
-
ఇతర పార్టీల్లో చేరిన నేతలు తిరిగి వచ్చేయండి: చంద్రబాబు
-
టీటీడీపీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కాసాని జ్ఞానేశ్వర్
హైదరాబాద్, వెలుగు: టీడీపీకి బీసీలే వెన్నెముక అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ, తెలంగాణలో బీసీలే పార్టీ అధ్యక్షులుగా ఉండటం ఇందుకు నిదర్శనమన్నారు. గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు ఇంటి నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దాకా భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘74 కులాలను ఏకతాటిపైకి తెచ్చి బడుగులకు ఎనలేని సేవలందించిన కాసాని ఆధ్వర్యంలో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని నమ్ముతున్నా. కొన్ని కారణాల వల్ల ఇక్కడి నాయకులు, కార్యకర్తలు డల్‌గా ఉన్నారు. వాళ్లందరూ మళ్లీ పార్టీలో యాక్టివ్ కావాలి. ఇతర పార్టీల్లో చేరిన టీడీపీ నేతలను మళ్లీ తిరిగి రావాలని ఆహ్వానిస్తున్నా” అని తెలిపారు. తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మొదటి నుంచి తెలంగాణలో టీడీపీకి గట్టి పునాదులున్నాయని, 2004లో ఇక్కడే టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయని, 2009, 2014లోనూ తెలంగాణ ప్రజలు ఎక్కువ సీట్లలో గెలిపించారని తెలిపారు. టీడీపీ పుట్టిందే తెలంగాణ గడ్డపై అన్నారు. ఎంతో మందికి రాజకీయ జీవితం ఇచ్చిందని, బడుగు బలహీన వర్గాల నేతలు చట్టసభల్లోకి వెళ్లేందుకు అవకాశం ఇచ్చిందన్నారు. పార్టీని ఆశ్వీరదించాలని తెలంగాణ ప్రజలను చంద్రబాబు కోరారు.
ప్రాజెక్టుల నుంచి వ్యాక్సిన్ల దాకా.. మా హయాంలోనే
టీడీపీ హయాంలో ఎస్ఆర్ఎస్పీ, ఎస్ఎల్బీసీ, ఎలిమినేటి మాధవరెడ్డి, దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయల్ సాగర్, భీమా ప్రాజెక్టులను మొదలుపెట్టి పూర్తి చేశామని చంద్రబాబు అన్నారు. ఐటీకి ఫ్యూచర్ ఉందని సైబరాబాద్‌ను, హైటెక్ సిటీని అభివృద్ధి చేశానని చెప్పారు. ట్రిపుల్ ఐటీ, ఐఎస్‌బీ, నల్సార్ యూనివర్సిటీ, 250 పైగా ఇంజనీరింగ్ కాలేజ్‌లు ఏర్పాటయ్యేలా కృషి చేశానని అన్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీ నగరంగా హైదరాబాద్ మారిందంటే తాను స్థాపించిన జీనోమ్ వ్యాలీనే కారణమన్నారు. అక్కడ స్థాపించిన భారత్ బయోటెక్.. వ్యాక్సిన్‌కు వేదికైందన్నారు. నిమ్స్, గాంధీ హాస్పిటల్స్‌ను తానే స్టార్ట్ చేశానన్నారు. తాను చేసిన అభివృద్ధిని తర్వాతి సీఎంలు కొనసాగించారని చంద్రబాబు తెలిపారు.
చంద్రబాబు నమ్మకాన్ని నిలబెడతా: కాసాని
చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని, ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన అభివృద్ధిని వివరిస్తానని చెప్పారు. కాసాని ప్రమాణ స్వీకారానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కిటకిటలాడింది.