పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి..ఈసీకి టీడీపీ వినతి

పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి..ఈసీకి టీడీపీ వినతి

హైదరాబాద్‌‌, వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ కోరింది.  అధికార దుర్వినియోగాన్ని నివారించి, ఓటర్లకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపింది. మంగళవారం ఈసీ పర్యటనలో భాగంగా హైదరాబాద్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం సమీక్షా సమావేశం నిర్వహించింది. దీనికి గుర్తింపు పొందిన పార్టీలను ఆహ్వానించింది. టీడీపీ తరఫున ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేశ్, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి సతీశ్, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర ప్రతాప్ పాల్గొన్నారు.

ఒక కుటుంబం ఒకే పోలింగ్ బూత్‌‌లో ఓటు వేసేందుకు సౌలతులు కల్పించాలన్నారు. డోర్ నంబర్లు ..డోర్ టు డోర్ ఓటర్ స్లిప్పులు సంబంధిత ఓటర్లకు పంపాలన్నారు. పారదర్శకతను కాపాడుకోవడం కోసం ఎన్నికల షెడ్యూల్‌‌ను ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని కఠినంగా పరిమితం చేయాలని కోరారు. ఓటర్లకు ఏ విధమైన పథకాలు, ప్రయోజనాలను ప్రకటించడం నిషేధించాలని విన్నవించారు. నియోజక వర్గాల వారీగా మొత్తం ఓటర్ల జాబితాను అందించాలని.. ఏదైనా దిద్దుబాటు, చేర్చడం, తొలగించడం కోసం పారదర్శకంగా ఉండే విధంగా చూడాలన్నారు. ప్రచారానికి అడ్వటైజ్ మెంట్ బోర్డులను అన్ని పార్టీలకు సమానంగా అవకాశం కల్పించాలని సూచించారు.