ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

డిమాండ్ల పరిష్కారం కోసం 78 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడంలేదని పేర్కొంటూ సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వీఆర్ఏలు తహసీల్దార్ల ఆఫీసులకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు.​ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని వారు కోరారు.

- మందమర్రి/బెల్లంపల్లి/జన్నారం,వెలుగు

ఎస్పీలకు సన్మానం

బెల్లంపల్లి,వెలుగు: ఆదిలాబాద్, సూర్యాపేట ఎస్పీలు ఉదయ్​కుమార్​రెడ్డి, రాజేంద్రప్రసాద్​ను సోమవారం కంభంపాటి శ్రీనివాస్ నేహదంపతులు, సాడి స్వతంత్రరెడ్డి, మేడి పున్నం చంద్రు ఆధ్వర్యంలో సన్మానించారు. స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో వారికి పూలమాల, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీలు ఉదయ్​కుమార్​రెడ్డి, రాజేంద్రప్రసాద్ ​మాట్లాడుతూ గతంలో బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్​స్టేషన్​లో ఎస్సైలుగా పనిచేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో బెల్లంపల్లికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. నాడు నక్సలైట్ల కార్యకలాపాల ప్రత్యేక పరిస్థితుల్లో పోలీసు ఉద్యోగం చేయడం దినదిన గండంగా ఉండేదన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, జైపూర్ గోదావరిఖని ఏసీపీలు నరేందర్, గిరిప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమారి సూరిబాబు, వన్ టౌన్ ,రూరల్, తాండూర్, శ్రీరాంపూర్ సీఐలు ముస్కె రాజు, కోట బాబురావు, బి. రాజు, కె. జగదీశ్, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు బొర్లకుంట పోశలింగం, బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్, నియోజకవర్గ ఇన్ చార్జి కొయ్యల ఏమాజీ, నియోజకవర్గ కోకన్వీనర్ రాజులాల్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్  సిలువేరి నర్సింగం, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి కుంభాల రాజేశ్, రాజులాల్ యాదవ్, వ్యాపారవేత్తలు అజయ్ లోయ బాలాజీ సోనీ, రామ్ మనోజ్ సోనీ, కొడిప్యాక విద్యాసాగర్ రేణిగుంట్ల శ్రీనివాస్, బాల సంతోష్, కొత్తపల్లి నర్సింగం పాల్గొన్నారు.

గోదావరి బేసిన్ పై ప్రత్యేక దృష్టి

నిర్మల్,వెలుగు: గోదావరిపై బేసిన్​ కోసం ప్రత్యేక దృష్టిపెట్టినట్లు మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి చెప్చఆరు. ఉమ్మడి జిల్లాలో చేపట్టాల్సిన  పనులపై సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నాలుగు జిల్లాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కడెం ప్రాజెక్టుకు కొత్తగా ఐదు గేట్లను నిర్మించాలని ప్రతిపాదించారు. గోదావరి ఏరియాలో భద్రాచలం తరహాలో  కరకట్టలు (ప్రొటెక్షన్ వాల్స్)  నిర్మించాలని  నిర్ణయించారు. భైంసా, నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, కాగజ్ నగర్ ఏరియాల్లో ముంపును నివారించేందుకు ఈ చర్యలు తీసుకోన్నట్లు వెల్లడించారు. కరకట్టల నిర్మాణం కోసం ప్రతిపాదనలు రూపొం దింస్తామన్నారు. ముధోల్  నియోజకవర్గంలోని 50 వేల  ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం 28వ ప్యాకేజీ హై లెవెల్ కాల్వ కాంట్రాక్టర్ ను తొలగించి రివర్స్ టెండర్ నిర్వహించాలన్నారు. ప్యాకేజీ నంబర్ 27కు సంబంధించిన పనులను కూడా త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు.

