
- న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు
- హైటెక్ గ్యాడ్జెట్స్ వాడనున్న పోలీసులు
- 31న రాత్రి 8 నుంచే డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ లు
- ఫ్లై ఓవర్లు బంద్.. పలు రూట్లలో ఆంక్షలు
- ఆటోలు, క్యాబ్ లలో ‘ఎక్స్ ట్రా’నడువదు
- గ్రేటర్ హైదరాబాద్ లో పోలీసుల ఆదేశాలు
హైదరాబాద్: న్యూఇయర్ వేడుకలపై ఈ సారి పోలీసులు కొరడా ఝుళిపించనున్నారు. అర్ధరాత్రి రోడ్లపై హంగామాలకు చెక్ పెట్టేందుకు రాత్రి 8 గంటల నుంచే తనిఖీలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆకతాయిలను అదుపు చేసేందుకు హైదరాబాద్ నగరంలోని ఫ్లయ్ ఓవర్లను, పలు రోడ్లను మూసి వేయనున్నారు. డ్రగ్స్ అదుపుపై దృష్టి పెట్టిన నార్కొటిక్ అనాలసిస్ బ్యూరో ఈ సారి రెండు అధునాతన గ్యాడ్జెట్లను అందుబాటులోకి తెచ్చింది. వీటి సాయంతో డ్రగ్స్ తీసుకున్న వారిని కూడా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
డ్రంకెన్ డ్రైవ్‌లో దొరకని నిందితులు వాడిన డ్రగ్స్ మోతాదును హైటెక్ గ్యాడ్జెట్ తో తెలుకుంటామన్నారు. పబ్‌ల వెలుపల, ట్రాఫిక్ చెక్‌పోస్టులు, ఫామ్‌హౌస్‌ల వద్ద వీటిని వినియోగిస్తామని పోలీసులు తెలిపారు. ఒక కిట్ సాయంతో డ్రగ్స్ వాడిన వ్యక్తి లాలాజల నమూనాను పరీక్షించి అతని శరీరంలోని డ్రగ్ మోతాదును గుర్తిస్తామని చెప్పారు. రెండో కిట్ సాయంతో మూత్ర నమూనాల ద్వారా డ్రగ్స్ వాడినట్టు నిర్ధారించవచ్చని తెలిపారు. పబ్‌లో లేదా రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడతున్నట్లు తెలిస్తే వారి లాలాజల నమూనాలను గ్యాడ్జెట్ సాయంతో పరిశీలించి అక్కడే తేలుస్తామని చెప్పారు. డ్రగ్స్ వాడిన వారు పోలీసులకు దొరకకుండా వాష్‌రూమ్‌లో ఫ్లష్ చేసినా ఈ గ్యాడ్జెట్స్ తో నిర్ధారించవచ్చని అన్నారు.
రాత్రి 8 నుంచే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఈ నెల 31న రాత్రి 8 గంటల నుంచి డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేస్తామని పోలీసులు తెలిపారు. సిటీలోని శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్, షేక్‌పేట్ ఫ్లైఓవర్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, రోడ్ నెం.45 ఫ్లైఓవర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరమ్ మాల్ ఫ్లైఓవర్, ఖైత్లాపూర్ ఫ్లైఓవర్, బాబు జగజీవన్ రామ్ ఫ్లైఓవర్, ఎఫ్. వీటితో పాటు ఔటర్ రింగ్ రోడ్డు, పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేలను కూడా మూసివేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి జనవరి ఉదయం 5 గంటల వరకు హైదరాబాద్ నగరంలోని ప్రధాన ఫ్లై ఓవర్లు, పలు రోడ్లను మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.
రెండేళ్ల జైలు శిక్ష
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా హైదరాబాద్ పోలీసులు కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. డిసెంబర్ 31న డ్రగ్స్, లిక్కర్ తాగి వెహికల్స్ నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. 31న డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి రూ.15 వేల వరకు జరిమానాతోపాటు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తామని పోలీసులు తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్‌లో మొదటిసారి దొరికిన వారికి గరిష్ఠంగా రూ. 10,000 వరకు జరిమానాతో పాటు 6 నెలల వరకు జైలు శిక్ష విధించనున్నట్లు తెలిపారు. రెండోసారి లేదా అంతకంటే ఎక్కువ పట్టుబడిన వారికి రూ. 15,000 జరిమానాతో పాటు రెండు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. అవసరమైతే డ్రైవింగ్ లైసెన్సులు జప్తు చేయడం, లేదంటే శాశ్వతంగా రద్దు చేసే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
నో ఎక్స్ట్రా చార్జెస్
డిసెంబర్ 31 రాత్రి ప్యాసింజర్స్ నుంచి నుంచి అదనపు చార్జీలు వసూలు చేయవద్దని ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్లకు ఇప్పటికే పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఎక్కువ డబ్బులు వసూలు చేసినట్లు తేలితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలి. అన్ని పత్రాలను దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ప్రయాణికులను తీసుకెళ్లేందుకు నిరాకరిస్తే రూ. 500 జరిమానా విధిస్తామన్నారు. ఎవరైనా డ్రైవరు కస్టమర్‌ను తీసుకెళ్లకపోతే 9490617346 నంబర్‌కు ఫోన్ చేసి కంప్లైంట్ చేయాలన్నారు.