గూడెం లిఫ్ట్, మోడికుంట వాగు ప్రాజెక్ట్​కు.. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్

గూడెం లిఫ్ట్, మోడికుంట వాగు ప్రాజెక్ట్​కు.. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్

    
హైదరాబాద్, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని గూడెం (కడెం) లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ములుగు జిల్లాలోని మోడికుంటవాగు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు తుది అనుమతులు వచ్చాయి. శుక్రవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్​లో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) ఈ ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇచ్చింది. 

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీఆర్ఎంబీ గెజిట్ నోటిఫికేషన్​లో వీటితో పాటు పలు ప్రాజెక్టులను అప్రూవ్డ్ జాబితాలో చేర్చారు. ప్రాజెక్టుల డీపీఆర్​లు సమర్పించి అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయా ప్రాజెక్టుల డీపీఆర్​లను సీడబ్ల్యూసీతో పాటు జీఆర్ఎంబీకి సమర్పించింది. గూడెం లిఫ్ట్​తో పాటు మోడికుంటవాగు ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తై ఆపరేషన్​లో ఉన్నాయి. కడెం రిజర్వాయర్​లో పూడిక పేరుకుపోవడంతో దాని ఆయకట్టుకు నీళ్లు అందడం లేదు. 

ఈక్రమంలో 3 టీఎంసీలు లిఫ్ట్ చేసేలా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంలో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. రూ.138.45 కోట్లతో ఈ లిఫ్ట్ స్కీమ్ నిర్మించారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని మోడికుంట వాగుపై మోడికుంటవాగు ప్రాజెక్టు నిర్మించారు. 5,500 ఎకరాలను సాగులోకి తెచ్చేందుకు 2.04 టీఎంసీలను ఈ ప్రాజెక్టు నుంచి వినియోగిస్తున్నారు. రూ.124 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ఈ రెండు ప్రాజెక్టులకు గతంలోనే జీఆర్​ఎంబీ ఆమోదం తెలుపగా ఇప్పుడు టీఏసీ తుది అనుమతులు ఇచ్చింది.