న్యాయవాదుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి శ్రీధర్ బాబు

న్యాయవాదుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి శ్రీధర్ బాబు
  •     అడ్వకేట్స్‌‌ ప్రొటెక్షన్‌‌  బిల్లు-2026’ పై చర్చ సందర్భంగా మంత్రి శ్రీధర్​బాబు
  •     అసెంబ్లీ, మండలిలో ఏకగ్రీవంగా అమోదం పొందిన బిల్లు 

హైదరాబాద్, వెలుగు: న్యాయవ్యవస్థలో అడ్వకేట్ల పాత్ర ఎంతో కీలకమని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబు అన్నారు. ‘అడ్వకేట్స్‌‌ ప్రొటెక్షన్‌‌ బిల్లు-2026’ని అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. న్యాయవాదుల సంక్షేమం, రక్షణ కోసం కాంగ్రెస్‌‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు.‘తెలంగాణ అడ్వకేట్స్‌‌ ప్రొటెక్షన్‌‌ బిల్‌‌ –2026’కి అసెంబ్లీ, మండలిలో సోమవారం ఆమోదముద్రపడింది. 

లాయర్ల రక్షణ కోసం రూపొందించిన బిల్లును సోమవారం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌‌బాబు ముందుగా అసెంబ్లీలో, తర్వాత మండలిలో ప్రవేశపెట్టారు. బిల్లుపై సుదీర్ఘంగా చర్చించగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. బిల్లుకు అవసరమైన సవరణలను ప్రతిపాదించారు. ఇరు సభల్లో చర్చ పూర్తైన తర్వాత బిల్లుకు ఆమోదం తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు.  

‘బీఆర్ఎస్‌‌ హయాంలో మంథని నియోజకవర్గం రామగిరి మండలంలో న్యాయవాది గట్టు వామనరావు దంపతులను హత్య చేసిన దోషులను గుర్తించలేదు. ఈ కేసుపై సీబీఐ విచారణ ఇంకా కొనసాగుతోంది. మా ప్రభుత్వం న్యాయవాదుల సంరక్షణకు కట్టుబడి ఉంది. అందుకే ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్‌‌ను ప్రవేశపెట్టినం అని మంత్రి అన్నారు. అర్హులైన న్యాయవాదులకు ఇన్సూరెన్స్, హెల్త్‌‌ కార్డ్‌‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. న్యాయవాదుల సమగ్ర సంరక్షణకు ఉద్దేశించిన ఈ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం తెలిపిన సభ్యులకు ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. 

ఉద్యమంలో ముందుండి పోరాడింది న్యాయవాదులే: ఎమ్మెల్యేలు

తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన న్యాయవాదుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. జూనియర్‌‌ అడ్వకేట్స్‌‌కు శిక్షణ కాలంలో ఐదేండ్ల పాటు నెలకు రూ.10 వేలకు పైగా ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం చేయాలని, ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ స్థలాలు ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ, మండలిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ అభిప్రాయం తెలిపారు.  అనంతరం బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు.

న్యాయవ్యవస్థ అందరికీ సమానమే: మంత్రి పొన్నం

సమాజంలో న్యాయవ్యవస్థ అందరికీ సమానమేనని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌ చెప్పారు. అడ్వకేట్‌‌  ప్రొటెక్షన్‌‌ బిల్లుపై మంత్రి మాట్లా డుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జడ్జి పదవులను ఎక్కువగా ఇవ్వడం లేదన్నారు. కొలీజియం వ్యవస్థలో ఆయా వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. న్యాయవ్యవస్థలో అందరికీ సమాన న్యాయం జరిగేలా చూడాలని కోరారు. గత 12 ఏండ్లలో ఎంత మంది బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు చెందిన వారిని జడ్జిలుగా నియమించారో బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్‌‌ చేశారు.