- భవిష్యత్తులో మరింత
- పెరుగుతుందన్న నమ్మకంతోనే
- ప్రస్తుతం 70 శాతం వరకు అ‘ధనం’
- మార్కెట్లో ఉన్నది 316.39 ఎకరాలే
హైదరాబాద్ సిటీ, వెలుగు : నగరంలో టీడీఆర్ (ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్) అమ్మకాలు ఆగిపోయాయి. రోజురోజుకు డిమాండ్ పెరుగుతుండడంతో టీడీఆర్ ఉన్నవారు, భవిష్యత్‌లో మరింత ఎక్కువ రేటు వస్తుందనే నమ్మకంతో దాచిపెట్టుకుంటున్నారు. ప్రస్తుతం టీడీఆర్ మార్కెట్ ధరకంటే 70 శాతం అదనంగా ఉంది. రానున్న రోజుల్లో ఇది వందశాతానికి పైగా పెరుగుతుందని విశ్వాసంతో ఉన్నారు. ఈ మధ్య టీడీఆర్ఉంటే...అదనపు ఫ్లోర్లు, సెట్ బ్యాక్ కు రిలాక్సేషన్ ఇస్తూ సర్కార్ జీవో ఇవ్వడం టీడీఆర్ కు బూస్ట్ఇచ్చినట్టయ్యింది. దీంతో ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
2022 తర్వాతే డిమాండ్
రోడ్లు, నాలాల వెడల్పులో భాగంగా సేకరించిన భూమికి, తీసుకున్న ఇండ్లకు పరిహారంగా జీహెచ్ఎంసీ టీడీఆర్జారీ చేస్తోంది. గత ఐదేండ్ల క్రితం వరకు టీడీఆర్ కు పెద్దగా డిమాండ్ లేదు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఎవరైనా భూమిని, ఇండ్లను కోల్పోయినప్పుడు తమకు టీడీఆర్ వద్దని, నగదు కావాలనే డిమాండ్ చేసేవారు. రాను రాను సిటీలో రోజురోజుకు ఇండ్ల నిర్మాణాలు పెరిగి ఖాళీ స్థలం తగ్గుతోంది. టీడీఆర్కింద ప్రభుత్వం భారీగా వెసులుబాటు కల్పిస్తుండడంతో 2022 తర్వాత టీడీఆర్ మాత్రమే కావాలని కోరుతున్నారు.
1585 మందికి టీడీఆర్
ఇప్పటివరకు నగర వ్యాప్తంగా 1585 మందికి టీడీఆర్ సర్టిఫికెట్లను జారీ చేశారు. వీటి ద్వారా1,070.96(951,83,446 స్క్వేర్యార్డ్స్ )ఎకరాల బిల్టప్ ఏరియాకు సమానమైన హక్కులను యజమానులకు కల్పించారు. ఇందులో ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీ భవన నిర్మాణాల కోసం 712.69(34,46,419.60 స్క్వేర్ యార్డ్స్) ఎకరాల విస్తీర్ణానికి సంబంధించిన టీడీఆర్ ను బిల్డర్లు కొనుక్కుని వినియోగించుకున్నారు. ఇంకా 316.39(15,31,327 స్క్వేర్ యార్డ్స్) ఎకరాలకు సంబంధించిన టీడీఆర్ బ్యాలెన్స్ ఉంది. కొత్త భవన నిర్మాణ నిబంధనలు అమల్లోకి రావడంతో మిగిలిన ఈ టీడీఆర్ కు సైతం మార్కెట్లో భారీగా డిమాండ్ ఏర్పడిందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు.
టీడీఆర్ఎలా ఉపయోగపడుతుంది?
ప్రభుత్వం రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం లేదా చెరువుల పరిరక్షణ కోసం భూమిని తీసుకున్నప్పుడు బదులుగా నగదు ఇవ్వకుండా టీడీఆర్ సర్టిఫికెట్ఇస్తుంది. దీన్ని ఉపయోగించి మనం జీహెచ్ఎంసీకి ఇచ్చిన భూమి పోను మిగిలిన భూమిలో లేదా వేరే చోట ఇల్లు కట్టుకునేటప్పుడు, సాధారణంగా అనుమతించే దానికంటే అదనపు అంతస్తులను నిర్మించుకోవడానికి ఈ టీడీఆర్ ఉపయోగపడుతుంది.
ఒకవేళ మీరు కట్టుకునే చోట 3 అంతస్తులకే అనుమతి ఉందంటే.. టీడీఆర్ ఉపయోగించి మరో రెండు అదనపు అంతస్తులు నిర్మించుకోవచ్చు. అదనపు నిర్మాణం చేసే ఉద్దేశం లేకపోతే, టీడీఆర్‌ను బిల్డర్లకు లేదా డెవలపర్లకు అమ్ముకోవచ్చు. టీడీఆర్ఉంటే బిల్డింగ్కట్టుకునేప్పుడు సెట్బ్యాక్విషయంలో కొంత మినహాయింపు ఇస్తారు. తాజాగా, 10 అంతస్తుల కంటే ఎక్కువ ఉండే భవన నిర్మాణాలకు 10 శాతం టీడీఆర్ వాడకాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో డిమాండ్మరింత పెరిగింది.

