అభిమానుల ప్రేమతోనే కోలుకున్నా..వన్డే వరల్డ్ కప్‌‌‌‌ ఫైనల్ ఓటమి బాధను : రోహిత్‌‌‌‌ శర్మ

అభిమానుల ప్రేమతోనే కోలుకున్నా..వన్డే వరల్డ్ కప్‌‌‌‌ ఫైనల్ ఓటమి బాధను  : రోహిత్‌‌‌‌ శర్మ

న్యూఢిల్లీ: వన్డే వరల్డ్ కప్‌‌‌‌ ఫైనల్ ఓటమి బాధను ఎలా మరిచిపోవాలో..  దాని నుంచి ఎలా బయటపడాలో తనకు తెలియలేదని టీమిండియా కెప్టెన్ రోహిత్‌‌‌‌ శర్మ తెలిపాడు. మెగా టోర్నీలో ఓడినా జట్టుపై అభిమానులు చూపించిన ప్రేమ, ఆప్యాయతే  తాను కోలుకొని మరో లక్ష్యంపై గురి పెట్టేలా చేసిందని తెలిపాడు. తన తదుపరి లక్ష్యం ఏమిటన్నది రోహిత్ వెల్లడించకపోయినా వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌‌‌‌ అని తెలుస్తోంది.

సొంతగడ్డపై వరల్డ్ కప్‌‌‌‌లో సూపర్ పెర్ఫామెన్స్ చేసిన హిట్‌‌‌‌మ్యాన్‌‌‌‌ ఫైనల్లో ఓడిన తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటూ గ్రౌండ్‌‌‌‌ను వీడాడు. టోర్నీ తర్వాత ఫ్యామిలీతో కలిసి రెండు వారాల ఇంగ్లండ్‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన రోహిత్ ఆ ఓటమి గురించి తొలిసారి స్పందించాడు. ‘నేను చిన్నప్పటి నుంచి వన్డే వరల్డ్ కప్‌‌‌‌ను చూస్తూ పెరిగా. అదే  నా అంతిమ లక్ష్యం అనుకున్నా. కొన్నేండ్లుగా  మేం చాలా కష్ట పడినా దాన్ని అందుకోలేకపోవడం నిరాశ కలిగించింది.

ఆ ఓటమి బాధ నుంచి ఎలా బయటపడాలో  కొన్ని రోజులు నాకు అస్సలు అర్థం కాలేదు. ఆ సమయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌‌‌‌ నాకు మద్దతుగా నిలిచారు. అయినా ఆ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టమైంది. రోజులు గడుస్తున్నా నేను మాత్రం ముందుకెళ్లలేకపోయా. దాంతో రిలీఫ్​ కోసం ఫారిన్‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌కు వెళ్లా. అక్కడ అభిమానులు, ప్రజలు నా దగ్గరకు వచ్చి టీమిండియాను చూసి గర్వపడుతున్నాం అంటూ  చెప్పిన మాటలు నాకెంతో ఉపశమనం కలిగించాయి. వాళ్లు చూపెట్టిన ప్రేమ  మరో లక్ష్యం దిశగా నడిచేందుకు నాలో స్ఫూర్తి నింపింది’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.