లెటర్​ టు ఎడిటర్​ : మొబైల్ యాప్​లతో బోధన కరువు

లెటర్​ టు ఎడిటర్​  :  మొబైల్ యాప్​లతో బోధన కరువు

తెలంగాణ ప్రభుత్వ విద్యా శాఖ అధికారులు  ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న ప్రతి విషయం మొబైల్ యాప్​లో నమోదు చెయ్యాలని ఆదేశాలు జారీ చెయ్యడంతో పాఠశాల తరగతి గదిలో జరిగే బోధన మొత్తం వివిధ రకాల మొబైల్ యాప్​ల చుట్టూ తిరుగుతోంది. పాఠశాల ఉదయం ప్రారంభం కాగానే మొదటి పిరియడ్​లో  తరగతి గదికి వెళ్లిన క్లాస్ టీచర్ హాజరు రిజిస్టర్ లో విద్యార్థుల హాజరు తీసుకోవడంతో పాటు ఫేస్ రికగ్ననేషన్ అనే యాప్​లోవిద్యార్థుల  ఫొటోలు అప్​లోడ్​ చెయ్యాలి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి సుమారు 30 నిమిషాల సమయం పడుతుంది. ఈ సమయం పోగా బోధనకు 15నిమిషాలు మాత్రమే మిగులుతది.  

 ఉన్నత పాఠశాలలో ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో తొలి మెట్టు అనే బోధన కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమాల మీద ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి వీటి ప్రకారమే బోధన చెయ్యాలని నిర్దేశించడం జరిగింది. ఈ బోధన కార్యక్రమాల ప్రకారం విద్యార్థులకు ప్రతినెల పరీక్ష నిర్వహించి, విద్యార్థులు సాధించిన ప్రగతిని, తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్​లో ప్రతి నెల నమోదు చెయ్యాలి.  విద్యార్థులకు పాఠశాలలో  నిర్వహించే ఫార్మేటివ్ అసెస్​మెంట్, సమ్మెటివ్ అసెప్​మెంట్​ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. వీటిలో సాధించిన విద్యార్థుల ప్రగతిని కూడా ఆన్​లైన్​లో నమోదు చెయ్యాలి. మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థుల సంఖ్యను, అల్పాహారం చేసిన విద్యార్థుల సంఖ్యను కూడా  మొబైల్ యాప్​లో నమోదు చెయ్యాలి. పాఠశాలలో ఉపాధ్యాయులు రోజు మొత్తం మొబైల్ యాప్లతో కుస్తీ పడడంతో విద్యాబోధన సరిగా చేయలేకపోతున్నారు. 

- పల్లె నాగరాజుటిఫిటిఎఫ్,  ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి