మూడో టెస్ట్‌‌‌‌కూ..రాహుల్‌‌ దూరం

మూడో టెస్ట్‌‌‌‌కూ..రాహుల్‌‌ దూరం
  • ప్రత్యామ్నాయంగా దేవదత్‌‌ పడిక్కల్‌‌
  •     కీపర్‌‌ భరత్‌‌ ప్లేస్‌‌లో ధ్రువ్‌‌ జురెల్‌‌ డెబ్యూ!
  •     నాలుగో టెస్ట్‌‌కు బుమ్రాకు రెస్ట్‌‌ ఇచ్చే యోచన
  •     సీనియర్లు రంజీలు ఆడాలన్న బీసీసీఐ

న్యూఢిల్లీ : ఇంగ్లండ్‌‌తో కీలకమైన మూడో టెస్ట్‌‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న స్టార్ బ్యాటర్‌‌ కేఎల్‌‌ రాహుల్‌‌ ఈ మ్యాచ్‌‌కూ (ఈ నెల 15 నుంచి రాజ్‌‌కోట్‌‌లో) అందుబాటులో ఉండటం లేదు. అతను ఇంకా మ్యాచ్‌‌ ఫిట్‌‌నెస్‌‌ సాధించలేదు. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేఎల్‌‌ ప్లేస్‌‌లో కర్నాటక బ్యాటర్‌‌ దేవదత్‌‌ పడిక్కల్‌‌ను ప్రత్యామ్నాయంగా టీమ్‌‌లోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌‌లో జరిగిన తొలి టెస్ట్‌‌లో గాయపడిన రాహుల్‌‌ రెండో టెస్ట్‌‌ (వైజాగ్‌‌)కు దూరంగా ఉన్నాడు. అయితే మూడో టెస్ట్‌‌కు ముందు ఎక్కువ గ్యాప్‌‌ రావడంతో అతను కోలుకుంటాడని భావించి టీమ్‌‌లోకి ఎంపిక చేశారు. కానీ ఫిట్‌‌నెస్‌‌ సాధించకపోవడంతో రాహుల్‌‌ ఎంట్రీకి బీసీసీఐ మెడికల్‌‌ టీమ్‌‌ గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇవ్వలేదు.  ప్రస్తుతం ఎన్‌‌సీఏలోనే ఉన్న రాహుల్‌‌.. మిగతా టీమ్‌‌తో పాటు రాజ్‌‌కోట్‌‌కు వెళ్లలేదు. అతను పూర్తిగా కోలుకోవడానికి మరో వారం రోజులు పట్టొచ్చు.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే నాలుగో టెస్ట్‌‌కు రాహుల్‌‌ అందుబాటులోకి రావొచ్చు. ఓవరాల్‌‌గా ఐదు మ్యాచ్‌‌ల టెస్ట్‌‌ సిరీస్‌‌లో 1–1తో సమంగా ఉన్న టీమిండియాకు ఇది ఏమాత్రం మంచి పరిణామం కాదు. ఎందుకంటే ఇప్పటికే విరాట్‌‌ కోహ్లీ, శ్రేయస్‌‌ అయ్యర్‌‌ సిరీస్‌‌ మొత్తానికే దూరమయ్యారు. ఇప్పుడు రాహుల్‌‌ కూడా లేకపోవడంతో బ్యాటింగ్‌‌పై తీవ్ర ప్రభావం పడనుంది. సీనియర్లలో కేవలం రోహిత్‌‌ శర్మ ఒక్కడే అందుబాటులో ఉన్నాడు. ఇక ఆల్‌‌రౌండర్‌‌ రవీంద్ర జడేజా పూర్తి స్థాయిలో కోలుకున్నాడు. థర్డ్‌‌ టెస్ట్‌‌లో ఆడేందుకు అతనికి మెడికల్‌‌ టీమ్‌‌ లైన్‌‌ క్లియర్‌‌ చేసింది.

ఎవర్ని ఆడిస్తారు?

మూడో టెస్ట్‌‌కు రాహుల్‌‌ ప్లేస్‌‌లో ఎవర్ని ఆడిస్తారన్నది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న. తమిళనాడుతో జరిగిన రంజీ మ్యాచ్‌‌లో పడిక్కల్‌‌ 151 రన్స్‌‌ చేశాడు. ఈ మ్యాచ్‌‌ను తిలకించిన సెలెక్షన్‌‌ కమిటీ చైర్మన్‌‌ అజిత్‌‌ అగార్కర్‌‌ అతన్ని టీమ్‌‌లోకి ఎంపిక చేశాడు. కానీ ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో చాన్స్‌‌ ఇస్తారా? ఈ సీజన్‌‌లో పడిక్కల్‌‌ ఆడిన నాలుగు మ్యాచ్‌‌ల్లో 556 రన్స్‌‌ చేశాడు. ఇందులో పంజాబ్‌‌పై 193, గోవాపై 103, ఇండియా–ఎ తరఫున 105, 65, 21 రన్స్‌‌ సాధించాడు. వైజాగ్‌‌ టెస్ట్‌‌లో డెబ్యూ చేసిన రజత్‌‌ పటీదార్‌‌కు రెండో చాన్స్‌‌ ఇస్తారా? లేక సర్ఫరాజ్‌‌ ఖాన్‌‌ను తుది జట్టులోకి తీసుకుంటారా? అన్నది చూడాలి. రంజీల్లో రాణిస్తున్న  చతేశ్వర్‌‌ పుజారాను సెలెక్టర్లు పట్టించుకోలేదు. 