కారు అదుపు తప్పి బీజేవైఎం టౌన్​ ప్రెసిడెంట్​ మృతి

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మున్సిపల్ మాజీ చైర్మన్​ రాచకొండ కృష్ణారావు కొడుకు, బీజేవైఎం టౌన్​ ప్రెసిడెంట్​ సత్యనారాయణరావు(35) ఆదివారం రాత్రి యాక్సిడెంట్​లో చనిపోయారు. 10.30 గంటల సమయంలో బీజేవైఎం కార్యకర్త  అశోక్​తో కలిసి కారులో బొక్కలగుట్ట ప్రాంతానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏసీసీ క్వారీ టు బొక్కలగుట్ట రోడ్​లో తిమ్మాపూర్​ మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి పక్కనున్న కాల్వలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. సత్యనారాయణ తలకు బలంగా దెబ్బతగలడంతో స్పాట్​లోనే చనిపోయారు. తీవ్ర గాయాలైన అశోక్​ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. రాత్రి 2.30 గంటల ప్రాంతంలో స్పృహలోకి వచ్చాక ఫోన్​ చేసి విషయం చెప్పాడు. వెంటనే బీజేపీ టౌన్​ ప్రెసిడెంట్​ వెంకటేశ్వర్​రావు తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని అశోక్​ను హాస్పిటల్​కు తరలించారు. సోమవారం మధ్యాహ్నం సత్యనారాయణరావు డెడ్​బాడీకి మంచిర్యాల జీజీహెచ్​లో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని స్వగ్రామమైన నస్పూర్​కు తరలించి అంత్యక్రియలు చేశారు. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావుతో పాటు వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఏడేండ్ల కిందట తండ్రి.... 

మంచిర్యాల మున్సిపల్​ మాజీ చైర్మన్​ రాచకొండ కృష్ణారావు సైతం 2015లో యాక్సిడెంట్​లో చనిపోయారు. ఆయన హైదరాబాద్​ నుంచి మంచిర్యాలకు వస్తుండగా గజ్వేల్​ దగ్గర కారు ప్రమాదానికి గురైంది. యాదృచ్ఛికంగా తండ్రీకొడుకులు యాక్సిడెంట్​లో మృతి చెందడం విషాదాన్ని నింపింది. సత్యనారాయణరావుకు పెళ్లికాలేదు. ఆయనకు తల్లి, చెల్లెలు ఉన్నారు.

పొంచి ఉన్న ప్రమాదం

ఖానాపూర్– ఎక్బాల్ పూర్ మార్గమధ్యంలో భారీ వృక్షాలు వంగి ప్రమాదకరంగా మారాయి. ఇటీవల టాటా మ్యాజిక్​పై చెట్టుపడడంతో ఇద్దరు అక్కడిక్కడే చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో రోడ్డుపై వెళ్లాలంటే వాహనదారులు, ప్రజలు జంకుతున్నారు. ఫారెస్ట్​ ఆఫీసర్లు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

– ఖానాపూర్,వెలుగు

ఇన్ఫర్మేషన్ యాక్ట్ పాంప్లెంట్స్​ అందజేత

ఖానాపూర్,వెలుగు: బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీవో, అగ్రికల్చర్ ఆఫీసర్​కు ఇన్ఫర్మేషన్​ యాక్ట్​ పాంప్లెంట్స్​అందజేశారు. ఇందులో సమాచార హక్కు చట్టం, అధికారుల బాధ్యత తదితర వివరాలు పొందుపరిచారు. కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పడాల రాజశేఖర్, మండల అధ్యక్షుడు టేకు ప్రకాశ్, పట్టణ ప్రధాన కార్యదర్శి మామిడాల సుధాకర్, జిల్లా బీజేవైఎం లీడర్లు ఉపేందర్, శ్రావణ్, మండల ఉపాధ్యక్షుడు ఎనగందుల రవి, స్వామి, సీనియర్ లీడర్లు తోకల బుచ్చన్న, దాదే మల్లయ్య, ఆనంద్, దాసరి రాజేశ్వర్, వెంకటేశ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ దళిత బంధు ఇవ్వాలి

