IND VS ENG 2025: ఆ రెండు విజయాలు ప్రత్యేకం.. లార్డ్స్‌లో ఘోరంగా టీమిండియా రికార్డ్స్

IND VS ENG 2025: ఆ రెండు విజయాలు ప్రత్యేకం.. లార్డ్స్‌లో ఘోరంగా టీమిండియా రికార్డ్స్

క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్ లో ఇంగ్లాండ్ పై టెస్ట్ మ్యాచ్ విజయం అంటే ఏ జట్టుకైనా ప్రత్యేకమే. ప్రతిష్టాత్మక ఈ స్టేడియంలో మ్యాచ్ ను చూడడానికి భారీ సంఖ్యలో ప్రేక్షకులు వస్తారు. మరో ఆసక్తికర టెస్ట్ సమరానికి లార్డ్స్ స్టేడియం సిద్ధమవుతుంది. ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య గురువారం (జూలై 10) నుంచి లార్డ్స్  వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో తొలి రెండు టెస్టులు ముగియగా.. ఇరు జట్లు 1-1 తో సమంగా ఉన్నాయి. మూడో టెస్టులో గెలిచి సిరీస్ లో ఆధిపత్యం చెలాయించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. లార్డ్స్ గ్రౌండ్ లో టీమిండియా రికార్డ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 

లార్డ్స్‌లో భారత్ ఇప్పటివరకు 19 టెస్టులు ఆడింది. వీటిలో మూడు మాత్రమే గెలిచి 12 ఓడిపోయింది. నాలుగు మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. 1986లో లార్డ్స్‌లో భారతదేశం తొలిసారి విజయం సాధించింది. వెంగ్‌సర్కార్ అజేయ సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో 134 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా అలవోకగా ఛేజ్ చేసింది. 2014 లో మహేందర్ సింగ్ ధోనీ కెప్టెన్సీలో గెలిచింది.  319 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 223 పరుగులకే ఆలౌట్ అయి 95 పరుగుల తేడాతో టీమిండియాపై ఓడిపోయింది. 2021 లో కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా మరోసారి లార్డ్స్ లో విజయాన్ని అందుకుంది. 272 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచి కేవలం 120 పరుగులకే ఆలౌట్ చేసింది. 

ALSO READ : వింబుల్డన్‌లో నా సపోర్ట్ అతడికే.. కోహ్లీకి విరుద్ధంగా పంత్

లార్డ్స్ టెస్ట్ కోసం ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే గ్రీన్ పిచ్ తయారు చేస్తున్నట్టు సమాచారం. తొలి రెండు టెస్టుల్లో ఫ్లాట్ వికెట్లు తయారు చేసిన ఇంగ్లాండ్ భారత బ్యాటర్లను ఆపడంలో విఫలమయ్యారు. దీంతో మూడో టెస్టుకు మాత్రం బౌలింగ్ పైనే దృష్టి పెట్టింది. క్యూరేటర్లు గ్రీన్ పిచ్  తయారు చేసి ఫాస్ట్‌ బౌలర్లకు అనుకూలంగా పిచ్ ను మారుస్తున్నారు. పిచ్‌పై ఎక్కువగా గ్రాస్‌ను ఉంచినట్లు స్పష్టంగా అర్ధమవుతుంది. ఇంగ్లాండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్లు అందుబాటులో ఉండడంతో ఈ మ్యాచ్ లో భారత బ్యాటింగ్ కు పెద్ద పరీక్ష ఎదురు కానుంది. లార్డ్స్ గ్రౌండ్ లో చివరి మూడు పర్యటనలో టీమిండియా రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించడం ఎంతో స్పెషల్.  

ఒకవేళ గ్రీన్ పిచ్ అయితే టీమిండియా సైతం నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. సుందర్ స్థానంలో బుమ్రా జట్టులోకి రానున్నాడు. సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిద్ కృష్ణ, బుమ్రాలు భారత ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకుంటారు. రెండో టెస్టులో బాగా ఆడినప్పటికీ.. పిచ్ ను దృష్టిలో పెట్టుకొని సుందర్ పై వేటు పడక తప్పదు.