
- తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి, వైస్ చైర్మన్ ప్రపూల్ రామ్ రెడ్డి
ముషీరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులకు అన్యాయం చేసిందని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి, వైస్ చైర్మన్ ప్రపూల్ రామ్ రెడ్డి మండిపడ్డారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యమకారులకు రూ. 30 వేల పెన్షన్, 250 గజాల స్థలంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. జిల్లా కేంద్రాల్లో ఉద్యమకారుల స్మారక భవనాలు నిర్మించాలన్నారు. నగరంలో 100 ఎకరాల్లో అమరవీరుల స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 25 లక్షల బీమా సౌకర్యం, గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. సమావేశంలో జేఏసీ నాయకులు బద్రి, రాజేంద్ర ప్రసాద్, యాదగిరి, ఆనంద్, క్రిస్టఫర్, మాధవి, పద్మ, చంద్రన్న, వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు.