టీ గ్యారేజ్​​.. వెరైటీ అడ్డా

V6 Velugu Posted on Dec 02, 2021

ఐటీ జాబ్. లక్షల్లో జీతం. కానీ, సొంతంగా బిజినెస్​ పెట్టాలని అనుకున్నాడు. అందరికీ టేస్టీ ఛాయ్​ అందించాలని టీ బిజినెస్​లోకి వచ్చాడు. అయితే అప్పటికే దోస్తీ, టీ పాయింట్​, ఛాయ్​క్లబ్​... వంటి టీ రిటెయిల్​ చెయిన్స్​ ​ఉన్నాయి. దాంతో కొత్త రిటెయిల్​ చెయిన్​​  స్టార్ట్​ చేస్తేనే  సక్సెస్​ వస్తుంది అనుకున్నాడు వెంకట నిఖిల్​ గౌడ్ అనే యంగ్​ ఎంట్రప్రెనూర్.  ఏడాది క్రితం ‘టీ గ్యారేజ్​’  మొదలుపెట్టాడు. ఈ మధ్యే ‘బిజినెస్​ మింట్​’ సంస్థ నుంచి  ‘బెస్ట్​ ఎమర్జింగ్​ టీ‌‌‌‌–రిటెయిల్​ అవుట్​లెట్స్–2021’ అవార్డు అందుకు న్నాడు. దేశమంతా తన టీ రుచుల్ని పరిచయం చేయాలి అనుకుంటున్న నిఖిల్​ ‘లైఫ్​’తో చెప్పిన ముచ్చట్లివి....

‘‘మాది బెల్లంపల్లి జిల్లాలోని లద్నాపూర్​. బీటెక్​ చదివిన తర్వాత మాస్టర్స్​ కోసం అమెరికా వెళ్లాను. ఇండియా తిరిగొచ్చిన తర్వాత హైదరాబాద్​లో ఒక ఐటీ కంపెనీలో రెండేండ్లు జాబ్​ చేశాను. బ్రేక్​ టైం​లో దోస్తులతో కలిసి ఉదయం, సాయంత్రం టీ తాగడానికి వెళ్లేవాడిని. రోడ్ల మీది ఛాయ్​ బండ్ల దగ్గర టీ టేస్ట్​ అనిపించేది కాదు. అప్పుడే నాకు టేస్టీ టీని తయారుచేయాలనే ఆలోచన వచ్చింది. అందుకోసం కొత్తగా టీ ఫ్రాంఛైజ్​ స్టార్ట్​ చేయాలనుకున్నా. హైదరాబాద్​లో  శివం రోడ్​లో ‘హాట్​ కప్స్​ గ్యారేజ్​ ప్రైవేట్​ లిమిటెడ్​’ అనే కంపెనీ పెట్టాను. దాదాపు ఏడాదిన్నర కాలం టీ టేస్ట్​, ఫ్రాంఛైజ్​ నడపడం గురించి వర్కవుట్​ చేశాను. నా ఫ్రెండ్ దినేష్​తో కలిసి తమిళనాడులోని కూనూరులో టీ ఎస్టేట్​ లీజుకు తీసుకున్నా. అక్కడ ఛాయ్​పత్త మేమే తయారుచేసేవాళ్లం. మేమే ఛాయ్​ పెట్టి, టీ  టేస్టర్స్​ టీమ్​కి ఇచ్చేవాళ్లం. వాళ్లు ఛాయ్​ టేస్ట్ ‘సూపర్’ అని చెప్పడంతో అవుట్​లెట్​ తెరుద్దామని డిసైడ్​ అయ్యాం.  

