మహారాష్ట్ర రాష్ట్రం నాగ్ పూర్ సిటీ. ముగ్గురు ఫ్రెండ్స్. వీళ్లల్లో ఒకడు పిల్లోడు.. ఈ ముగ్గురు కలిసి మందు పార్టీ చేసుకున్నారు. పార్టీ అయిన తర్వాత బిల్లు వచ్చింది. ముగ్గురూ సమానం అనుకున్నారు. తన వాటా కింద ఉన్న డబ్బులను తర్వాత ఇస్తానని చెప్పాడు ఆ పిల్లోడు.. పిల్లోడు అంటే మైనర్.. ఆ తర్వాతనే అసలు గొడవ స్టార్ట్ అయ్యింది. వాటా డబ్బులు వెయ్యి రూపాయల కోసం పిల్లోడిని పదే పదే అడిగాడు ఆ కుర్రోడు.. చిర్రెత్తుకొచ్చింది.. ఆ తర్వాత ఆ పిల్లోడు.. ఆ కుర్రోడిని ఏసేశాడు.. అవును.. వాడు చేసిన పని చూసి.. తీరు చూసి నాగ్ పూర్ సిటీనే షాక్ అయ్యింది. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
నాగ్ పూర్ సిటీ అజ్ని పోలీస్ స్టేషన్ ఏరియాలోని శ్రీకృష్ణ నగర్ ప్రాంతం. యోగేష్, అనిల్ కక్డే, పిల్లోడు (మైనర్ కావటంతో పేరు వెళ్లడించలేదు పోలీసులు). ముగ్గురు మందు పార్టీ చేసుకున్నారు. పార్టీ తర్వాత ఒక్కక్కరి వాటా 11 వందల రూపాయలు. డబ్బులు తర్వాత ఇస్తానంటే.. పిల్లోడి డబ్బులను యోగేష్ కట్టాడు.
పార్టీ జరిగిన తర్వాత రోజు యోగేష్ తన డబ్బులు అడిగాడు. నా వాటా డబ్బులను అనిల్ తో సెటిల్ చేసుకున్నాను.. నేను నీకు డబ్బులు ఇచ్చేది లేదంటూ ఆ పిల్లోడు తెగేసి చెప్పాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చుట్టుపక్కల వాళ్లు సర్దిచెప్పటంతో అక్కడితో వ్యవహారం చల్లబడింది.
2026, జనవరి 23వ తేదీ రాత్రి పాన్ షాపు దగ్గర ఉన్న పిల్లోడి దగ్గరకు యోగేష్ వచ్చాడు. నా 11 వందల రూపాయలు ఇవ్వాల్సిందే అని పట్టుబట్టాడు. గొడవ పడ్డారు. కోపం ఆపుకోలేక ఆ పిల్లోడిని నాలుగు పీకాడు యోగేష్..
ఒంటిపై దెబ్బలు పడుతుంటే ఆ పిల్లోడులో కోపం కట్టలు తెంచుకుంది. అప్పటికే తన దగ్గర ఉన్న కత్తితో యోగేష్ పై దాడి చేశాడు. క్రైం సినిమాల్లో మర్దర్ సీన్స్ చూపించినట్లు.. కసితో ఇష్టమొచ్చినట్లు.. ఎక్కడపడితే అక్కడ.. ఎలా పడితే అలా కసితీరా పోట్లు వేశాడు ఆ పిల్లోడు. అంతటితో ఆగలేదు. రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్న యోగేష్ ను.. ఈడ్చుకెళ్లి... పక్కనే ఉన్న మురికి కాలువలో పడేశాడు. ఆ పిల్లోడు చంపుతున్న తీరు.. నరుకుతున్న తీరు చూసి చుట్టుపక్కల వాళ్ల దగ్గరకు వెళ్లటానికే భయపడ్డారు. వణికిపోయారు. లైవ్ మర్దర్ చూసినట్లు చూశారు.
స్పాట్ నుంచి ఆ పిల్లోడు వెళ్లిపోయిన తర్వాత యోగేష్ ను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు చెప్పారు డాక్టర్లు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మైనర్ హంతకుడిని పట్టుకున్నారు.
11 వందల రూపాయల మందు పార్టీ వాటా గొడవ.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నది.. ఆ పిల్లోడు చేసిన హత్య నాగ్ పూర్ సిటీలోనే హాట్ టాపిక్ అయ్యింది.
