ఎమ్మెల్సీ కవిత సభ్యత్వాన్ని రద్దు చేయండి : తీన్మార్ మల్లన్న

ఎమ్మెల్సీ కవిత సభ్యత్వాన్ని రద్దు చేయండి : తీన్మార్ మల్లన్న
  • ఆమె గూండాలు నాపై దాడి చేశారు: తీన్మార్ మల్లన్న
  • కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు
  • రక్షణ కోసమే గన్​మెన్లు కాల్పులు జరిపారని వెల్లడి
  • బీసీ కమిషన్​కు మల్లన్న పీఏ కంప్లైంట్
  • మల్లన్నపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్​కు జాగృతి నేతల వినతి

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ కవిత సభ్యత్వాన్ని రద్దు చేయాలని కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. కవిత గూండాలు తన ఆఫీస్ కు వచ్చి తనపై దాడి చేశారని, దీంతో తనకు రక్షణగా ఉన్న గన్ మెన్ కాల్పులు జరిపారని మల్లన్న తెలిపారు. కౌన్సిల్ చైర్మన్ కు ఫిర్యాదు చేసిన అనంతరం మండలి మీడియా పాయింట్ లో తీన్మార్ మల్లన్న మాట్లాడారు. 

బీసీలను అణగదొక్కే  ప్రయత్నం కవిత చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కంచం పొత్తు.. మంచం పొత్తు అనేది తెలంగాణ సంప్రదాయంలో భాగమని, వియ్యం పుచ్చుకోవడాన్ని ఆ రకంగా అంటామని.. అందులో తప్పు ఏముందని ఆయన ప్రశ్నించారు. ఆమెపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. కవిత ఎమ్మెల్సీ పదవిని పబ్లిక్ కోసం ఉపయోగించాలని,  ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేపట్టకూడదని ఆయన సూచించారు. 

బీసీ కమిషన్​కు ఫిర్యాదు

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై జాగృతి నేతలు దాడి చేశారని, ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు జయప్రకాశ్, సురేందర్ కు మల్లన్న పర్సనల్ అసిస్టెంట్ బొమ్మనబోయిన శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశంపై పూర్తి దర్యాప్తు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని రాచకొండ కమిషనర్‌‌‌‌‌‌‌‌ సుధీర్‌‌‌‌‌‌‌‌ బాబుకు బీసీ కమిషన్‌‌‌‌‌‌‌‌ చైర్మన్ నిరంజన్ లేఖ రాశారు. మరోవైపు మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని తన ఆఫీస్​లో తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ,  కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్​లోనే ఎమ్మెల్సీ కవిత బీసీలపై దాడులకు పాల్పడుతున్నదని ఆరోపించారు. 

ఆ పార్టీ అనధికారిక సభ్యురాలే కవిత అని విమర్శించారు. తాను చేసిన కామెంట్లపై బీఆర్ఎస్ లీడర్లు సైలెంట్​గా ఉంటే.. కాంగ్రెస్ లీడర్లు మాత్రం అండగా ఉన్నామంటూ భరోసా ఇస్తున్నారని అన్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదని మండిపడ్డారు.

మహిళా కమిషన్​కు జాగృతి నేతల ఫిర్యాదు

ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి మహిళా నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం బుద్దభవన్​లోని  తెలంగాణ మహిళా కమిషన్ కార్యాలయంలో వారు ఫిర్యాదు చేశారు. చైర్ పర్సన్ నేరెళ్ల శారద అందుబాటులో లేకపోవడంతో కమిషన్ సభ్యులకు ఫిర్యాదు 
అందజేశారు. 

ఎమ్మెల్సీ కవితపై డీజీపీకి  ఫిర్యాదు

డీజీపీ జితేందర్​ను సోమవారం తీన్మార్ మల్లన్న కలిసి కవితపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సంస్కృతి పేరుతో బీసీ మహిళలను అణిచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. కవిత చేసింది క్యూ న్యూస్​పై దాడి కాదని.. బీసీ ప్రజల సంస్కృతి, ఆలోచనలపై అని ఫైర్ అయ్యారు. కవితపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. తనపై ఇప్పటి వరకు 3 సార్లు హత్యాయత్నం జరిగిందన్నారు. రాష్ట్రంలోని బీసీలను అవమానించేలా కల్వకుంట్ల కుటుంబం వ్యవహరిస్తున్నదని ఫైర్ అయ్యారు.