టీచర్ల ‘సర్దుబాటు’ పైరవీలు .. నాన్చుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ

టీచర్ల ‘సర్దుబాటు’  పైరవీలు .. నాన్చుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ
  • కోరుకున్న ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజాప్రతినిధుల సిఫార్సులు
  • మారుమూల ప్రాంతాల నుంచి టౌన్​ లకు వచ్చేందుకు పైరవీలు

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: టీచర్ల సర్దుబాటు ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది.  సర్దుబాటులో భాగంగా కోరుకున్న చోటుకు వచ్చేందుకు పలువురు టీచర్లు ప్రజాప్రతినిధులు, పొలిటికల్​ లీడర్ల నుంచి పైరవీలు చేయించుకుంటున్నారు.  ప్రధానంగా ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లోని టీచర్లు టౌన్​ పరిసర ప్రాంతాల్లోకి వచ్చేందుకు విద్యాశాఖపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.  సర్దుబాట్లపై జిల్లా విద్యాశాఖ నాన్చుడు ధోరణి అవలంభిస్తోందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.  సర్దుబాటుకు సంబంధించి వివరాలను ఫైనల్​ చేయడంలో జరుగుతున్న జాప్యంపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

నాన్చుడు ధోరణిలో సర్దుబాటు ప్రక్రియ 

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను ఈ నెల 15 లోపు సర్దుబాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ డీఈఓలకు ఇప్పటికే ఆదేశాలిచ్చింది.  స్కూల్​ కాంప్లెక్స్​, మండల, జిల్లా స్థాయిలో సర్దుబాటుకు సంబంధించి వివరాలను ఎంఈఓల నుంచి జిల్లా విద్యాశాఖాధికారులు తెప్పించుకున్నారు.  అయినప్పటికీ జిల్లాలో టీచర్ల సర్దుబాటు ప్రక్రియలో జాప్యంపై టీచర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  జిల్లాలో 1,061 స్కూల్స్​ ఉన్నాయి.  జిల్లాలో 4,159 మంది టీచర్లున్నారు.  వీరిలో దాదాపు 200 నుంచి 250  మందికి పైగా టీచర్లను సర్దుబాటు చేయాల్సి ఉంది.  

సర్దుబాటులో భాగంగా మొదటగా స్కూల్​ కాంప్లెక్స్​ పరిధిలో, మండల పరిధిలో,  జిల్లా పరిధిలో చేయాల్సి ఉంది.  మొదట జూనియర్​ టీచర్లతో సర్దుబాటు చేయాల్సి ఉంది.  ఎవరైనా సీనియర్లు సర్దుబాటులో భాగంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకుంటే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ నుంచి జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు వచ్చాయి. దీంతో పలువురు సీనియర్లతో పాటు జూనియర్లు తాము కోరుకున్న ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజాప్రతినిధులు, పొలిటికల్​ లీడర్లు, కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలతో పైరవీలకు తెర లేపారు.  

చర్చనీయాంశంగా డిప్యూటేషన్లు

 డిప్యూటేషన్లపై వచ్చిన ఉపాధ్యాయులు ఈ విద్యా సంవత్సరంలో అక్కడే ఉండే అవకాశం ఉండడంతో కొందరు టీచర్లు తమకున్న పలుకుబడిని ఉపయోగించి రాష్ట్ర స్థాయిలో డిప్యూటేషన్లకు శ్రీకారం చుట్టారు.  కరకగూడెం మండలం నుంచి లక్ష్మీదేవిపల్లి మండలానికి ఓ టీచర్​ రాష్ట్ర స్థాయిలో పైరవీ చేయించుకుని డిప్యూటేషన్​పై వచ్చారు.  డిప్యూటేషన్లపై జిల్లాలో దాదాపు 50 మంది టీచర్లు పనిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి.