ఏ స్కూల్​కు పోవాలె?

ఏ స్కూల్​కు పోవాలె?
  • టీచర్ల జిల్లాల అలకేషన్ పూర్తి..   
  • అయోమయంలో లక్ష మంది 
  • అలాటైన జిల్లాల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశం
  • పోస్టింగ్ లు ఎప్పుడు ఇస్తారనే దానిపై నో క్లారిటీ

హైదరాబాద్, వెలుగు: అనేక గందరగోళాల మధ్య ఎట్టకేలకు టీచర్ల కొత్త జిల్లాల అలకేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. టీచర్ల యూనియన్లు ఎన్ని ఆందోళనలు చేసినా, సర్కారు చేయాలనుకున్నదే చేసింది. టీచర్లకు జిల్లాల అలాట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసింది. వారి సెల్​ఫోన్లకు అలాట్మెంట్ మెసేజ్ వచ్చిన మూడు రోజుల్లో కేటాయించిన జిల్లాల్లో రిపోర్టు చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఆదేశించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా, అలాటైన జిల్లాలో రిపోర్టు చేసిన తర్వాత ఏం చేయాలనే దానిపై విద్యాశాఖ అధికారులు క్లారిటీ ఇవ్వట్లేదు. మరోపక్క కొత్త జిల్లాల్లో ఎప్పుడు పోస్టింగ్​లు ఇస్తారో చెప్పడం లేదు. దీంతో లక్ష మంది టీచర్లు ఆందోళన చెందుతున్నారు.

ఏ అధికారికి తెలుస్తలేదు?
సర్కార్, లోకల్ బాడీ స్కూళ్లలో 1.05 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. వీరందరినీ ఉమ్మడి పది జిల్లాల నుంచి 33 జిల్లాల అలకేషన్​కు ఈనెల ఫస్ట్ వీక్​లో సర్కారు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ముందుగా మీడియం, కేడర్, సబ్జెక్టుల వారిగా సీనియార్టీ లిస్టులు ప్రకటించిన తర్వాత ఆప్షన్లు తీసుకోవాలి. కానీ అదేదీ పట్టించుకోకుండా ఫైనల్ లిస్టులు ఇవ్వకుండానే ఆప్షన్లు తీసుకున్నారు. లిస్టుల్లో తప్పులున్నాయనీ ఫిర్యాదులు వచ్చినా, ఆఫీసర్లు పట్టించుకోలేదు. చివరిగా రెండు రోజుల నుంచి జిల్లాల అలకేషన్ ప్రాసెస్​ మొదలై, బుధవారంతో పూర్తయింది. ఇప్పటికే టీచర్లకు అలాటైన జిల్లాల వివరాలతో కూడిన మెసేజ్​లు ఫోన్లకు వచ్చాయి. గురువారం కూడా కొంతమందికి మెసేజ్ లు పంపించారు. వాటిలోంచి అలాట్మెంట్ ఆర్డర్ కాపీ డౌన్​లోడ్ చేసుకుని, అలాటైన జిల్లాలో డీఈవో ఆఫీసుల్లో రిపోర్టు చేయాలని టీచర్లకు ఆఫీసర్లు సూచించారు. ఆ తర్వాత ఏం చేయాలనే దానిపై డీఈవోలతో పాటు డైరెక్టరేట్​లోనూ ఎవ్వరికీ క్లారిటీ లేకపోవడం అందరినీ గందరగోళానికి గురిచేస్తోంది.

ఏ స్కూలుకు వెళ్లాలి?
కొత్త జిల్లాలకు అలాటైన టీచర్లకు పోస్టింగులు వెంటనే ఇస్తారా లేదా అనే దానిపై ఆఫీసర్లు స్పష్టత ఇవ్వడం లేదు. దీనికోసం సర్కారు ప్రత్యేకంగా గైడ్​లైన్స్ ఇస్తుందనీ చెప్తున్నారు. ఆ గైడ్ లైన్స్ వచ్చేవరకూ టీచర్లు ఏ స్కూల్ పోవాలనే దానిపై ఆఫీసర్లు చెప్పడం లేదు. కనీసం ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాలకే అలాటైన వారు... పాత స్కూళ్లలో పనిచేయాలా లేదా అనే విషయంపైనా క్లారిటీ ఇవ్వడం లేదు. అలాట్మెంట్ లోనూ పలు జిల్లాల్లో తప్పులు దొర్లాయి. అలాట్మెంట్ లిస్టులో ఒక జిల్లా పేరుండి, మెసేజ్ మాత్రం వేరే జిల్లా వచ్చింది. రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో పలువురు టీచర్లకు ఇలాంటి తప్పులు రావడంతో ఆందోళనకు గురయ్యారు. హెడ్మాస్టర్ల అలాట్మెంట్ కూడా ఒకటీ, రెండు రోజుల్లో పూర్తికానున్నట్టు అధికారులు చెప్తున్నారు. “జిల్లాల్లో రిపోర్టు చేయాలని మాత్రమే చెప్పినం. గైడ్​లైన్స్ ఇచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది. అప్పటి వరకూ టీచర్లు వెయిట్ చేయాలి” అని ఓ ఉన్నతాధికారి వెలుగుతో చెప్పారు. అయితే అప్పటి వరకూ పాత స్కూళ్లలోనే పనిచేయాలా అనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదు.