ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

టీచర్ల సేవలు వెలకట్టలేనివి

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

వెలుగు నెట్ వర్క్: టీచర్ల  సేవలు వెలకట్టలేనివని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. భారతదేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం టీచర్స్ డే నిర్వహించారు. జనగామలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై మాట్లాడారు. అన్ని రంగాలకు ఆద్యుడు గురువేనని, తల్లిదండ్రుల తర్వాత గురువుకే ప్రత్యేక స్థానం ఉందన్నారు. ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పదని కొనియాడారు. ఢిల్లీ తరహాలో తెలంగాణలోని స్కూళ్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు. విద్యారంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో రూ.7వేల కోట్లతో స్కూళ్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. జనగామకు ఇప్పటికే మెడికల్ కాలేజీ మంజూరైందని, త్వరలోనే స్టేషన్ ఘన్​పూర్, పాలకుర్తిలలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను నిర్మిస్తామన్నారు. అనంతరం మంత్రి చదువుకున్న పర్వతగిరి హైస్కూల్​కు రూ.5లక్షల ఆర్థిక సాయం చేశారు. కాగా, మహబూబాబాద్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొని, ఉత్తమ టీచర్లను సత్కరించారు. ఉపాధ్యాయులు దైవంతో సమానమని, వారి వల్లే విద్యార్థులు ఎదిగి సమాజానికి గొప్ప సేవ చేస్తారని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యతో పాటు జీవిత పాఠాలు కూడా బోధించాలన్నారు.  విద్యార్థులు టీచర్లు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలని, అప్పుడే చదువులో రాణించగలుగుతారని సూచించారు.

పేకాటలో బడా బాబులు
8 మంది అరెస్ట్ ...3.59లక్షలు స్వాధీనం

వరంగల్‍(ఆత్మకూరు), వెలుగు: హనుమకొండ జిల్లా దామెర మండలం దుర్గంపేటలోని ఎన్ఎస్సార్ హోటల్​లో ఆదివారం రాత్రి పేకాట ఆడుతూ పలువురు బడా వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. టాస్క్​ఫోర్స్​ఆఫీసర్లు, ఆత్మకూర్‍ సీఐ గణేశ్​ వివరాల ప్రకారం.. ఎన్ఎస్సార్ మిల్క్​ డైరీ, స్కూల్స్​, హోటల్స్ అధినేత నాయినేని సంపత్ రావుతో పాటు మరికొందరు పేకాట ఆడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ క్రమంలో శిబిరంపై టాస్క్ ఫోర్స్ సిబ్బంది దాడులు చేయగా... పేకాట ఆడుతూ కంకణాల కరుణాకర్ రెడ్డి(కాజీపేట), బండి బలరామకృష్ణ(హనుమకొండ), ముస్కె శివారెడ్డి (హనుమకొండ), సూరం దామోదర్ రెడ్డి (హనుమకొండ),  వద్దిరాజు కవికుమార్ (బాలసముద్రం, హనుమకొండ), రాచెర్ల గోపి (రామన్నపేట, వరంగల్), కొల్లూరి అరుణ్ (హనుమకొండ), మునిగే రణధీర్ (దామెర) పట్టుపడ్డారు. నిందితుల నుంచి 8 సెల్ ఫోన్స్, రూ.3.59 లక్షల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. హోటల్‍ యజమాని సంపత్ రావు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

పోలీసుల అదుపులో సంపత్‍రావు?

ఎన్‍ఎస్‍ఆర్‍ హోటల్స్ ఓనర్‍ ఇంట్లో పేకాట ఘటనలో ప్రధాన నిందితునిగా చెప్పుకునే సంపత్‍రావు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. పోలీసులు సోదా చేసిన టైంలో నిందితుల వద్ద రూ.6 లక్షలు లభించగా..  ఆఫీసర్లు తక్కువ అమౌంట్‍ చూపినట్లు తెలుస్తోంది. సంపత్‍రావు అరెస్ట్ తో పాటు నిందితులు ఉపయోగించిన వాహనాలు చూపకుండా ఉండేందుకే సరికొత్త డీల్‍ కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లు వెనక్కు ఇచ్చేందుకు బేరం కుదుర్చుకున్నట్లు విశ్వసనీయ
 సమాచారం. 

ఇండ్ల స్థలాలపై బాధితుల ఆందోళన
సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ

వెంకటాపూర్(రామప్ప), వెలుగు: ఏండ్ల తరబడి నివసిస్తున్న గ్రామస్తుల ఇండ్ల జాగలు వేరొకరి పేరుపై ఉండడంతో వారంతా ఆందోళన చేశారు. ఈ సంఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ లో జరిగింది. తమ ఇండ్లకు రిజిస్ట్రేషన్ చేయాలని ఆఫీసుకు వెళ్తే.. ఆ స్థలాలు వేరొకరి పేరు మీద ఉండడంతో కంగుతిన్నారు. దీంతో వారంతా కలెక్టర్ కృష్ణ ఆదిత్యను ఆశ్రయించారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

డీసీపీ నుంచి ఎస్సై వరకు

ఇక నుంచి ప్రజలకు అందుబాటులో..
వరంగల్ సీపీ తరుణ్ జోషి

హనుమకొండ, వెలుగు: శాంతిభద్రల సమస్యలను పరిష్కరించేందుకు డీసీపీ స్థాయి నుంచి ఎస్సై స్థాయి వరకు ఇకపై నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారని వరంగల్ సీపీ తరుణ్ జోషి వెల్లడించారు. ఈమేరకు సోమవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. కమిషనరేట్​లో వివిధ ఫిర్యాదులను పరిష్కరించేందుకు  డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారన్నారు. 
దాంతో పాటు ఈస్ట్​, వెస్ట్​ జోన్​ డీసీపీలు  ప్రతి బుధవారం, సెంట్రల్  జోన్ డీసీపీ ప్రతి శుక్రవారం  ప్రత్యేక ప్రజావాణి నిర్వహించి ఫిర్యాదుల స్వీకరిస్తారని తెలిపారు.  అదేవిధంగా ప్రతి సోమవారం, గురువారం వరంగల్ సీపీ ఆఫీస్​లో  మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించే గ్రీవెన్స్​ లో సీపీ నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తారన్నారు. నేరుగా సీపీకి అందజేసే ఫిర్యాదులు ముందుగా తమ పరిధిలోని ఆఫీసర్లకు ఇవ్వాలని, ఆ తరువాత సీపీ దృష్టికి తీసుకురావాలని వివరించారు.

కాపర్ వైర్ దొంగల అరెస్ట్

జనగామ అర్బన్, వెలుగు: జనగామ పట్టణ శివారులో ట్రాన్స్ ఫార్మర్లు ధ్వంసం చేసి, కాపర్ వైర్లను దొంగలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ దేవేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. ఆలేరుకు చెందిన ఆలేటి గంగరాజు, గజ్వేల్  కు చెందిన పోల సిద్దయ్య, కుంట బాలు, వనం నరసింహా, గొర్రె మధు, శ్యాంపేటకు చెందిన శెట్టి నరేశ్, సౌందర్య, కాశిబుగ్గకు చెందిన వనం సుజాత చీపుర్ల వ్యాపారం చేసేవారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో దొంగతనాలకు అలవాటు పడ్డారు. చీపుర్లు అమ్ముతూ ట్రాన్స్ ఫార్మర్లను గుర్తించడం, రాత్రిపూట వెళ్లి వాటిని ధ్వంసం చేసి, కాపర్ వైర్లు దొంగలించడం చేశారు. ఇలా బచ్చన్నపేట, లింగాలఘనపూర్, జనగామ మండలాల్లో సుమారు 30 ట్రాన్స్​ఫార్మర్లలో కాపర్​ వైర్ చోరీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు.

కొత్త పింఛన్ల పంపిణీలో జాప్యం తగదు

నర్సింహులపేట(దంతాలపల్లి), వెలుగు: కొత్త  పింఛన్ కార్డుల పంపిణీలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్, సీపీఎం లీడర్లు మండిపడ్డారు. తమ స్వార్థ రాజకీయాల కోసం రోజుకో ఊరిలో పంపిణీ చేసి, జాప్యం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈమేరకు సోమవారం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలోని హైవేపై ధర్నా చేశారు. డోర్నకల్ ఎమ్మెల్యే అన్ని గ్రామాల వారికి కార్డులు పంచలేదని ఆరోపించారు. స్థానిక టీఆర్ఎస్ లీడర్లు.. తమ పార్టీలో ఉంటేనే పెన్షన్ ఇస్తామంటూ లబ్ధిదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కాగా, ఆందోళన విషయం తెలుసుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్మినేని సతీశ్, మండలాధ్యక్షులు బట్టు నాయక్, ఎంపీటీసీ నెమ్మది యాకయ్య, హరికృష్ణ, గురుపాల్ రెడ్డి, జానీ పాషా తదితరులున్నారు.

టీఆర్ఎస్​కు రోజులు దగ్గరపడ్డయ్

నర్సంపేట, వెలుగు: నియంత పాలన కొనసాగిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గరపడ్డాయని, ఉత్తరప్రదేశ్​లో అఖిలేష్​యాదవ్​కు పట్టిన గతే సీఎం కేసీఆర్​కు పడుతుందని కేంద్ర మంత్రి బీఎల్​వర్మ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయకుండా, కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారని ఫైర్​అయ్యారు. సోమవారం నర్సంపేటలో బీజేపీ స్టేట్ లీడర్ రేవూరి ప్రకాశ్​రెడ్డి అధ్యక్షతన కార్యకర్తల మీటింగ్ జరగగా.. చీఫ్ గెస్టుగా కేంద్ర మంత్రి హాజరై మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిందన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు కాదు కదా.. సింగిల్ బెడ్ రూం ఇండ్లు కూడా కట్టలేదన్నారు. యూపీలో అఖిలేశ్​సర్కార్​ను  గద్దె దించినట్లే, ఇక్కడ కూడా కేసీఆర్ ను గద్దె దించడం ఖాయమన్నారు. అనంతరం ముద్ర లోన్ లబ్ధిదారులతో ఆయన మాట్ఆలడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గోగుల రాణాప్రతాప్​రెడ్డి, బాల్నే జగన్​, వడ్డేపల్లి నర్సింహారాములు, జాటోతు సంతోష్​నాయక్ తదితరులున్నారు.

దేశభద్రత యువత చేతిలోనే..

నెల్లికుదురు(కేసముద్రం), వెలుగు: దేశ భద్రత, భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని కేంద్ర మంత్రి బీఎల్ వర్మ అన్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో యువ ఓటర్లతో నిర్వహించిన మీటింగ్ కేంద్ర మంత్రి మాట్లాడారు. యువత ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని.. మద్యం, డబ్బుకు ఓటును అమ్ముకోవద్దన్నారు. మోడీ ప్రభుత్వం యువతకు పెద్ద పీట వేస్తోందన్నారు. అనంతరం మండలంలోని రైల్వే అండర్ బ్రిడ్జిని పరిశీలించారు. రైల్వే స్టేషన్​లో సౌకర్యాలపై ఆరా తీశారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్ సందర్శించారు. ఈ–నామ్ అమలు తీరును తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ  జిల్లా అధ్యక్షుడు వద్దిరాజు రామచంద్రరావు, గిరిజన మోర్చా అధ్యక్షుడు హుస్సేన్ నాయక్, రాజవర్ధన్ రెడ్డి, మదన్ లాల్ తదితరులు పాల్గొన్నారు.

రేషన్ షాపుల్లో మోడీ ఫొటో పెట్టాల్సిందే..

నెక్కొండ, వెలుగు: కేంద్ర నిధులతో రాష్ట్ర ప్రభుత్వం పథకాలు నడుపుతూ.. ప్రధాని మోడీ ఫొటో పెట్టకపోవడం బాధాకరమని కేంద్ర మంత్రి బీఎల్ వర్మ అన్నారు. రేషన్ షాపుల్లో మోడీ ఫొటో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. సోమవారం ఆయన వరంగల్​జిల్లా నెక్కొండ మండలం అప్పల్​రావుపేట లో రేషన్​షాపును తనిఖీ చేశారు.  బియ్యం సరఫరాపై ఆరా తీశారు. అనంతరం నెక్కొండ టౌన్​లో నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి, అగ్రికల్చర్​ పనిముట్లను సబ్సిడీపై అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో మాత్రం గిట్టుబాటు ధరలేక రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు.


పిల్లలకు నులి పురుగుల నివారణ మాత్రలు వేయాలి

ములుగు, వెలుగు: ములుగు జిల్లాలో19 ఏండ్లు నిండిన చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేయాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య సూచించారు. సోమవారం ములుగు కలెక్టరేట్​లో హెల్త్ ఆఫీసర్లతో మాట్లాడారు. నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని సూచించారు. అనంతరం గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 35 దరఖాస్తులు కలెక్టర్​కు అందించగా.. ఆయా శాఖల ఆఫీసర్లకు వాటిని అప్పగించారు.

ఫిషరీస్ హబ్ గా తెలంగాణ

రేగొండ, వెలుగు: తెలంగాణ ఫిషరీస్ హబ్ గా మారబోతోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపసముద్రం చెరువులో ఎమ్మెల్యే చేప పిల్లలు వదిలారు. ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారులు లక్షాధికారులుగా మారాలనే సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. దీనిద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారికి జీవనోపాధి లభిస్తుందన్నారు.

కేసీఆర్ పిడికిలి బిగిస్తే ఢిల్లీ పీఠం కదుల్తది

ఎంపీ మాలోత్ కవిత

మరిపెడ, వెలుగు: ‘మా కేసీఆర్ మోడీ, కేడీ వేషాలకు భయపడే మాములు వ్యక్తి కాదు. చావు నోట్లో తలకాయపెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు. ఒక్కసారి పిడికిలి బిగిస్తే.. ఢిల్లీ పీఠం కదుల్తది’ అని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. సోమవారం మరిపెడ మున్సిపాలిటీ ఆఫీసులో ఎమ్మెల్యే రెడ్యా నాయక్ తో కలిసి కొత్త ఆసరా కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం జిల్లాకో కేంద్ర మంత్రిని పంపి, వారితో పచ్చి అబద్దాలు మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రులంతా కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూడాలని హితవు పలికారు. ఆయా అభివృద్ధి పనుల్ని ఢిల్లీకి వెళ్లి మోడీకి చెప్పాలని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రితో పెట్టుకుంటే కొరివితో తలగోక్కున్నట్లేనని, అసలుకే ఎసరు వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ నవీన్ రావు, మున్సిపల్  చైర్ పర్సన్ సింధూర, మరిపెడ ఎంపీపీ అరుణ ఉన్నారు.

పెన్షన్లు రానోళ్లు అప్లై చేసుకోవాలె..

పర్వతగిరి,కాజీపేట, వెలుగు: కొత్త పెన్షన్లు రానోళ్లు ఆందోళన చెందవద్దని, మళ్లీ అప్లై చేసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. సోమవారం వరంగల్​ జిల్లా పర్వతగిరిలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ తో కలిసి పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు. గత పాలనలో ఒకరు చస్తే మరొకరికి ఫించన్లు మంజూరు అయ్యే దుస్థితి ఉండేదని, ప్రస్తుతం అర్హులందరికీ అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మవద్దని, కేసీఆర్ కు రుణపడి ఉండాలని, ఆయనను మర్చిపోవద్దన్నారు. ఆ తర్వాత లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు. అనంతరం కాజీపేటలోని ఫాతిమా సర్కిల్ లో మథర్ థెరిస్సా వర్ధంతి సందర్భంగా.. ఆమె విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు.

ఇతర చోట్లా.. 

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ కొనసాగుతోంది. నర్సంపేటలోని చంద్రయ్యపల్లిలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆసరా కార్డులు అందజేశారు. జయశంకర్​భూపాలపల్లి జిల్లా మహాముత్తారంలో జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి పంపిణీ చేశారు. హనుమకొండ జిల్లా ఐనవోలులో ఎమ్మెల్యే అరూరి రమేశ్ పెన్షన్ లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. సీఎం కేసీఆర్ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు.

‘జిల్లాలో మావోయిస్టులు తిరుగుతున్నరు’

మహాదేవపూర్, వెలుగు: జిల్లాలో మావోయిస్టులు తిరుగుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ సురేందర్ రెడ్డి సూచించారు. సోమవారం మహారాష్ట్ర, చత్తీస్​గఢ్ సరిహద్దు ప్రాంతమైన పలిమెల మండలంలో ఎస్పీ పర్యటించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ముకునూరు, గేర్రాయిగూడెం, ఇచ్చంపల్లి, నీలంపల్లి, సర్వాయిపేట, కామన్ పల్లి గ్రామాలను సందర్శించారు. మావోయిస్టులు ప్రజలను ప్రలోభాలకు గురిచేసి, చెడు మార్గం వైపు నడిపించేలా ప్రోత్సహిస్తారని, వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా పర్యటిస్తున్నట్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలన్నారు. యువకులు మావోయిస్టులకు సమకరించి, తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. అంతకుముందు ముకునూరు, పలిమెలలోని గిరిజనులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మహాదేవ్ పూర్ సీఐ కిరణ్, ఎస్సైలు అరుణ్ కుమార్, రాజ్ కుమార్ తదితరులున్నారు.

రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ 

హనుమకొండ సిటీ, ఎల్కతుర్తి, వెలుగు: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హనుమకొండ ఏసీపీ కిరణ్​ కుమార్ హెచ్చరించారు. సోమవారం హనుమకొండ, సుబేదారి, కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. అలాగే హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆరుగురు రౌడీ షీటర్లను ఎస్సై పరమేశ్​తహసీల్దార్ రవీందర్ రెడ్డి ఎదుట బైండోవర్ చేశారు.

గుట్కా అమ్మకందారుల అరెస్ట్.. 

హనుమకొండ జవహర్ కాలనీకి చెందిన చిదిరాల మహేందర్ రెడ్డి, కేఎల్ ఎన్ రెడ్డీ కాలనీకి చెందిన ముక్క శ్రీకాంత్ గుట్కా వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం రాగా, పబ్లిక్ గార్డెన్ వద్ద ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ.76వేల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.