
ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో రీ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్న టీడీపీ ముందుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాపై నజర్ పెట్టింది. తాను ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఏపీకి జిల్లా సరిహద్దుగా ఉండడం, గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా గెలిచిన రెండు అసెంబ్లీ స్థానాలు ఇక్కడివే కావడంతో ఖమ్మం కేంద్రంగానే మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగా మారాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా వచ్చే నెల 21న భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సహా పార్టీ ముఖ్యనేతలంతా హాజరు కానున్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు టీడీపీ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఖమ్మంలో జరగబోయే పబ్లిక్ మీటింగ్ ను లక్ష మందితో సక్సెస్ చేయాలని జిల్లా నేతలు భావిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి పార్టీ అభిమానులు, కార్యకర్తలను రప్పించేందుకు ఆలోచిస్తున్నారు. పార్టీకి మళ్లీ జోష్ తెచ్చేలా బహిరంగ సభలో కొన్ని చేరికలు ఉంటాయని పార్టీ లీడర్లు చెబుతున్నారు.
మిగిలింది ద్వితీయశ్రేణి లీడర్లే..
రాష్ట్ర విభజనకు ముందు జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్లో చేరడంతో ఉమ్మడి జిల్లాలో టీడీపీ బలహీనపడింది. 2018 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని చాలాచోట్ల పోటీ చేసినా, ఉమ్మడి జిల్లా పరిధిలోని సత్తుపల్లి, అశ్వారావుపేటలో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ టీఆర్ఎస్లో చేరడంతో ప్రస్తుతం ద్వితీయ శ్రేణిలో దాదాపు 100 మంది ప్రజాప్రతినిధులు మాత్రమే ఉన్నారు. ఇందులో ఒక ఎంపీపీ, 20 మంది వరకు ఎంపీటీసీలు, 10 మంది సర్పంచులు, 70 మంది వరకు వార్డుసభ్యులున్నారు. ఈ బలాన్ని మరింత పెంచుకోవాలంటే ఇతర పార్టీలకు వెళ్లిన లీడర్లను మళ్లీ రప్పించడమే మార్గమని ముఖ్యనేతలు భావిస్తున్నారు. ఇందుకు సానుకూలంగా ఉన్నోళ్లను గుర్తించి ఇప్పటికే వారితో టచ్‌లోకి వెళ్లినట్లు ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారు. జనవరి, ఫిబ్రవరిలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి మాజీ ప్రజాప్రతినిధుల చేరికలు ఉండే అవకాశముందని అంటున్నారు.
తుమ్మల పయనమెటు?
పాలేరులో గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ భవిష్యత్ పై చాలా ప్రచారాలు జరిగాయి. కాంగ్రెస్‌లో గెలిచిన కందాల ఉపేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరడం, సిట్టింగులకే సీట్లు అంటూ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించడం, తాజాగా కమ్యూనిస్టులతో పొత్తులపై చర్చలు జరుగుతుండడంతో ఆయనేం చేయబోతున్నారన్నది చర్చనీయాంశమైంది. ఇటీవల వేంసూరులో ఎన్టీఆర్ కాలువ 100 రోజులు నీళ్లుపారిన సందర్భంగా జరిగిన భారీ ర్యాలీలో తుమ్మల పాల్గొన్నారు. అందులో కొన్ని టీడీపీ జెండాలు కనిపించడం, కదిలి రండి తెలుగుదేశం కార్యకర్తలారా అంటూ పాటలు వినిపించడం, తన స్పీచ్‌లోనూ పలుసార్లు ఎన్టీఆర్ పేరును తుమ్మల తల్చుకోవడం చర్చనీయాంశమైంది. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అభిమానులను తుమ్మల ఏకం చేస్తుండడంతో ఆయన భవిష్యత్ అడుగులు ఎటువైపు అనే చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే తాజాగా టీడీపీకి చెందిన ముఖ్యనేత ఒకరు తుమ్మలను సీక్రెట్ గా కలిసి మాట్లాడినట్టు సమాచారం.
పూర్వవైభవం తెస్తం
టీడీపీకి మళ్లీ పూర్వవైభవం తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. డిసెంబర్ 21న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. మీటింగ్ వేదికను ఒకట్రెండు రోజుల్లో ఫైనల్ చేస్తాం. సభలో కొన్ని చేరికలు ఉంటాయి. ప్రధానంగా ఖమ్మం, సత్తుపల్లి ప్రాంతాలకు చెందినవారు టీడీపీలో చేరబోతున్నారు. రెండు మూడు నెలల్లో కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు కూడా తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. - కూరపాటి వెంకటేశ్వర్లు, టీడీపీ ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడు