
మీర్పూర్: టార్గెట్ 145. అప్పటికే 45 రన్స్ చేసినా నాలుగు వికెట్లు పడ్డాయి. ఇంకా రెండ్రోజుల ఆట ఉంది. మరో వంద రన్స్ చేయాలె. చేతిలో ఆరు వికెట్లున్నాయి. కానీ, మరో 30 పరుగులు వచ్చాయో లేదో ఇంకో మూడు వికెట్లు పడ్డాయి. ఇండియా 74/7తో కష్టాల్లో పడ్డది. అటు బంగ్లా స్పిన్నర్లు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇక.. ఇండియాకు ఓటమి తప్పదు.. టెస్టుల్లో టీమిండియాపై బంగ్లా తొలిసారి విజయం సాధించి హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయం అనిపించింది. ఇలాంటి టైమ్‌లో రవిచంద్రన్ అశ్విన్ (62 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 42 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (29 నాటౌట్) ఆపద్బాంధవులయ్యారు.
స్టార్లు చేతులెత్తేసినా.. ఈ ఇద్దరూ ఎనిమిదో వికెట్‌కు 71 రన్స్ జోడించి ఇండియాకు ఓటమి తప్పించారు. దాంతో, నాలుగు రోజుల్లో ముగిసిన రెండో టెస్ట్‌లో ఇండియా 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై గట్టెక్కింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. 45/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఆట కొనసాగించిన ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 47 ఓవర్లలో 145/7 స్కోరు చేసి గెలిచింది. మెహిదీ హసన్ మిరాజ్ 5 వికెట్లు తీశాడు. అశ్విన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, చతేశ్వర్ పుజారాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
అశ్విన్ అదుర్స్..
నాలుగో రోజు టార్గెట్ వంద రన్సే అయినా.. అప్పటికే టాప్ ప్లేయర్లందరూ పెవిలియన్‌కు చేరడంతో విజయంపై ఇండియా శిబిరంలో ఉత్కంఠ నెలకొంది. దీనికి తగ్గట్లుగానే ఓవర్‌నైట్ బ్యాటర్లలో జైదేవ్ ఉనాద్కట్ (13) ఆట మొదలైన పదో బంతికే వెనుదిరిగాడు. మిరాజ్ బాల్‌ను స్లాగ్ స్వీప్‌తో సిక్స్ కొట్టినా.. ఆ వెంటనే షకీబ్ (2/50) బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికాడు. ఉనాద్కట్రివ్యూ కోరినా సక్సెస్ కాలేదు. ఈ దశలో అక్షర్ పటేల్ (34)తో కలిసి రిషబ్ పంత్ (9) కౌంటర్ ఎటాక్‌తో బంగ్లా బౌలర్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు.
కానీ మిరాజ్ వేసిన సూపర్ టర్నర్‌ను భారీ షాట్ కొట్టబోయి పంత్ ఎల్బీ అయ్యాడు. మరో 9 బాల్స్ తర్వాత షకీబ్ దెబ్బకు అక్షర్ క్లీన్‌బౌల్డ్ అవ్వడంతో ఇండియా 74/7తో కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్, అశ్విన్ అద్భుతంగా ఆడారు. ఆరంభంలో నెమ్మదిగా ఆడినా.. కీలక టైమ్‌లో బంగ్లా స్పిన్ జోడీపై కౌంటర్ అటాక్ చేస్తూ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. 41 ఓవర్లో షకీబ్ బౌలింగ్‌లో శ్రేయస్ వరుస ఫోర్లతో రెచ్చిపోయాడు. షార్ట్ లెగ్‌లో అశ్విన్ క్యాచ్‌ను డ్రాప్ చేసిన బంగ్లా ఫీల్డర్లు మూల్యం చెల్లించుకున్నారు. తర్వాత అశ్విన్ కూడా జోరు పెంచాడు. మిరాజ్ ఓవర్లో 6, 4, 4తో లాంఛనం పూర్తి చేశాడు.