అగ్రికల్చర్ ఆఫీసర్ల ప్రమోషన్లకు మార్గం సుగమం..మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు టాడా కృతజ్ఞతలు

అగ్రికల్చర్ ఆఫీసర్ల ప్రమోషన్లకు మార్గం సుగమం..మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు టాడా కృతజ్ఞతలు

హైదరాబాద్‌, వెలుగు: వ్యవసాయ శాఖలో అర్హులైన అధికారుల ప్రమోషన్లకు అడ్డంకిగా ఉన్న న్యాయపరమైన సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న చొరవను తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్(టాడా) స్వాగతించింది. గురువారం సెక్రటేరియెట్ లో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను అసోసియేషన్ నేతలు కలిసి సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం టాడా ప్రతినిధులు మాట్లాడుతూ.. అగ్రికల్చర్​ఆఫీసర్ల ప్రమోషన్లకు సంబంధించి మెరిట్‌ వర్సెస్‌ రోస్టర్‌ సీనియారిటీ కేసులో హైకోర్టు విధించిన స్టే ఎత్తివేయడంతో పదోన్నతుల ప్రక్రియ ముందుకు సాగేందుకు మార్గం సుగమమైందని తెలిపారు. 

సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వంలో సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపిందని గుర్తుచేశారు. అంశంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌,  సీఎస్​,  అడ్వకేట్ జనరల్‌, లా సెక్రటరీ కార్యదర్శి, మంత్రి తుమ్మలతో పాటు ఉన్నతాధికారులతో సమన్వయం చేసినట్లు వెల్లడించారు. అర్హత, సీనియారిటీ, రోస్టర్‌, నిబంధనల ప్రకారం ప్రమోషన్లు కల్పించి, మిగిలిన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో టాడా రాష్ట్ర అధ్యక్షుడు సల్మాన్ నాయక్, ప్రధాన కార్యదర్శి తిరుపతి నాయక్, ట్రెజరర్ మధుమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.