బిగ్ షాక్.. గూగుల్లో వందల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు

బిగ్ షాక్.. గూగుల్లో వందల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి వల్ల పలు కంపెనీలు లేఆఫ్ లు ప్రకటించక తప్పని స్థితి నెలకొంది. గతేడాది లక్షల కొద్దీ ఉద్యోగులు రోడ్డున పడాల్సి వచ్చింది.  ఈ కొత్త ఏడాదిలో కూడా అప్పుడే  లేఆఫ్‌లు మొదలయ్యాయి.  ప్రముఖ ఐటీ సంస్థ గూగుల్‌  వందలాది మంది ఉద్యోగులను తొలిగిస్తు్న్నట్లుగా ప్రకటించింది.  హార్డ్‌వేర్‌, వాయిస్‌ అసిస్టెన్స్‌, ఇంజినీరింగ్‌ బృందాల నుంచి వందల మంది ఉద్యోగులను తొలగించింది. ఆర్థికపరంగా తమ సంస్థపై భారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.  చివరిగా 2023 జనవరిలో గూగుల్ 12 వేల మంది వరకు ఉద్యోగుల్ని తొలగించింది. 

ఇక గూగుల్ బాటలోనే  ఇతర టెక్ కంపెనీలు పయనించాయి. ఈ వారం ప్రారంభంలో అమెజాన్‌ కూడా తన ప్రైమ్‌ వీడియో, స్టూడియోస్‌ యూనిట్లలోని వందల మంది ఉద్యోగులను తొలగించింది. లైవ్‌స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ట్విట్చ్‌లో మరో 500 మందికి లేఆఫ్‌లు ప్రకటించింది. మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ ఇంజనీర్లు , ప్రొడక్ట్ మేనేజర్‌లలో 60 మంది టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్‌లను తొలగించింది.  

ప్రపంచవ్యాప్తంగా 2023లో గూగుల్‌, ట్విట్టర్‌ (ఎక్స్‌), అమెజాన్‌ వంటి సంస్థలు వేల మంది ఉద్యోగులను తొలగించాయి. ట్విట్టర్‌ను మస్క్‌ కొన్న తర్వాత ఒక్కసారే సంస్థలోని 80 శాతం మందిని ఉద్యోగాల నుంచి పీకేశారు. గూగుల్‌ ఒక్కసారే 15000 మందిని తొలగించింది. ఇలా 2023లో 1,65,000 మంది ఉద్యోగులు నిరుద్యోగులయ్యారని అంచనా. తాజాగా అమెరికాకు చెందిన ఈ-కామర్స్‌ కంపెనీ ‘బోల్ట్‌’ 29 శాతం మంది తొలగిస్తామని ప్రకటించింది.