నిర్మల్,వెలుగు: అర్హులైన దళితులందరికీ దళిత బంధు ఇవ్వాలని, నర్సాపూర్​(జి)లో దళితులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలని బీజేపీ లీడర్లు కోరారు. సోమవారం దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్ ఆధ్వర్యంలో  పార్టీ  సీనియర్ లీడర్లు మెడిసిమ్మ రాజు, అయ్యన్న గారి భూమయ్య, డాక్టర్ మల్లికార్జున్​రెడ్డి, అంజు కుమార్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి తదితరులు కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీకి వినతి పత్రం అందజేశారు. దళిత బంధు ఇవ్వాలన్నవారిని మంత్రి దూషించడం, కేసులు పెట్టించడం ఎంతవరకు సమంజసమన్నారు. పోలీసులకు దళితులు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దళితులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలన్నారు. సమస్య పరిష్కరించని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో లీడర్లు అలివేలు మంగ, శ్రావణ్ రెడ్డి, మిట్టపల్లి రాజేందర్, ఒడిసెల శ్రీనివాస్, అల్లం భాస్కర్, నరేశ్​ పాల్గొన్నారు.

సింగరేణిలో కల్చరల్​ పోటీలు

మందమర్రి,వెలుగు: బెల్లంపల్లి ఏరియా గోలేటి వర్క్  పీపుల్ స్పోర్ట్స్​అండ్​ గేమ్స్​ అసోసియేషన్​ఆధ్వర్యంలో సోమవారం బై ఏరియా కల్చరల్​ పోటీలు నిర్వహించారు. రాణించిన కళాకారులు భూపాలపల్లిలో జరిగే కంపెనీ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఏరియా పర్సనల్ మేనేజర్​ లక్ష్మణ్​రావు, టీబీజీకేఎస్ వైస్  ప్రెసిడెంట్​ శ్రీనివాస్, డీవైపీఎం తిరుపతి, కె.కిరణ్​కుమార్, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి

ఆదిలాబాద్​టౌన్/ఆసిఫాబాద్, వెలుగు:  ప్రింట్, ఎలక్ట్రానిక్​మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు  కేటాయించాలని టీడబ్ల్యూజేఎఫ్​లీడర్లు కోరారు.  సోమవారం ఆయా జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించారు. చాలామంది జర్నలిస్టులు పేదరికంలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్​సంఘం జిల్లా అధ్యక్షుడు మెడిపట్ల సురేశ్, ప్రధాన కార్యదర్శి షేక్ మోయిజ్,​ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాపర్తిదత్తాత్రి, ఉపాధ్యక్షులు రొడ్డ దేవీదాస్, పసుపుల స్వామి, మహ్మద్ రఫి, వీడియో, కెమెరమన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు విఠల్, దత్తాత్రి, గంట వినోద్, ఆసిఫాబాద్లో  జరిగిన నిరసనలో సంఘం జిల్లా అధ్యక్షుడు గణపురం మహేశ్, ​జాతీయ కౌన్సిల్ సభ్యుడు సురేందర్ రావు, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్  తదితరులు పాల్గొన్నారు.

ఓపెన్ జిమ్​ను సద్వినియోగం చేసుకోవాలి

ఆదిలాబాద్​టౌన్,వెలుగు: ఆదిలాబాద్​లో ఏర్పాటు చేసిన ఓపెన్​జిమ్​ను సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్​జోగు ప్రేమేందర్​సూచించారు. పట్టణంలోని ఫిల్టర్​బెడ్​ కాలనీ 42వ వార్డులో రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్​ జిమ్​ను సోమవారం ఆయన కౌన్సిలర్ ఆవుల వెంకన్నతో కలిసి  ప్రారంభించారు. కార్యక్రమంలో లీడర్లు వెనుకంటి ప్రకాశ్, దమ్మా పాల్, స్వాగత్, మీషు, భూమన్న, కృష్ణ, సాయికుమార్, అతిక్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

