కటక్: టెక్నాలజీ అనేది మన తీర్పులను, నిర్ణయాలను బలపరచాలి, వాటికి సహాయకారిగా ఉండాలి తప్ప.. భర్తీ చేయకూడదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. కరోనా సమయంలో వర్చువల్ హియరింగ్స్, ఇ-ఫైలింగ్ వంటివి చాలా ఉపయోగపడ్డాయి.. కానీ టెక్నాలజీతో డీప్‌ఫేక్, డిజిటల్ అరెస్టు వంటి ప్రమాదాలు కూడా ఉన్నాయని హెచ్చరించారు. ‘‘సామాన్యులకు న్యాయం అందించడం: వ్యాజ్యాల ఖర్చులు, ఆలస్యాలను తగ్గించే వ్యూహాలు’’ అనే అంశంపై ఆదివారం ఒడిశాలోని కటక్‌లో సింపోజియం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రధాన వక్తగా మాట్లాడారు. సామాన్యుడికి న్యాయం అందించడంలో ఖర్చులు, ఆలస్యాలు ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయని తెలిపారు. కోర్టుల్లో కేసుల పెండింగ్ సమస్య ట్రయల్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు అన్ని స్థాయిల్లో తీవ్ర ఇబ్బందికరంగా మారిందన్నారు.
పైస్థాయిలో ఆలస్యం జరిగితే కింది స్థాయిలో వాటిపై ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. తగినన్ని కోర్టులు, న్యాయ మౌలిక సదుపాయాలు లేకపోతే ఎంత చిత్తశుద్ధితో పనిచేసినా వ్యవస్థ కుప్పకూలుతుందని హెచ్చరించారు. పేదలు, వృద్ధులు, డిజిటల్ పరిజ్ఞానం లేని వారిని మినహాయించే సంస్కరణ నిజమైన సంస్కరణ కాదన్నారు.
