
- సవాళ్లకు ఎదురొడ్డిన కుర్రాళ్లు
- భవిష్యత్తుకు భరోసా కల్పించిన గిల్‌సేన
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్. దశాబ్దానికి పైగా టీమిండియాకు వెన్నెముకగా నిలిచిన ప్లేయర్లు. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్‌లో కెప్టెన్‌గా రోహిత్.. బ్యాటర్‌గా కోహ్లీ, స్పిన్ ఆల్‌రౌండర్‌గా అశ్విన్ పాత్ర వెలకట్టలేనిది. ఆస్ట్రేలియాలో బోర్డర్–గావస్కర్ ట్రోఫీ తర్వాత అశ్విన్ టాటా చెప్పగా.. అత్యంత కఠినమైన ఇంగ్లండ్ టూర్‌కు ముందు కోహ్లీ, రోహిత్ వారం వ్యవధిలో టెస్టుల నుంచి తప్పుకొని అందరికీ షాకిచ్చారు. దాంతో రెండు నెలల కిందట ఈ ముగ్గురూ లేకుండా ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన యంగ్‌స్టర్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని టీమిండియాపై ఎవ్వరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ, నువ్వానేనా అన్నట్టు సాగిన ఐదు టెస్టు మ్యాచ్‌ల తర్వాత ఈ యంగ్ ఇండియా.. అంచనాలు తారుమారు చేయడమే కాదు. భవిష్యత్తుకు భరోసా కూడా ఇచ్చింది.
దిగ్గజాల రిటైర్మెంట్ తర్వాత సంధికాలం, కష్టకాలం ఒకేసారి ఎదురైనా.. కుర్రాళ్లంతా కలిసి కట్టుగా కదం తొక్కి.. పట్టువదలకుండా పోరాడిన తీరు అమోఘం. మొత్తంగా 45 రోజుల హోరాహోరీ పోరాటం తర్వాత సిరీస్ 2–2తో సమం కావడం ఇరు జట్లకు సరైన ఫలితమే. లీడ్స్, లార్డ్స్‌లో ఓడిన మ్యాచ్‌లను ఇండియా సులభంగా గెలిచి ఉండొచ్చు. కానీ ఈ అనుభవాలు యువ ఆటగాళ్లకు మంచి పాఠాలు నేర్పాయి. లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్, ఓవల్ టెస్టుల్లో పోరాట స్ఫూర్తిని వదలకుండా రెండు సార్లు అద్భుతంగా పుంజుకొని తమ సత్తా ఏంటో చూపెట్టింది. మొత్తంగా పనైపోయింది అనుకుంటున్న టెస్టు ఫార్మాట్‌కే ప్రాణం పోసేలా చేసిన టీమిండియా అద్భుత పోరాటంలో ముఖ్యమైన వాటిని ఓసారి
పరిశీలిద్దాం.
గిల్ కెప్టెన్ ఇంపాక్ట్
ఒక యువ నాయకుడిగా గిల్ తన తొలి టెస్ట్ సిరీస్‌లో సాధించిన ఈ ఫలితం నిజంగా అద్భుతమైనది అనొచ్చు. గతంలో ఇంగ్లండ్ పిచ్‌లపై పెద్దగా రాణించని గిల్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా తన సామర్థ్యంపై ప్రశ్నలకు బదులిస్తూ, తన తొలి ఇన్నింగ్స్‌లోనే క్లాసిక్ సెంచరీ (147)తో అందరి మన్ననలూ అందుకున్నాడు. ఆ తర్వాత ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ,సెంచరీతో జట్టును గెలిపించి లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఘన వారసత్వాన్ని కొనసాగించే సత్తా తనకుందని చాటి చెప్పాడు. బ్యాటింగ్‌లో టెక్నికల్‌గా, మెంటల్‌గా కొన్ని సర్దుబాట్లు చేసుకుని తన ఆటను మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు. లార్డ్స్ టెస్టులో నిరాశ పరిచిన తర్వాత మాంచెస్టర్‌లో మ్యాచ్‌ను కాపాడిన 103 రన్స్ కీలక ఇన్నింగ్స్ ఈ సిరీస్‌లో అతని బెస్ట్ అనొచ్చు. మొత్తంగా 10 ఇన్నింగ్స్‌ల్లో 754 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సోమవారం ఇంగ్లండ్ 9వికెట్లు కోల్పోయి విజయానికి మరో 17 రన్స్ దూరంలో ఉన్నప్పుడు బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్లను ఉంచి ఒత్తిడిని పెంచడం, పాత బాల్‌తో సిరాజ్, ప్రసిధ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తుండటంతో కొత్త బాల్ తీసుకోకుండా గిల్ తన కెప్టెన్సీ స్కిల్స్ కూడా చూపెట్టాడు. అయితే, . కెప్టెన్‌గా ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని గిల్‌కు తెలుసు.
