గో ఫ‌స్ట్ విమానాల్లో సాంకేతిక లోపాలు

గో ఫ‌స్ట్ విమానాల్లో సాంకేతిక లోపాలు

న్యూఢిల్లీ: గో ఫ‌స్ట్ సంస్థకు చెందిన రెండు విమానాల్లో సాంకేతిక స‌మ‌స్యలు ఉత్పన్నమయ్యాయి. ముంబై నుంచి లేహ్‌, ఆ త‌ర్వాత శ్రీన‌గ‌ర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఇంజిన్‌లో స‌మ‌స్యలు డెవ‌ల‌ప్ అయ్యాయ‌ని, రెండు విమానాల‌ను గ్రౌండ్ చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. ముంబై నుంచి లేహ్ వెళ్తున్న విమానాన్ని ఢిల్లీకి మ‌ళ్లించిన‌ట్లు చెప్పారు. ఇంజిన్ నెంబ‌ర్ 2లో స‌మ‌స్యలు వ‌చ్చిన‌ట్లు అంచ‌నా వేశారు. శ్రీన‌గ‌ర్ నుంచి ఢిల్లీ వెళ్లే విమానాన్ని కూడా మ‌ధ్యలోనే మ‌ళ్లీ శ్రీన‌గ‌ర్‌కు మ‌ళ్లించారు. దాంట్లో కూడా రెండో నెంబ‌ర్ ఇంజిన్‌లో స‌మ‌స్యలు వ‌చ్చిన‌ట్లు డీజీసీఏ అధికారులు చెప్పారు. సివిల్ ఏవియేషన్ రెగ్యులేటర్ ఈ విషయంపై విచారణ జరుపుతోందని, DGCA క్లియర్ చేసినప్పుడే విమానాలు ప్రయాణిస్తాయని తెలిపారు. 

ఈ మధ్య తరచూ విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి నిలిచిపోతున్నాయి. దీంతో విమానయానశాఖ మంత్రి  జ్యోతిరాదిత్య సింధియా విమానాల్లోని భద్రతా పర్యవేక్షణను నిర్ధారించడానికి విమానయాన సంస్థలు, DGCA అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తామని, ఏ ఆటంకం లేకుండా విమానాల్లో అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. ఇక రెండు రోజుల క్రితం షార్జా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ పాకిస్థాన్‌కు మళ్లించారు. విమానాన్ని ముందుజాగ్రత్తగా కరాచీలో ల్యాండ్ చేయడంతో ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. జులై 14న ఢిల్లీ నుంచి వడోదరకు వెళ్తున్న ఇండిగో విమానం ఇంజిన్‌లలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ముందుజాగ్రత్తగా జైపూర్‌కు మళ్లించారు.

విమానాల్లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతుండటంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిబంధనలను మరింత కఠినతరం చేసింది. బేస్‌, ట్రాన్సిట్ స్టేషన్లలో నిపుణులు అనుమతించిన తర్వాతే విమానాలు బయటకు రావాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. B1/B2 లైసెన్స్‌ ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ నుంచి సరైన అనుమతి తర్వాతే విమానాలను బయటకు పంపాలనే నిబంధనను తప్పనిసరి చేసింది. ఈనెల 28 నుంచి అన్ని విమానయాన సంస్థలు ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.