వ్యవసాయంలోకి కొత్త తరం వచ్చేలా ప్రోత్సహించాలె

వ్యవసాయంలోకి కొత్త తరం వచ్చేలా ప్రోత్సహించాలె

ప్రధాని నరేంద్ర మోడీ 2014 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నామన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. ఇవాళ జాతీయ రైతు దినోత్సవం అని, 2014లో ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాక మోడీ ఇచ్చిన హామీని గుర్తు చేస్తున్నామని దానిని ఇప్పటికైనా అమలు చేయాలని ఆయన కోరారు.

రాష్ట్రంలో వడ్ల కొనుగోలుకు సంబంధించి కేంద్రంతో చర్చలు జరిపేందుకు వెళ్లిన రాష్ట్ర మంత్రుల టీమ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. “స్వామినాథన్‌ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. 2006లోనే ఆయన రిపోర్ట్ ఇచ్చారు. దురదృష్టవశాత్తు అప్పటి యూపీఏ సర్కారు ఆ సిఫార్సులను అమలు చేయలేదు. అయితే 2014 ఎన్నికల ముందు మోడీని ఎన్డీయే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన సమయంలో ఆయన ఇచ్చి ప్రధానమైన హామీలు రెండే.. వాటిలో ఒకటి ఏటా యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వడం.. రెండోది అధికారంలోకి రాగానే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయడం. కానీ అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం మర్చిపోయారు” అని అన్నారు.

మన దేశంలో 4 శాతమే సబ్సిడీలు

చైనా, అమెరికాల్లో కంటే మన దగ్గరే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పడే భూమి ఉన్నదని, కానీ రైతుల సంక్షేమం విషయంలో మాత్రం ప్రపంచ దేశాల కంటే మన దేశం వెనుకబడిందని నిరంజన్‌ రెడ్డి అన్నారు. ప్రపంచంలో రైతు పంట ఖర్చుల్లో 25 శాతం సబ్సిడీలు ఇస్తున్నారని, కానీ భారత్‌లో 4 శాతం మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఎంఎస్సీపై  స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను చట్టబద్ధతతో అమలు చేస్తేనే రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఇప్పటికీ దేశంలో 23 రకాల పంటలకే కనీస మద్దతు ధర ఇస్తున్నారని, కానీ అలా కాకుండా దేశంలో పండించే ప్రతి పంటకూ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఎంఎస్పీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

వ్యవసాయంలోకి కొత్త తరం వచ్చేలా ప్రోత్సహించాలె

దేశంలోనే అత్యధికంగా వరి పంట తెలంగాణలో పండుతుంటే.. దానిని రెగ్యులేట్ చేయడం మానేసి రైతులు అసలు వ్యవసాయమే చేయొద్దన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని నిరంజన్ రెడ్డి అన్నారు. స్వయం ఉపాధి ఉండే ఈ రంగంలోకి కొత్త తరం అడుగుపెట్టేలా ప్రోత్సహించాల్సిందిపోయి.. ఈ రంగం కాళ్లు నరికేస్తామన్న తీరుగా కేంద్రం చర్యలు ఉన్నాయని ఆరోపించారు. ప్రత్యామ్నాయ మార్గాలు వెతకడం మానేసి రైతులు అసలు వ్యవసాయం మాసేలా నిరుత్సాహపరిస్తే ఎలా అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. తాము ఈ ఒక్క పూట  వడ్ల పంచాయతీ కోసం మాట్లాడడం లేదని, వ్యవసాయం రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, దీనిపై కేంద్రం దృష్టి పెట్టాలని అన్నారు.