హైదరాబాద్, వెలుగు: పెండింగ్ లో ఉన్న విద్యారంగ, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ ప్రకటించింది. ప్రభుత్వం హామీలు ఇస్తున్నా ఆచరణలో మాత్రం శూన్యమని పేర్కొన్నది. మంగళవారం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ అనిల్ కుమార్ అధ్యక్షతన రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న 5 డీఏల గురించి సర్కార్ మాట్లాడటం లేదని, డిసెంబర్ లో ఇస్తానన్న డీఏ కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలో ఇస్తామన్న నగదు రహిత వైద్య పథకం మూడు నెలలు గడిచినా కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. 30 నెలలు గడిచినా పీఆర్సీ నివేదికను తెప్పించుకోలేదని, రిటైరైన ఉద్యోగులకు పెన్షనరీ బెనిఫిట్స్ విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
టీచర్లు, పింఛనర్ల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని ‘ఉద్యోగ, ఉపాధ్యాయులు, పింఛనర్లు, కార్మికుల ఐక్య వేదిక’ (జేఏసీ)ను కోరారు. ఈ సమావేశంలో చావ రవి, ఎ వెంకట్ (యూటీఎఫ్), ఎన్. తిరుపతి (టీపీటీఎఫ్), ఎం. సోమయ్య, టి. లింగారెడ్డి (డీటీఎఫ్), జాడి రాజన్న (ఎస్సీఎస్టీటీఎఫ్), ఎస్. హరికృష్ణ, శ్రీను నాయక్ (టీటీఏ), వై. విజయ కుమార్, రవీందర్ (ఎస్సీఎస్టీ టీయూ), ఎం. మహేశ్ (ఎంఎస్టీఎఫ్), ఎం. సైదులు (బీటీఎఫ్) తదితరులు పాల్గొన్నారు.