కాన్ఫిడెన్స్​ వచ్చింది
ఈ ఏడాది ఏప్రిల్​ 1న హైదరాబాద్​లో మొదటి ‘టీ గ్యారేజ్​’ పెట్టాం. ఇక్కడ అన్ని రకాల టీలు దొరుకుతాయని చెప్పడానికి ఈ పేరు పెట్టిన. అల్లం టీ తో పాటు మసాలా టీ, జింజర్​ లెమన్​ టీ, మట్కా టీ, కశ్మీరీ టీ, గ్రీన్​ టీలు అమ్ముతున్నాం. మా టీ వెరైటీలకి మంచి రెస్పాన్స్​ రావడంతో మా ఫార్ములా హిట్​ అవుతుందని కాన్ఫిడెన్స్​ వచ్చింది. బిజినెస్​ ఎక్స్​పాండ్​ చేయాలి అనుకున్నా. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ 20కి పైగా  మా ఫ్రాంచైజీలు ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి తమిళనాడులో కూడా ‘టీ గ్యారేజ్​’ ఓపెన్​ చేయాలనే ఆలోచనలో ఉన్నాం​. 

ట్రైనింగ్​ ఇస్తాం
‘టీ గ్యారేజ్’​  ఫ్రాంచైజ్​ తీసుకునేందుకు ఇంట్రెస్ట్​ ఉన్నవాళ్లు  (www.teagarage.in)  వెబ్​సైట్​ద్వారా మమ్మల్ని కాంటాక్ట్​ అవ్వొచ్చు. ఏ లొకేషన్​లో​ బిజినెస్​ బాగా నడుస్తుందో చూసి ఫ్రాంచైజ్​ ఇస్తాం. మిగతా టీ ఫ్రాంచైజ్​లతో పోల్చితే  మా ఫ్రాంచైజ్​ని తక్కువ ధరకే (రూ.3 లక్షలు)  ఇస్తున్నాం. అవుట్​లెట్​ డిజైన్​ నుంచి కిచెన్​ సెటప్​, టేబుళ్లు, కుర్చీల వరకు అన్నీ మేమే చూసుకుంటాం. 
ఫ్రాంచైజ్​ తీసుకున్నవాళ్లకి ట్రైనింగ్​ ఇస్తాం. దాదాపు ఆరు నెలలు మా టీమ్​ వాళ్లని ​ గైడ్​ చేస్తుంది. అంతేకాదు ఫ్రాంచైజీ స్టోర్ల పనితీరు తెలుసుకునేందుకు మధ్య మధ్యలో వెళ్తుంటాం కూడా. తమిళనాడులోని ‘కూనూరు’, పశ్చిమబెంగాల్​లోని ‘సిలిగూర్’ టీ ఎస్టేట్​లతో అగ్రిమెంట్​ చేసుకున్నాం. వాళ్లు మేం అడిగిన టీ పొడి పంపిస్తారు. అందుకే అన్ని ‘టీ గ్యారేజ్​’ అవుట్​లెట్స్​లో టీ టేస్ట్​ ఒకేలా ఉంటుంది’’.

అదే నా డ్రీమ్​
​ ‘బిజినెస్​ మింట్​’ సంస్థ ఈ ఏడాది దేశవ్యాప్తంగా ‘బెస్ట్​ ఎమర్జింగ్​ టీ రిటెయిల్​ అవుట్​లెట్స్​​’ గురించి సర్వే చేసింది. ఆ సర్వేలో మా​ ‘టీ గ్యారేజ్​’కి అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా మంది ఎంట్రప్రెనూర్​గా సక్సెస్​ అయిన తర్వాత జాబ్ మానేస్తారు. నేను మాత్రం జాబ్​ మానేసి టీ బిజినెస్​లోకి వచ్చాను. నాకు మెయిన్​ సపోర్ట్​ మానాన్న వెంకటస్వామి గౌడ్​. ఆయన బిజినెస్​, పాలిటిక్స్​లో ఉండేవాడు. నేను బిజినెస్​లోకి రావడానికి ఇన్​స్పిరేషన్​ నాన్నే. వచ్చే ఐదు లేదా పదేండ్లలో మా కంపెనీ ‘ఐపీఓ’ (ఇనిషియల్​ పబ్లిక్​ ఆఫరింగ్​)లో చోటు సంపాదించేలా చేయాలన్నది నా డ్రీమ్​. 
::: సంతోష్​ బొందుగుల

Tagged business, Bellampalli, startup, hyderabd, dostea, Tea Garage, Tea point, chai club, venkata nikhil goud, business mint

Latest Videos

Subscribe Now

More News