జూబ్లీహిల్స్లో పోటీకి టీడీపీ దూరం.. బీజేపీ అడిగితే మద్దతివ్వాలని నిర్ణయం

జూబ్లీహిల్స్లో పోటీకి టీడీపీ దూరం.. బీజేపీ అడిగితే మద్దతివ్వాలని నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీకి టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. మంగళవారం అమరావతిలో తెలంగాణ టీడీపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు రెండు గంటల పాటు సమావేశమయ్యారు. ఈ మీటింగ్ లో తెలంగాణ టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, అరవింద్ కుమార్ గౌడ్, జ్యోత్స్న, పొగాకు జైరామ్, నందమూరి సుహాసినితో పాటు మొత్తం 15 మంది నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీడీపీ నేతలతో చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్డీయేలో భాగస్వామిగా ఉండి పోటీ చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని.. అందుకే పోటీకి దూరంగా ఉందామన్నట్టు సమాచారం. మద్దతు ఇవ్వాలని తెలంగాణ బీజేపీ నేతలు సంప్రదిస్తే.. మద్దతు ఇవ్వాలని నేతలకు చంద్రబాబు సూచించారు. కాగా, రెండేండ్ల నుంచి టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్ పోస్ట్ ఖాళీగా ఉందని, వెంటనే ప్రెసిడెంట్ ను నియమించాలని పార్టీ నేతలు చంద్రబాబును కోరారు. పార్టీ కమిటీలు పూర్తి చేయాలని, చేసిన తరువాత అధ్యక్షుడిని నియమించాలని చంద్రబాబు నిర్ణయించారు. పార్టీని బలోపేతం చేయాలని ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఆందోళనలు చేపట్టాలని తెలంగాణ టీడీపీ నేతలను చంద్రబాబు ఆదేశించారు.