జడ్డూ పెద్దన్నలా..
ప్రస్తుతం టీమ్‌లో అందరికంటే సీనియర్ అయిన 36 ఏండ్ల రవీంద్ర జడేజా.. ఈ సిరీస్‌లో పెద్దన్న పాత్ర పోషించాడు. ఆల్‌రౌండర్ పాత్రను అత్యంత సమర్థవంతంగా నిర్వహించాడు. నిజానికి కోహ్లీ, రోహిత్ వంటి టాప్ క్లాస్ క్రికెటర్లు టీమ్‌లో ఉన్నప్పుడు జడేజా టాలెంట్ పెద్దగా వెలుగులోకి రాలేదు. ఇప్పుడు ఆ ఇద్దరూ రిటైర్ కావడంతో బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏర్పడిన లోటును పూరించాల్సిన బాధ్యత జడేజాపై పడింది. మిడిలార్డర్‌కు వెన్నెముకగా నిలిచిన జడ్డూ ఓ సెంచరీ, ఐదు ఫిఫ్టీలు సహా 516 రన్స్‌తో ఈ సిరీస్ తన కెరీర్‌లో గుర్తుండేలా మార్చుకున్నాడు. జట్టు తడబడిన ప్రతిసారి నేనున్నానని ముందుకొచ్చిన జడ్డూ నాలుగుసార్లు నాటౌట్‌గా నిలిచి సిరీస్‌లో అత్యధిక బ్యాటింగ్ సగటు సాధించాడు. మూడో టెస్టులో టెయిలెండర్ల నుంచి ఇంకాస్త సపోర్ట్ దొరికి ఉంటే అతను మ్యాచ్‌ను గెలిపించేవాడు. అదే జరిగితే సిరీస్ ఇండియా సొంతం అయ్యేదేమో.
రాహుల్, సుందర్ నమ్మకం నిలబెట్టారు
రెండు జట్ల ఆటగాళ్లలో అత్యంత నమ్మకమైన బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ నిలిచాడు. తన ప్రతీ ఇన్నింగ్స్ ఇంగ్లండ్ పరిస్థితుల్లో ఎలా బ్యాటింగ్ చేయాలో చెప్పే ఓ మాస్టర్ క్లాస్ అనొచ్చు. బాల్‌ను లేట్‌గా, బాడీకి క్లోజ్‌గా ఆడుతూ ఇంగ్లిష్ బ్యాటర్లను విసిగించాడు. గిల్, జడేజాతో పాటు ఈ సిరీస్‌లో 500 ప్లస్ రన్స్ చేసిన మూడో బ్యాటర్ రాహుల్. వాషింగ్టన్ సుందర్ కూడా సూపర్ పెర్ఫామెన్స్ చేశాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటర్‌గా అదరగొట్టాడు. ముఖ్యంగా ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జడేజాతో కలిసి సెంచరీ సాధించి ఇండియాకు ఓటమి తప్పించిన ఈ యంగ్ ఆల్‌రౌండర్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
పంత్, వోక్స్ డేరింగ్
రిషబ్ పంత్, క్రిస్ వోక్స్ చూపించిన ధైర్యసాహసాలు ఈ సిరీస్‌కు మరింత వన్నె తెచ్చాయి. మాంచెస్టర్‌లో పంత్ తన కాలు వేలు విరిగినా జట్టు కోసం మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి కీలకమైన రన్స్ చేశాడు. ఇక, చివరి టెస్టులో వోక్స్ భుజం గాయం కారణంగా ఆడలేకపోయినా ఓటమి అంచులో నిలిచిన జట్టును రక్షించడం కోసం ఒక చేత్తో బ్యాటింగ్ చేయడానికి వచ్చి శభాష్ అనిపించుకున్నాడు.