నాలుగో టెస్ట్‌‌లో బుమ్రాకు రెస్ట్‌‌..!

వర్క్‌‌లోడ్‌‌లో భాగంగా పేసర్‌‌ జస్‌‌ప్రీత్‌‌ బుమ్రాకు నాలుగో టెస్ట్‌‌ (రాంచీ)లో విశ్రాంతి ఇచ్చే చాన్స్‌‌ ఉంది. ఒకవేళ సిరీస్‌‌ సమంగా ఉంటే ఐదో టెస్ట్‌‌ కీలకమయ్యే నేపథ్యంలో అతన్ని ఫ్రెష్‌‌గా ఉంచాలని మేనేజ్‌‌మెంట్‌‌ భావిస్తోంది. దీంతో ధర్మశాల టెస్ట్‌‌ వరకు అతన్ని ఫుల్‌‌ ఫిట్‌‌నెస్‌‌తో ఉంచితే బౌలింగ్‌‌ మరింత బలోపేతం అవుతుందని అంచనాలు వేస్తున్నారు. అయితే ఒక్క మ్యాచ్‌‌ కూడా ఆడించకుండా పేసర్‌‌ ఆవేశ్‌‌ ఖాన్‌‌ను టీమ్‌‌ నుంచి తొలగించడంపై విమర్శలు వస్తున్నాయి.

అతని ప్లేస్‌‌లో ఆకాశ్‌‌ దీప్‌‌కు చాన్స్‌‌ ఇవ్వడం కూడా సరైంది కాదని వాదిస్తున్నారు. రాజ్‌‌కోట్‌‌ పిచ్‌‌ స్పిన్నర్లకు అనుకూలమని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆకాశ్‌‌ను తీసుకుని ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు టీమిండియాలో చోటు దక్కని సీనియర్‌‌ ప్లేయర్లు రంజీల్లో ఆడాలని బీసీసీఐ సూచించనుంది. ఫిట్‌‌నెస్‌‌ సమస్యలతో ఎన్‌‌సీఏలో ఉన్న వాళ్లకు మినహాయింపు ఇవ్వనుంది. కొంత మంది ప్లేయర్లు జనవరిలోనే ఐపీఎల్‌‌ మూడ్‌‌లోకి వెళ్లడంపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. 

జడేజా, పుజారాకు సన్మానం

రాజ్‌‌కోట్‌‌ టెస్ట్‌‌కు ముందు జడేజా, పుజారాను సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌‌ ఘనంగా సన్మానించనుంది. ఇండియన్‌‌ క్రికెట్‌‌కు వాళ్లు అందించిన సేవలకు గుర్తుగా ఈ నెల 14 ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. అలాగే బీసీసీఐ వెటరన్‌‌ అడ్మినిస్ట్రేటర్‌‌ నిరంజన్‌‌ షా పేరును స్టేడియానికి పెట్టనున్నారు.

కీపర్‌‌గా ధ్రువ్‌‌ జురెల్‌‌!

కీపింగ్‌‌లోనూ టీమిండియా సమస్యలు ఎదుర్కొంటున్నది. తొలి రెండు టెస్ట్‌‌ల్లో 92 రన్సే చేసిన తెలుగు ప్లేయర్‌‌ శ్రీకర్‌‌ భరత్‌‌ చివరి ఏడు టెస్ట్‌‌ల్లో 221 రన్స్‌‌ మాత్రమే చేశాడు. కనీసం ఒక్క హాఫ్‌‌ సెంచరీ కూడా చేయలేదు. దీంతో మూడో టెస్ట్‌‌కు అతని ప్లేస్‌‌లో ధ్రువ్‌‌ జురెల్‌‌ డెబ్యూ చేసే అవకాశం కనిపిస్తున్నది. 15 ఫస్ట్‌‌ క్లాస్‌‌ మ్యాచ్‌‌ల్లో జురెల్‌‌ 790 రన్స్‌‌ సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, ఐదు హాఫ్‌‌ సెంచరీలు ఉన్నాయి.