ప్రకటించింది. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ ఆదాయాలు అంచనాల కంటే మెరుగ్గా ఉన్నాయి.
కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 63,437 కోట్లు ఉంది. ఇది గత సంవత్సరం ప్రకటించిన రూ. 62,613 కోట్ల కంటే 1.13 శాతం ఎక్కువ. క్వార్టర్ ప్రాతిపదికన ఆదాయం 1.61శాతం తగ్గింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన కూడా ఇది 3శాతం తగ్గింది. 2025–-26 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ. 11 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.
2024–-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 30 తుది డివిడెండ్‌ను ప్రకటించింది. టీసీఎస్ మధ్యంతర డివిడెండ్ కోసం జులై 16, 2025ని రికార్డు తేదీగా నిర్ణయించింది. ఈ డివిడెండ్ అర్హులైన వాటాదారులకు ఆగస్టు 4, 2025న చెల్లిస్తారు.
భారీ డీల్స్...
ఈ క్వార్టర్లో 9.4 బిలియన్డాలర్ల విలువైన కొత్త డీల్స్‌ను సంపాదించినట్టు టీసీఎస్ ప్రకటించింది. తాజా క్వార్టర్లో 6,071 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు తెలిపింది. దీంతో ఉద్యోగుల మొత్తం సంఖ్య 6,13,069కి చేరుకుంది. రాజీనామాల (ఆట్రిషన్) రేటు 2026 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో 13.8 శాతానికి పెరిగింది. గత క్వార్టర్లో 13.3 శాతం ఉంది. కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ 24.5 శాతంగా, నికర మార్జిన్ 20.1 శాతంగా ఉందని టీసీఎస్ ప్రకటించింది.
]ఇది గత క్వార్టర్లో నివేదించిన 24.2 శాతం, 19 శాతం కంటే ఎక్కువ. ఫలితాల సందర్భంగా టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ కె. కృతివాసన్ మాట్లాడుతూ, “ప్రస్తుతం ఉన్న ప్రపంచ స్థూల, ఆర్థిక భౌగోళిక రాజకీయ సమస్యలు డిమాండ్ తగ్గుదలకు కారణమయ్యాయి. అన్ని కొత్త సేవలు బాగా వృద్ధి చెందాయి. ఈ క్వార్టర్లో మేం బలమైన డీల్స్‌ను సంపాదించాం. ఖర్చులను తగ్గించుకున్నాం. ఏఐ -ద్వారా మా క్లయింట్ల సమస్యలను పరిష్కరించడానికి వారితో కలిసి పనిచేస్తాం” అని అన్నారు.