అల్టిమేట్ యాక్షన్.. డ్రామా
ఇరు జట్ల ప్లేయర్లు ఆటతోనే కాకుండా భావోద్వేగాలతోనూ తలపడ్డారు. తొలి రెండు టెస్టులు కూల్‌గానే సాగినా.. లార్డ్స్ టెస్టు మూడో రోజు ఆటలో బుమ్రా చివరి ఓవర్ ఇరు జట్ల మధ్య ఆన్ ఫీల్డ్ టెన్షన్స్ ఒక్కసారిగా పెరిగాయి. జాక్ క్రాలీతో శుభ్‌మన్ గిల్ వాగ్వాదానికి దిగడం, ఇంగ్లండ్ ఓపెనర్ ఆటను ఆలస్యం చేస్తున్నందుకు ఇండియా ప్లేయర్లంతా వ్యంగ్యంగా చప్పట్లు కొట్టడం ఆటలో హీట్‌ను పెంచాయి. ఇక, ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో డ్రా మాత్రమే సాధ్యమని తెలిసినా ఇండియా బ్యాటింగ్ కొనసాగించినప్పుడు స్టోక్స్ తన అసహనాన్ని వ్యక్తం చేయడం కూడా చర్చనీయాంశమైంది. ఇక, సిరీస్ ఆఖరి రోజు 56 నిమిషాల్లో విజయం కోసం ఇరు జట్లూ పోరాడిన తీరుయాక్షన్ థ్రిల్లర్ సినిమాకు ఏమాత్రం తీసిపోదు.
సిరాజ్ బన్‌గయా పేస్ లీడర్
ఈ సిరీస్‌లో ఐదు టెస్ట్‌లు ఆడిన ఏకైక ఫాస్ట్ బౌలర్ సిరాజ్. ఓవల్ టెస్ట్‌లో చివరి వికెట్‌తో ఇండియాకు చిరకాలం గుర్తుండిపోయే విజయం అందించిన అతను సిరీస్‌లో మొత్తం 23 వికెట్లతో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. కీలకమైన బుమ్రా కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్నప్పుడు సిరాజ్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ లాగే జట్టుకు అదనపు ఓవర్లు అవసరమైనప్పుడు ముందుకు వచ్చి ప్రత్యర్థిపై ఒత్తిడిని కొనసాగించాడు. పనిభారం కారణంగా బుమ్రా రెండు మ్యాచ్‌లకు రెస్ట్ తీసుకోగా.. ఆ పదమే తన డిక్షనరీలో లేదన్నట్టుగా సిరాజ్ అదరగొట్టాడు. ప్రస్తుతం బుమ్రా ఫిట్‌నెస్‌పై ప్రశ్నలతో పాటు లాంగ్ ఫార్మాట్‌లో అతని ఫ్యూచర్‌పై అనుమానాలు ఉన్నాయి. ఈ టైమ్‌లో జట్టు బౌలింగ్ దాడిని ముందుకు నడిపించేందుకు తాను సిద్ధమని సిరాజ్ నిరూపించాడు. తను ఈ భరోసా కలిగిస్తే కొత్త పేసర్లను తీర్చిదిద్దేందుకు మేనేజ్‌మెంట్‌కు మరింత అవకాశం కలుగుతుంది.