
ఏపీ, తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. చివరి రోజు కావడంతో రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థుల ఊరేగింపులు, కార్యకర్తల సందడి నడుమ రిటర్నింగ్ కార్యాలయాల వద్ద పండగ వాతావరణం కనిపించింది. దాఖలైన నామినేషన్లను మంగళవారం ఎన్నికల సంఘం అధికారులు పరిశీలిస్తారు. ఈ నెల 28 తేది వరకు నామినేషన్లు వెనక్కితీసుకుంటారు. తర్వాత ఎన్నికల సంఘం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తుంది.
చివరి రోజు కావడంతో రాష్ట్రంలో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు బీబీ పాటిల్, సాయికృష్ణ యాదవ్, మర్రి రాజశేఖర్ రెడ్డి, మన్నె శ్రీనివాస్ రెడ్డి, నామా నాగేశ్వర రావు నామినేషన్ పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ తరపున రేణుకా చౌదరి, వంశీ చంద్ రెడ్డి, దొమ్మాటి సాంబయ్య, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి….బీజేపీ అభ్యర్థులు రఘునందన్ రావు, బండి సంజయ్, డీకే అరుణ నామినేషన్ దాఖలు చేశారు.
మొత్తం దాఖలైన నామినేషన్ల వివరాలు
రాష్ట్రంలో 699 నామినేషన్లు దాఖలైనట్లు చెప్పారు ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్. అత్యధికంగా నిజమాబాద్ లోక్ సభ స్థానానికి 245 నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు. దీంతో నిజామాబాద్ స్థానానికి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 10 కోట్ల 9లక్షల 51 వేల నగదు సీజ్ చేశామన్నారు.
ఏపీలో 25 పార్లమెంట్ , 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 11న పోలింగ్ , మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.