
- స్టేట్ ప్రెసిడెంట్ ఎంపికకు పార్టీ కసరత్తు
- పోటీ పడుతున్న పలువురు సీనియర్లు
- సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉన్న నేతకే చాన్స్
హైదరాబాద్, వెలుగు : తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర పగ్గాలు ఎవరికి అప్పగించాలనేదానిపై ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీకి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేసి.. బీఆర్‌ఎస్‌లో చేరినప్పటి నుంచి రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు ఎవరికీ అప్పగించలేదు. తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సామాజికంగా, ఆర్థికంగా ఉన్న నేతకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించాలనే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా బీసీ వర్గానికి చెందిన నేతకే బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో రాష్ట్ర పార్టీ సమావేశం ఏర్పాటు చేసి దీనిపై చర్చించనున్నట్లు సమాచారం.
సంక్రాంతి తరువాతే కొత్త అధ్యక్షుడి ఎంపిక..
హైదరాబాద్‌తో పాటు శివారు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ప్రాభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడున్న నాయకత్వానికే పెద్దపీట వేసే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి తరువాత నూతన అధ్యక్షున్ని నియమించేందుకు టీడీపీ అధినాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ దిశలో కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా నలుగురైదుగురి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా సామాజిక వర్గాల వారీగా ఎవరిని నియమిస్తే పార్టీకి లాభం చేకూరుతుందనే దిశలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన బక్కని నర్సింహులతో పాటుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అరవింద్ కుమార్ గౌడ్, అదే విధంగా నన్నూరి నర్సిరెడ్డి, నందమూరి సుహాసిని పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా బీసీ వర్గానికి చెందిన అరవింద్ కుమార్ గౌడ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అరవింద్ కుమార్ 40 ఏండ్లుగా పార్టీలో కొనసాగుతున్నారు. మాజీ మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ అల్లుడు కావడం, అదే విధంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మంచి పట్టు ఉండడంతో ఆయనకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే, తెలంగాణలో పార్టీ వ్యహారాలను నందమూరి బాలకృష్ణకు అప్పగించాలని పార్టీ శ్రేణుల నుంచి కూడా ఒత్తిడి ఉంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన సమావేశంలో సైతం తెలంగాణలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని, అన్ని వ్యవహారాలు చూసుకుంటానని బాలకృష్ణ కూడా స్పష్టత ఇచ్చారు.
శ్రేణులకు సముచిత స్థానం ఉంటుందని అధినేత హామీ..
తెలంగాణలో పార్టీ శ్రేణులకు సముచిత స్థానం కల్పిస్తామని ఇటీవల వైజాగ్‌లో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఇక్కడి నేతలకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. టీడీపీకి పట్టున్న మేడ్చల్ మల్కాజిగిరి, నిజామాబాద్, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలకు సిద్ధం చేయాలని సూచించినట్లు తెలిసింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ దిశలో అడుగులు వేయాలని చెప్పినట్లు సమాచారం. జనసేనతో పాటు బీజేపీ లేదా కాంగ్రెస్ తో కలిసి వెళ్లే దిశగా పార్టీ త్వరలో క్లారిటీ ఇస్తుందని అధినాయకత్వం సూచించినట్లు తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం.. రేవంత్‌రెడ్డి సీఎం కావడం, ఇటీవల చంద్రబాబు డీకే శివకుమార్‌తో జరిగిన మంతనాల నేపథ్యంలో ఎటు వైపు వెళ్తారనేది సంక్రాంతి తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.