
- భద్రాద్రి జిల్లాలో వరద నివారణపై స్టడీ చేయనున్న టెక్నికల్ కమిటీ
- కమిటీకి ఈఅండ్‌సీ నాగేంద్రకుమార్ నేతృత్వం
- వారంలో భద్రాద్రికి రాక..
- గోదావరి పరివాహక నివాస ప్రాంతాల సేఫ్టీకి మాస్టర్ ప్లాన్
భద్రాచలం, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న నివాస ప్రాంతాల సేఫ్టీ కోసం కరకట్టల నిర్మాణానికి ఇరిగేషన్ శాఖ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నది. ఈమేరకు ఈఅండ్‌సీ నాగేంద్రకుమార్ నేతృత్వంలో ఎ.శ్రీనివాసరెడ్డి(కొత్తగూడెం సీఈ), చంద్రశేఖర్ (సీఈ, సీడీవో), విజయ్‌ప్రకాశ్( అడ్వయిజర్), డా. పి.రామనాథ్(కన్సల్టెంట్), కె.శ్రీనివాసరెడ్డి( ఎస్ఈ, పీఅండ్ఎం)లతో కూడిన టెక్నికల్ కమిటీ నియమించారు. ఈ కమిటీ వారం రోజుల్లో భద్రాచలం రానున్నది. ఇక్కడ కరకట్టల నిర్మాణం సాధ్యసాధ్యాలపై స్టడీ చేసి ఈ నెలాఖరు కల్లా సర్కారుకు రిపోర్టు అందజేయనుంది. ఫీల్డ్ లెవల్ నుంచి ప్రాథమిక సమాచారాన్ని సేకరించి ఇవ్వడానికి భద్రాచలం ఇరిగేషన్ డివిజన్ ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు.
నాలుగు మండలాల్లో 85 కిలోమీటర్ల మేర..
భద్రాచలం, దుమ్ముగూడెం, బూర్గంపాడు, అశ్వాపురం మండలాల్లో గోదావరికి, వాగులకు ఇరువైపులా 85 కి.మీ.ల మేర కరకట్టల నిర్మాణం చేపట్టనున్నారు. సీతమ్మసాగర్ బ్యారేజీకి ఎగువన అశ్వాపురం, మణుగూరు, పినపాక, దుమ్ముగూడెం,చర్ల మండలాల్లో ఇప్పటికే 49 కి.మీల కరకట్టల నిర్మాణాలు జరుగుతున్నాయి. బ్యారేజీకి దిగువనున్న ప్రాంతంలో కూడా వరద నివారణ చర్యల కోసం ప్రత్యేకంగా రూ.3,500కోట్లతో కరకట్టల డిజైన్ చేసిన ఇరిగేషన్ ఇంజినీర్లు ప్రభుత్వం ముందు ఉంచారు. ఈ డిజైన్లపై సుదీర్ఘంగా చర్చలు జరిపిన ప్రభుత్వం టెక్నికల్ కమిటీ నియమించింది. భద్రాచలంలో ఇప్పటికే 7.7 కి.మీల మేర కరకట్టలు ఉన్నాయి. వీటిని ఎత్తు పెంచడం, బలోపేతం చేయడం, ఊళ్లో డ్రైన్, వర్షపు నీరు ఎత్తిపోయడానికి మోడ్రన్ టెక్నాలజీని వాడుకోవడం ఇందులో భాగం. కాగా కొత్తగా కట్టే కరకట్టల విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలను కూడా ఇరిగేషన్ ఇంజినీర్లు తయారుచేశారు. కేవలం నివాస ప్రాంతాల చుట్టూ కరకట్టలు కట్టడం, పెద్ద వాగులకు ఇరువైపులా గోడలు కట్టి, చిన్నవాగుల నీటిని గోదావరిలోకి వదిలేయడం ఇలా యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు.
భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, దుమ్ముగూడెం మండలాల్లో 36 వాగులు ఉన్నాయి. ఇందులో ఏడు పెద్ద వాగులు ఉన్నాయి. 800నుంచి 1,000 క్యూసెక్కుల ప్రవాహం ఉండే ఈ వాగుల నుంచి బ్యాక్‌వాటర్ గ్రామాల్లోకి రాకుండా తీరం వెంబడి గోడలు కట్టాలని ప్లాన్ చేస్తున్నారు. కరకట్ట కిలోమీటర్ నిర్మించాలంటే రూ.30కోట్లు ఖర్చు అవుతుందనే అంచనా ఉంది. ముంపు సమస్యను ఎదుర్కొంటున్న కుటుంబాల సంఖ్య తక్కువగా ఉంటే అక్కడ కరకట్టకు బదులుగా వారిని ఎత్తైన ప్రాంతాలకు తరలించడం సులభం అనే కోణంలోనూ టెక్నికల్ కమిటీ స్టడీ చేయనుంది. అలాంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయి.? అనే వివరాలు కూడా సేకరించనున్నారు. పది రోజుల కింద 110 కిలోమీటర్ల కరకట్టల డిజైన్లు ఇరిగేషన్ ఇంజినీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అయితే మూడు రోజుల కింద హైదరాబాద్‌లో ఇరిగేషన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ అధ్యక్షతన జరిగిన భేటీలో చర్చించి అవసరమైన చోటే కరకట్టలు అనే కోణంలో తిరిగి రూపకల్పనకు టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేశారు. వీటి నిర్మాణాన్ని తెలంగాణ సర్కారే చేపట్టనుంది.
ప్రపోజల్స్ ఇచ్చాం
గోదావరి తీరంలో కరకట్టల నిర్మాణానికి, భద్రాచలంలో పాత కరకట్టల బలోపేతానికి రూ.3,500కోట్లతో ప్రపోజల్స్ ప్రభుత్వానికి ఇచ్చాం. దీనిపై చర్చ జరిగింది. మార్పులు, చేర్పులు సూచిస్తూ అధ్యయనానికి టెక్నికల్ కమిటీని నియమించింది. ఈ కమిటీ అన్నీ పరిశీలించి పూర్తిస్థాయి రిపోర్టు ఇస్తుంది. వరద నివారణ చర్యలకు కరకట్టలు తప్పనిసరి..
రాంప్రసాద్,ఈఈ, భద్రాచలం