సీఎం ఓయూ పర్యటనను స్వాగతిస్తున్నం.. బోధన బోధనేతర ఉద్యోగుల జేఏసీ

సీఎం ఓయూ పర్యటనను స్వాగతిస్తున్నం.. బోధన బోధనేతర ఉద్యోగుల జేఏసీ

బషీర్​బాగ్, వెలుగు: డిసెంబరు 7న సీఎం రేవంత్​రెడ్డి ఓయూ పర్యటనను స్వాగతిస్తున్నామని, అలాగే తమ సమస్యలపై దృష్టి సారించాలని ఓయూ బోధన, బోధనేతర ఉద్యోగుల జేఏసీ కోరింది. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో  జేఏసీ ప్రతినిధులు ప్రొఫెసర్ మనోహర్, ప్రొఫెసర్ సురేందర్ రెడ్డి, డా. పరుశురాం , డా. ధర్మతేజ మాట్లాడారు. తమ సమస్యలపై సీఎం సానుకూలంగా ఉన్నప్పటికీ.. అధికారులు, ముఖ్యంగా ఓయూ  వీసీ పెడచెవిన పెడుతున్నారని  ఆరోపించారు. 

ఔట్ సోర్సింగ్, పార్ట్ టైమ్, కాంట్రాక్టు విభాగాల్లో సుమారు ఒక్కొక్కరు 20 నుంచి 25 సంవత్సరాలు పనిచేస్తున్నా కనీస వేతనాలు లేవన్నారు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా అన్ని సౌకర్యాలు తమకు కల్పించాలన్నారు. నేడు సీఎం పర్యటనను స్వాగతిస్తూ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎన్సీసీ గేట్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఓయూ: సీఎం పర్యటనకు ఓయూ విద్యార్థులు,అధ్యాపకులు స్వాగతం పలకడం సానుకూల పరిణామమని పీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ అభిప్రాయపడ్డారు.  గురువారం ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు కేటాయించకుండా యూనివర్సిటీని నిర్వీర్యం చేసిందన్నారు. కానీ నేడు కాంగ్రెస్ పరిపాలన లో ఓయూను ప్రక్షాళన చేసి, నిధులు, నియామకాలతో ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సీఎం ఉన్నారన్నారు. ఎన్ఎన్ఐయూఐ ఓయూ నాయకుడు మేడ శ్రీను, బట్టపోతుల మోహన్ రావు, నిరుద్యోగ నేత ఈశ్వర్ నాయక్  తదితరులు ఉన్నారు. 

పార్ట్ టైం ప్రొఫెసర్ల బాధ నివేదన సభ

ఓయూలో సీఎం పర్యటనకు స్వాగతం పలుకుతూ గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో యూనివర్సిటీ పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్లు బాధ నివేదన సభ నిర్వహించారు. డాక్టర్ సూరేపల్లి వెంకటరత్నం, డాక్టర్ పండరి రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ విద్యా కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్లు అడిగే కోరికలు న్యాయమైనవని, సమాన పనికి సమాన వేతనం అందజేయాలన్నారు. 

వీరి విషయంలో తమ కమిషన్ నుంచి ప్రభుత్వానికి నివేదిక అందించామని, దాని ఫలితాలు వెనువెంటనే రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ, సైఫాబాద్ సైన్స్ కాలేజ్, సికింద్రాబాద్ పీజీ కాలేజీ, నిజాం కాలేజీ , ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ నుంచి అధిక సంఖ్యలో పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ పాల్గొన్నారు.