ఏఐటీయూసీ జిల్లా ప్రెసిడెంట్​గా అక్బర్​అలీ 

రామకృష్ణా పూర్,వెలుగు: రామకృష్ణాపూర్​ పట్టణానికి చెందిన సింగరేణి కార్మిక నేత ఎండీ అక్బర్ అలీ జిల్లా ఏఐటీయూసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్​ వర్కర్స్ యూనియన్  బ్రాంచి సెక్రటరీగా పనిచేస్తున్నారు. జనరల్​సెక్రటరీగా మేకల దాసు, వైస్​ ప్రెసిడెంట్లుగా మిట్టపెల్లి పౌల్, ఎం. సమ్మయ్య, సెక్రటరీలుగా దాగం మల్లేశ్,  ఖలేందర్​ఖాన్, ట్రెజరర్​గా సరస్వతి, యూనియన్​ గౌరవ అధ్యక్షుడిగా ఎం.వెంకటస్వామి ఎన్నికయ్యారు. మరో 45 మంది కౌన్సిల్, 17 మంది కార్యవర్గ సభ్యులు, ఎనిమిది మంది ఆఫీస్​ బేరర్లుగా ఎన్నికయ్యారు.

ప్రశాంత జీవితంతో మానసిక ఆరోగ్యం

నిర్మల్/బెల్లంపల్లి,వెలుగు: ప్రతీ ఒక్కరు జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి జి. హిమబిందు సూచించారు. మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా  సోమవారం కోర్టుహాలులో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం మనిషి ప్రతీ విషయంలో టెన్షన్​కు గురవుతున్నాడని, హడావుడి ఎక్కువైందని తెలిపారు. కుటుంబ సభ్యులతో ఎక్కు వ సమయం గడపడం ద్వారా మానసిక సమస్యలు దూరమౌవుతాయన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అంకెం శివకుమార్, సెక్రటరీ చేను రవికుమార్, న్యాయ వాదులు వంగల ఉమారాణి, దుద్దిల్ల అశోక్, రాజన్న, శ్రీనివాస్, బాలకృష్ణ, అనిల్ కుమార్, దేవరాజు, సౌమ్య, సందీప్ పాల్గొన్నారు.

పాజిటివ్ దృక్పథంతో...

పాజిటివ్ దృక్పథంతో మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చని మానసిక వైద్య నిపుణుడు సురేశ్​చెప్పారు. నిర్మల్​ పోలీస్ ఆఫీసులో  సిబ్బందికి అవగాహన కల్పించారు. ఒత్తిడి కారణంతో మెదడుపై ఎక్కువ ప్రభావం పడుతుందన్నారు. అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ కేఆర్ కే ప్రసాద్ రావు, అడిషనల్ ఎస్పీ ఏఆర్ వెంకటేశ్వర్లు, ఆర్ఐ రామకృష్ణ, ఆర్​ఎస్సై సాయి, రవికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

ఆదిలాబాద్,వెలుగు: విద్యార్థులు అన్నిరంగాల్లో రాణించి త‌ల్లిదండ్రుల కలలు నెర‌వేర్చాల‌ని ఎంపీ సోయం బాపూరావు సూచించారు. ఆదిలాబాద్​లోని సరస్వతి శిశుమందిర్ లో సోమవారం కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసుకున్న ఆదివాసీ విద్యార్థులకు వనవాసీ కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు అందజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఐదుగురికి తన సంస్థలో ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తాన‌ని, త‌దుప‌రి బ్యాచ్ కోసం ప‌ది కంప్యూట‌ర్లు అందిస్తానని ఎన్నారై కంది శ్రీ‌నివాస‌రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిప‌ల్ చైర్మన్ జోగు ప్రేమేంద‌ర్‌, అడిష‌న‌ల్ కలెక్టర్ న‌ట‌రాజ్‌, ఏబీవీకే అధ్యక్షుడు రామ‌చంద్ర క‌రాడే, లీడర్లు కంది శ్రీ‌నివాస‌రెడ్డి, జ్యోతి, వ‌న‌వాసీ క‌ళ్యాణ ప‌రిష‌త్ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్, ఆర్ఎస్ఎస్ స‌భ్యులు ప్రతాప్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.