జగన్ అడ్డాపై టీడీపీ జెండా : 30 ఏళ్ల తర్వాత పులివెందులలో చరిత్ర

జగన్ అడ్డాపై టీడీపీ జెండా : 30 ఏళ్ల తర్వాత పులివెందులలో చరిత్ర

రాయలసీమలోనే పులివెందుల అంటే వైఎస్ ఫ్యామిలీకి అడ్డా. 30 ఏళ్లుగా పులివెందుల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు అన్నీ ఏకగ్రీవం అయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గంలోనూ వైఎస్ఆర్ ఆ తర్వాత జగన్ పోటీ చేస్తూ.. నియోజకవర్గాన్ని తమ అడ్డాగా మార్చుకున్నారు. 2024 ఎన్నికల తర్వాత ఏపీలో మారిపోయింది సీన్. జగన్ పార్టీ వైసీపీ 11 స్థానాల్లోనే గెలవటంతో జగన్ హవా తగ్గిందనే చెప్పాలి. 

ఇదే సమయంలో జగన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో.. పులివెందుల జడ్పీటీసీకి ఉప ఎన్నిక వచ్చింది. 30 ఏళ్లుగా ఏకగ్రీవంగా జరుగుతున్న ఎంపిక.. ఈసారి ఎన్నికలకు దారి తీసింది. టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి భార్య లతారెడ్డి బరిలోకి దిగటంతో ఆసక్తిగా మారింది. అసెంబ్లీ ఎన్నిక స్థాయిలో హోరాహోరీగా ప్రచారం జరిగింది.

ఎట్టకేలకు పులివెందుల జడ్పీటీసీని టీడీపీ కైవసం చేసుకున్నది. 30 ఏళ్ల తర్వాత పులివెందుల జడ్పీటీసీ టీడీపీ వశం అయ్యింది. ఏడాదిన్నర కూటమి.. టీడీపీ, జనసేన, బీజేపీ పాలనకు జనం ఇచ్చిన రిఫరెండం ఇది అంటున్నారు టీడీపీ నేతలు. 

జగన్ అడ్డాగా ఉన్న పులివెందుల గడ్డపై టీడీపీ జెండా ఎగరటం అనేది టీడీపీ పార్టీలో జోష్ తీసుకొచ్చింది. జగన్ పై వ్యతిరేకతకు నిదర్శనం అని.. ప్రజాస్వామ్యం గెలిచింది అంటోంది టీడీపీ. 30 ఏళ్లుగా జగన్ అరాచకాలకు జనం ఇచ్చిన తీర్పు అంటున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. 

టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 6వేల 716 ఓట్లు సాధించి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై 6 వేల 33 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి కేవలం 683 ఓట్లకే పరిమితమయ్యి డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు.

టీడీపీ గెలుపు ద్వారా పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకొచ్చామంటున్నారు టీడీపీ మంత్రులు.  ఎమ్మెల్యేలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని.. జగన్ ఇక పార్టీని మూసేసుకోవటమే బెటర్ అంటూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు టీడీపీ నేతలు.