నీటి వాటా తేల్చేందుకు..అపెక్స్​కు లేఖ రాయండి.. కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి

నీటి వాటా తేల్చేందుకు..అపెక్స్​కు లేఖ రాయండి.. కృష్ణా బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: కృష్ణా నదీలో తెలుగు రాష్ట్రాల నీటి వాటాను తేల్చాలని కోరుతూ కేంద్ర జలశక్తి(అపెక్స్ కౌన్సిల్)శాఖకు లెటర్ రాయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేఆర్ఎంబీ చైర్మన్ శివ్​నందన్​కుమార్​కు రాష్ట్ర ఈఎన్సీ సి.మురళీధర్ లేఖ రాశారు. 2023–24 వాటర్ ఇయర్ నుంచి కృష్ణాలో కచ్చితంగా 50 శాతం నిష్పత్తితో నీటిని పంచాల్సిందేనని గుర్తు చేశారు. పూర్తయిన ప్రాజెక్టులతోపాటు నిర్మాణంలో ఉన్న వాటికి నీటి కేటాయింపులు అవసరమని తెలిపారు. 

గత నెల జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో నీటి వాటాను తేల్చే బాధ్యతను అపెక్స్ కౌన్సిల్ కు కేటాయిస్తూ తీర్మానం చేశారని వెల్లడించారు. ఇప్పటిదాకా కేంద్ర జలశక్తి శాఖకు  దీనికి సంబంధించిన విజ్ఞప్తి కానీ, ఉత్తరప్రత్యుత్తరాలను గాని కేఆర్ఎంబీ జరపలేదని అన్నారు. కృష్ణా జలాలను ఇతర బేసిన్లకు తరలించడానికి వీలుగా ఏపీ చేపడుతున్న నిర్మాణాలకు వ్యతిరేకంగా లేవనెత్తిన అభ్యంతరాలను కేంద్రానికి నివేదించాలని కేఆర్ఎంబీని తెలంగాణ కోరింది.