- సిరిసిల్ల, వేములవాడ ఏరియా హాస్పిటళ్లలో ప్రస్తుతం 134 మందికి డయాలసిస్
 - మూడేండ్లలో 40 వేల మందికి డయాలసిస్ ట్రీట్‌మెంట్
 - సిరిసిల్ల ఏరియా హాస్పిటల్‌లో 10 బెడ్స్, వేములవాడలో 5 బెడ్స్
 
రాజన్నసిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల, వేములవాడ ఏరియా హాస్పిటళ్లలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ల ద్వారా అత్యుత్తమ సేవలు అందుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు హాస్పిటళ్లలో 134 మంది పేషెంట్లు డయాలసిస్ సేవలు పొందుతున్నారు. ఖరీదైన ట్రీట్‌మెంట్ జిల్లాలోనే దొరుకుతుండడంతో డయాలసిస్ పేషెంట్లకు దూరభారం తగ్గడంతోపాటు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతోంది.
రెండు హాస్పిటళ్లలో మొత్తం 15 బెడ్లు
సిరిసిల్లలో మూడేండ్ల కింద, వేములవాడలో గతేడాది డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు మూడేండ్లలో 40వేల మందికి ట్రీట్‌మెంట్ అందించినట్లు డాక్టర్లు చెబుతున్నారు. సాధారణంగా కిడ్నీ వ్యాధిబారిని పడ్డవారికి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్‌లో టెస్ట్‌లు చేయిస్తారు. పేషెంట్ కండీషన్ బట్టి అక్కడి డాక్టర్లు వారానికి ఎన్నిసార్లు డయాలసిస్ చేయాలి, ఏ మందులు వాడాలో సూచిస్తారు. వారి సూచనతో సిరిసిల్లలోని డయాలసిస్ మేనేజర్, అసిస్టెంట్లు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. కిడ్నీ వ్యాధి డయాలసిస్ కోసం సిరిసిల్ల ప్రభుత్వ హాస్పిటల్‌లో 10 బెడ్స్, వేములవాడ హాస్పిటల్‌లో 5 బెడ్స్ ఏర్పాటు చేయగా.. రోజుకు 16 గంటలపాటు షిఫ్ట్‌లవారీగా చికిత్స అందిస్తున్నారు.
తగ్గిన దూరభారం..
గతంలో కిడ్నీ రోగులు డయాలసిస్కోసం హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. రెండు కిడ్నీలు చెడిపోయిన పేషెంట్లకు వారంలో రెండు నుంచి మూడుసార్లు శుద్ధిచేయాల్సి ఉండేది. దీంతో అన్నిసార్లు అక్కడికి వెళ్లాలేక అవస్థలు పడేవారు. అదే ట్రీట్‌మెంట్ స్థానికంగా ప్రైవేట్‌లో చేయించుకుంటే సుమారు రూ.20వేలు ఖర్చయ్యేది. కాగా ప్రస్తుతం ఏరియా హాస్పిటళ్లలో డయాలసిస్ సేవలు అందుబాటులోకి రావడంతో దూరభారంతోపాటు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతోందని డయాలసిస్ పేషెంట్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఫ్రీగా డయాలసిస్ చేయించుకుంటున్న..
వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయించుకుంటున్న.. సిరిసిల్ల సర్కార్ దవాఖానాలో ఉచితంగా చేస్తున్నారు. డయాలసిస్‌కు వచ్చినప్పుడుల్లా డాక్టర్ ధైర్యం చెప్తూ భరోసా కల్పిస్తున్నారు. గతంలో వేల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్‌కు దాక పోవుడు నా వల్ల కాకపోతుండే.. -కృష్ణ ,దాచారం గ్రామం, ఇల్లంతకుంట మండలం
గాంధీ డాక్టర్ల సూచనలతో ట్రీట్‌మెంట్
హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ డాక్టర్ల సూచనలతో సిరిసిల్ల, వేములవాడ ఏరియా హాస్పిటళ్లలో డయాలసిస్ చేయిస్తున్నాం. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో 15 బెడ్స్ ఉన్నాయి. రానున్న కాలంలో కాలంలో మరిన్ని బెడ్స్ పెంచాల్సి ఉంది. రోజుకు దాదాపు 16 గంటలు షిఫ్ట్ వారీగా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. - డాక్టర్ సంతోష్, డిప్యూటీ సూపరింటెండెంట్, సిరిసిల్ల హాస్పిటల్
