టాలీవుడ్ లో ‘తెలంగాణం’

టాలీవుడ్ లో ‘తెలంగాణం’

టాలీవుడ్ లో ఒకప్పుడు ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చినవాళ్లదే రాజ్యం. హీరో, విలన్, డైరెక్టర్, సింగర్, ప్రొడ్యూసర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా లైట్ బాయ్ నుంచి టాప్ హీరో వరకు అంతా అక్కడి వాళ్లే. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఆర్ట్, డైలాగ్స్... ఇలా సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్ట్ ల్లో ‘ఆంధ్రా’దే పెత్తనం. తెలంగాణలో ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్టలు ఉన్నా... వాళ్లని కమెడియన్లు, విలన్లుగానే వాడుకునేవాళ్లు. ఇక తెలంగాణ భాష, యాసకు ఏమాత్రం గౌరవం ఇచ్చేవాళ్లు కాదు. కానీ కాలం మారింది. పరిస్థితులు మారాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. టాలీవుడ్ లో చాలా చేంజెస్ జరిగాయి. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనోళ్లు దూసుకెళ్తున్నారు. కేవలం యాక్టర్సే కాదు... సినిమాకు చెందిన అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. తెలంగాణ భాష ఇప్పుడు క్రేజీగా మారింది. తెలంగాణ యాసలో మాట్లాడితే తప్ప సినిమాలు ఆడని పరిస్థితి నెలకొంది. తెలంగాణ ప్రాంత ఇతివృత్తాలతో తీస్తున్న సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. 

యాక్టింగ్ లో....

కాంతారావు, ప్రభాకర్ రెడ్డి, బాబు మోహన్, వేణు మాధవ్, ఉత్తేజ్ వంటి వాళ్లు తెలంగాణ నుంచి వచ్చి తమ సత్తా చాటుకున్నారు. కాంతారావుకు అయితే ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో సమానంగా పాపులారిటీ ఉండేది. ప్రభాకర్ రెడ్డి ప్రముఖ విలన్ గా రాణించాడు. బాబు మోహన్, వేణు మాధవ్ మెయిన్ స్ట్రీమ్ కమెడియన్లుగా వెలుగొందారు. ‘జయం’ సినిమాతో హీరోగా పరిచయమై నితిన్ ఇప్పటికీ పాపులర్ హీరోగా కొనసాగుతున్నాడు. అనంతరం వచ్చిన విజయ్ దేవరకొండ చిన్న చిన్న పాత్రలతో కెరియర్ మొదలు పెట్టినా... అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల విజయంతో ఒక్కసారిగా సూపర్ స్టార్ అయిపోయాడు. లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన ‘డీజే టిల్లూ’ మూవీతో సిద్ధూ జొన్నలగడ్డ టాప్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. ఆ సినిమాలో తెలంగాణ యాసలో సిద్ధూ చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియాని షేక్ చేశాయి. 

నిఖిల్, కార్తికేయ, విశ్వక్ సేన్ లాంటి యంగ్ హీరోలు రాణిస్తున్నారు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, అభినవ్ గోమటం, పుష్పలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన జగదీష్ లాంటి వాళ్లు ఇప్పుడు స్టార్ కమెడియన్లలాగా చలామణి అవుతున్నారు. శివారెడ్డి, తాగుబోతు రమేష్, వేణు టిల్లు, తిరువీర్, అభయ్, కాలకేయ ప్రభాకర్ కూడా బాగా రాణిస్తున్నారు. ఇషా రెబ్బా, సాన్వి మేఘన, అనన్య నాగళ్ల, శ్రీముఖి లాంటి వాళ్లు ఆకట్టుకుంటున్నారు.

నాన్ యాక్టింగ్ లో...

కేవలం నటనలోనే కాకుండా సినిమాకు సంబంధించిన ఇతర రంగాల్లో తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చన వాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. దిల్ రాజు ఇప్పుడున్న టాలీవుడ్ ప్రొడ్యూసర్లతో తనొకడు. సంగీత దర్శకుడిగా చక్రి ఓ ఊపు ఊపాడు. మెలోడి సాంగ్స్ తో ప్రేక్షకులను రంజింపజేశాడు. డైరెక్షన్ డిపార్ట్ మెంట్ విషయానికొస్తే... నర్సింగ్ రావు, సురేందర్ రెడ్డి, సంపత్ నంది, ఎన్.శంకర్, శ్రీరామ్ వేముల, వేణు ఊడుగుల, హనూ రాఘవపూడి, విక్రమ్ సిరికొండ వంటి డైరెక్టర్లు టాప్ డైరెక్టర్లుగా ఉన్నారు. ఇక సుద్ధాల అశోక్ తేజ, సురేందర్ మిట్టపల్లి, జిలుకర శ్రీనివాస్, కాసర్ల శ్యామ్ వంటి వారు టాప్ లిరిక్స్ ను అందిస్తున్నారు. ఇక రాహుల్ సిప్లిగంజ్, మౌనిక వంటి యువ సింగర్స్ తమ గళంతో సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేస్తున్నారు. 

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మధ్య కాలంలో చిన్న చిన్న నటీనటులు, టెక్నీషియన్లు కూడా లైమ్ లైట్ లోకి వస్తున్నారు. నిజంగా ఇది మంచి పరిణామం. ఇకపోతే... బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో ‘తెలుగు సినిమా’ పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ములేపుతోంది. ఎదిగిపోయింది. 

మరిన్ని వార్తల కోసం...

మోడీని దించాలంటే ప్రజా పోరాటాలు బలపడాలి

తెలంగాణలో దళితులపై దాడులు అరికట్టాలి