అక్షర ప్రపంచం..ముగియని కథలు. గుండెల్లో చల్లారని మంటలు

అక్షర ప్రపంచం..ముగియని కథలు.  గుండెల్లో చల్లారని మంటలు

పైకి కన్పించని గాఢమైన భావుకత ప్రస్ఫుటించేలా రచనలు చేయగల నేర్పు కలిగిన రచయిత తెలకపల్లి రవి. రచయిత, సంపాదకులు, కవి, విమర్శకులు కూడా. కథాగీతాలకు, కథాప్రాణాలకు, జనానికి మధ్య ఉండే సంబంధాలకు  సాక్ష్యంగా ఈ సంపుటిని తీసుకొచ్చారు. ఈ సంపుటిలో వాస్తవ జీవుల తడియారని కథలున్నాయి. పొడియారని గొంతులున్నాయి. బాధల పాటల పల్లవులున్నాయి. గుండెల్లో చల్లారని మంటలున్నాయి. ఇవి మనసులేని మనుషుల కథలు.. మనసున్న కథకుడి కథలు. 

సమాజంలోని వివిధ సామాజిక వర్గాలకు సంబంధించి పిల్లలను, స్త్రీలను, వృద్ధులను, యువకులను, నడివయసు వారిని చుట్టుముట్టిన సమస్యలను సామాజిక సమస్యలతో పోల్చుతూ విశదీకరించిన కథల తీరు బాగుంది. ప్రతి కథలో.. మధ్యతరగతి జీవితం ప్రతిబింబిస్తుంది. అభద్రలో.. మనుషులు అనవసర విషయాల్లో చూపే ఆసక్తి మంచి లక్ష్యం కోసం ఎందుకు పెట్టరో.. మనిషి ఔన్నత్యం హీనత్వంతో కలిసి ఉంది. వాటితో సహజీవనం తప్పదు. 

అవసరమైన ఆసరా ఇవ్వకుండా, అభివృద్ధి చెందాలనే ఆకాంక్షలు మాత్రం ఎందుకు? ఏది ఎలా పోయినా.. మీరు మగవాళ్ళు. మంచి మనసున్నవాళ్లే, సర్దుబాటు మనుషులే, సంస్కారవంతులే అయినా మీరు మగవాళ్ళు. నచ్చలేదని చెబితే గింజుకుంటారు. మా కడుపులో బిడ్డ తొమ్మిది మాసాలకు బయటికొస్తుంది. మా మనసులో బాధలు కొన్ని ఎన్నటికీ బయటికి రానే రావు. ఎందుకంటే అది మా ‘అభద్ర’త.. అంటూ ఓ భార్య తన భర్తకు రాసిన ఉత్తరం కథ. కాదు తనలోని క్షోభకు అక్షరరూపం ఇచ్చిన నిజమైన కథ. ఈ కోవలోకే ‘అతడు ఆమె’, ‘జ్వరమొచ్చింది’ అనే మరో రెండు కథలు వస్తాయి. మనిషితనం, మంచితనం పరిమళించిన కథ ‘మంచి మామిడి’. మొత్తంగా ఈ పుస్తకంలో ఇటువంటివి 17 కథలు మనల్ని చదివిస్తాయి. ఏడిపిస్తాయి. మనలోని మనల్ని పరిచయం చేస్తాయి.

- పి. రాజ్యలక్ష్మి-