
హైదరాబాద్ ఎర్రమంజిల్ లో ఈ ఉదయం ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులతోి ఐఏఎస్ కమిటీ జరిపిన చర్చలు ముగిశాయి. ఐతే… ఈ సమావేశం సంతృప్తిగా జరగలేదని… చర్చలు ఫెయిలయ్యాయని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి చెప్పారు.
“గత రెండురోజులుగా చెప్పిందే ఇవాళ కూడా ఐఏఎస్ అధికారులు చెప్పారు. రాతపూర్వకంగా హామీ ఇవ్వాలన్నాము. స్పష్టమైన హామీ ఇవ్వకుంటే రేపటి నుండి సమ్మెకు పోతాం. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. ప్రజలు కూడా మా సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. మేధావులు, విద్యార్థి సంఘాలు మా పోరాటంలో భాగస్వాములు కావాలి. ఎస్మా చట్టాలు, పీడీ యాక్టులు ఆర్టీసీ కార్మికులకు కొత్త కాదు. రేపటి సమ్మె యధాతధంగా కొనసాగుతుంది. సీఎం ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులు తెలుసుకుని సమస్యలను పరిష్కరించాలి. 50 వేల మంది కార్మికులం సమ్మెలో పాల్గొంటాం. ఇప్పటికే దూర ప్రాంతాల సర్వీసులు ఆగిపోయాయి. ఉద్యోగ సంఘాలు మా సమ్మెకు మద్దతు తెలపాలి”అని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి అన్నారు.