రీఎంట్రీకి హార్దిక్ పాండ్యా రెడీ.. హైదరాబాద్‌‌లో బరోడా తరఫున.. ముస్తాక్‌‌ అలీ మ్యాచ్ బరిలోకి..

రీఎంట్రీకి హార్దిక్ పాండ్యా రెడీ.. హైదరాబాద్‌‌లో బరోడా తరఫున.. ముస్తాక్‌‌ అలీ మ్యాచ్ బరిలోకి..

న్యూఢిల్లీ: గాయం నుంచి కోలుకున్న టీమిండియా స్టార్ ఆల్‌‌రౌండర్ రీఎంట్రీకి రెడీ అయ్యాడు. రెండున్నర నెలలుగా ఆటకు దూరంగా ఉన్న హార్దిక్‌‌కు టీ20 ఫార్మాట్‌‌లో బ్యాటింగ్,  బౌలింగ్ చేయడానికి బీసీసీఐ మెడికల్ టీమ్‌‌ నుంచి  క్లియరెన్స్ లభించింది. అక్టోబరు 21 నుంచి నవంబర్ 30 వరకు అతను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్​ ఎక్సలెన్స్‌‌ (సీఓఈ)లోనే ఉండి ఫిట్‌‌నెస్ క్లియరెన్స్ కోసం అన్ని ప్రోటోకాల్స్‌‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. 

దీంతో హార్దిక్ మంగళవారం హైదరాబాద్‌‌లో పంజాబ్‌‌తో జరిగే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 మ్యాచ్‌‌తో పాటు డిసెంబర్ 4న గుజరాత్‌‌తో జరిగే మ్యాచ్‌‌లో కూడా బరోడా తరఫున ఆడనున్నాడు. నేషనల్ సెలెక్టర్ ప్రజ్ఞాన్ ఓజా ఈ రెండు మ్యాచ్‌‌లకు హాజరై హార్దిక్ పూర్తి ఫిట్‌‌నెస్‌‌ను పర్యవేక్షించనున్నాడు. తను పూర్తిగా ఫిట్‌‌గా  ఉన్నట్టు తేలితే టీ20 టీమ్‌‌లోకి తిరిగొచ్చే చాన్సుంది.

మరో వైపు గాయంతో సౌతాఫ్రికాతో రెండో టెస్టు, వన్డే సిరీస్‌‌కు దూరమైన శుభ్‌‌మన్ గిల్ సోమవారం సీఓఈకి  చేరుకున్నాడు. నేషనల్ టీమ్‌‌లో రీఎంట్రీ ఇచ్చేముందు తప్పనిసరి  ఫిట్‌‌నెస్ టెస్టులకు అటెంట్ అవుతున్నాడు. సౌతాఫ్రికాతో  9 నుంచి జరిగే ఐదు మ్యాచ్‌‌ల టీ20 సిరీస్‌‌లో గిల్ ఆడతాడా లేదా అనేది ఈ పరీక్షల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. 

బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం గిల్‌‌కు 21 రోజుల రెస్ట్‌‌, రిహాబిలిటేషన్ సూచించారు. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ సైన్స్ టీమ్ అతని మెడ కదలికలతో పాటు, బ్యాటింగ్ సమయంలో ఎటువంటి అసౌకర్యం లేదని తేల్చిన తర్వాతనే బోర్డుకు తుది నివేదిక ఇస్తుంది. దాంతో టీ20 సిరీస్ కోసం గిల్ జట్టులోకి వచ్చే అవకాశాలు ప్రస్తుతం 50-–-50గా ఉన్నాయి.