అర్థరాత్రి టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్

అర్థరాత్రి టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్

అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్నప్పుడు పదోన్నతి కోసం విద్యార్హతను తప్పుగా చూపించారన్న ఆరోపణలపై సీఐడీ పోలీసులు గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. అశోక్ బాబు వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసినప్పుడు బీకాం చదవకపోయినా చదివినట్లు తప్పుడు ధృవపత్రం సమర్పించారని విజయవాడకు చెందిన మెహర్ కుమార్ గతంలో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై వాణిజ్య పన్నుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్న లోకాయుక్త... సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించింది.  ఇందులో భాగంగా వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ ఇటీవల అశోక బాబుపై సీఐడీకి ఫిర్యాదు చేయడంతో.. గత నెల 25న అశోక్ బాబుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి అశోక్ బాబును అరెస్టు చేసినట్లు సీఐడీ అధికారులు పేర్కొన్నారు. అర్ధరాత్రి అశోక్ బాబును అరెస్టు పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను గుంటూరులోని సీఐడీ ఆఫీసుకు తరలించారు.

అర్థరాత్రి అరెస్టు చెయ్యాల్సిన అవసరం ఏమోచ్చింది 

ఎమ్మెల్సీ ఆశోక్ బాబు అరెస్టును టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. ఒక ఎమ్మెల్సీని ఇంట్లోకి చొరబడి అర్థరాత్రి అరెస్ట్ చేయడంతో  ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. సర్వీస్ విషయంలో తప్పుడు కేసు పెట్టి అశోక్ బాబును అరెస్టు చేశారని చంద్రబాబు అన్నారు. ఆయనను అర్థరాత్రి అరెస్టు చెయ్యాల్సిన అవసరం ఏమోచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకే అశోక్ బాబుపై ప్రభుత్వం కక్ష గట్టిందని చంద్రబాబు విమర్శించారు. జ‌గన్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుకూ మూల్యం చెల్లిస్తుందని ఆయన అన్నారు.