
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికైన ఇండియా జట్టు రెండు బ్యాచ్‌లుగా అక్కడికి వెళ్లనుంది. లాజిస్టిక్స్, టిక్కెట్ల లభ్యతను బట్టి తుది ప్రయాణ షెడ్యూల్‌ను నిర్ణయించనున్నారు. ఈ నెల 15న న్యూఢిల్లీ నుంచి ఉదయం ఒక్క బ్యాచ్, సాయంత్రం రెండో బ్యాచ్ బయలుదేరే అవకాశం ఉంది.
సుదూర ప్రయాణం కావడంతో బిజినెస్ క్లాస్ టిక్కెట్ల లభ్యతపై ట్రావెలింగ్ ఆధారపడి ఉంది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు కొత్త వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆసీస్ బయలుదేరే ముందు ఢిల్లీలో మిగిలిన టెస్టు ప్లేయర్లతో కలవనున్నారు. ఈ నేపథ్యంలో విరాట్, రోహిత్ ఒక రోజు ముందుగానీ, లేదా ప్రయాణం రోజుగానీ ఢిల్లీకి చేరుకుంటారు.
టీమ్ మొత్తం ముందుగా పెర్త్‌కు చేరుకుంటుంది. 19న అక్కడ తొలి వన్డే జరగనుంది. ఒకవేళ ఇండియా, వెస్టిండీస్ మధ్య జరిగే రెండో టెస్ట్ షెడ్యూల్ కంటే ముందుగానే ముగిస్తే ప్లేయర్లకు స్వల్ప విరామం ఇచ్చి ఇళ్లకు వెళ్లి రావడానికి చాన్స్ ఇవ్వొచ్చు. ఇక ఆసీస్ టూర్‌కు బయలుదేరే ముందు ప్లేయర్లందరికీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రాజిందర్ నగర్‌లోని తన నివాసంలో విందు ఇవ్వనున్నాడు. ప్లేయర్ల మధ్య స్నేహాన్ని పెంపొందించడానికి ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నారు.