శరవేగంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

శరవేగంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
  • పూరి గుడిసెవాసుల పక్కా ఇళ్ల కల సాకారం
  • రెండో విడతలో 1200 మందికి ఇళ్ల మంజూరు పత్రాలు
  • మరో వెయ్యి మంది స్లాబ్ కు ఆర్ధిక సాయం
  • శరవేగంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు

​హైదరాబాద్, వెలుగు: వారం రోజుల నుంచి రాష్ర్ట వ్యాప్తంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు శరవేగంగా సాగుతోంది.  ​మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్  విజయవంతంగా పూర్తి కావడంతో రెండో దశను ఈనెల 1వ తేదీన ప్రభుత్వం ప్రారంభించింది.   రెండో దశలో  స్లాబ్ లేని ఇళ్లు, పెంకుటిళ్లు,  రేకులతో ఉన్న ఇళ్లకు స్లాబ్ వేసుకునేందుకు రూ.2 లక్షల సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించి జీవో ఇచ్చింది.

రాష్ర్ట వ్యాప్తంగా ఇలాంటి ఇళ్లను  అధికారులు సర్వే చేస్తూ  వీళ్లకు కూడా  మంజూరు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో సుమారు వెయి మందికి రూ. 2 లక్షల సాయంకు మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. వీరంతా తమ ఇళ్లకు స్లాబ్ (రూఫ్) వేసుకునేందుకు వీలుగా త్వరలోనే ఆర్ధిక సాయం చేయనున్నారు. 

ప్రతి నియోజకవర్గానికి 500 మంది..

ప్రతి నియోజకవర్గానికి 500 మంది పూరి గుడెసెలో ఉంటున్న పేదలకు ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి జీవో ఇచ్చింది. మరో 1500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పేకొంది. జీహెచ్ ఎంసీ మినహా రాష్ర్టంలో వంద నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇందిరమ్మ ఇళ్లను రాష్ర్ట ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 1, 2 తేదీల్లో నిర్వహించిన రాష్ర్ట ఆవిర్భావ  వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు  ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా పూరి గుడెసెల్లో ఉంటున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందచేశారు.

గత వారం రోజుల్లో రాష్ర్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి   1,200 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఇళ్ల మంజూరు పత్రాలను (శాంక్షన్ ఆర్డర్స్) అందజేసినట్లు హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ పక్రియ ప్రతి రోజు జరుగుతోందని అధికారులు అంటున్నారు.  శాశ్వత నివాసం లభించబోతుండటంతో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందోత్సాహాలు 
వ్యక్తమవుతున్నాయి.