నలుగురు ఆర్టీఐ కమిషనర్ల నియామకం

నలుగురు ఆర్టీఐ కమిషనర్ల నియామకం
  • అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాసరావు, మొహసినా పర్వీన్, దేశాల భూపాల్​కు ఓకే
  • గవర్నర్​ ఆమోదం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • తొలుత పంపిన  కప్పర హరిప్రసాద్, రాములు, వైష్ణవి, పీఎల్​ఎన్​ ప్రసాద్ పేర్లకు లభించని గవర్నర్​ ఆమోదం
  • సపరేట్​గా పంపిన దేశాల భూపాల్​ నియామకానికి గ్రీన్​ సిగ్నల్​

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నలుగురు కొత్త కమిషనర్లను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్​ రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త  కమిషనర్లలో బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాసరావు, మొహసినా పర్వీన్, దేశాల భూపాల్ ఉన్నారు. కమిషనర్లుగా  రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పలువురి పేర్లతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ప్రతిపాదనలు పంపింది. ఇందులో నలుగురి పేర్లకు గవర్నర్​ ఆమోదం తెలిపారు. దీంతో వారి నియామకాన్ని అధికారికంగా ప్రకటిస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. వీరు బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి మూడేండ్ల పాటు కమిషనర్లుగా కొనసాగనున్నారు. లేదా 65 ఏండ్ల గరిష్ట వయసు వరకు అవకాశం ఉంటుంది.  ఇందులో ఏది త్వరగా పూర్తవుతుందో అదే వర్తిస్తుంది. 

పెండింగ్​లో నలుగురి పేర్లు

వాస్తవానికి గత నెల 27న ఆర్టీఐ కమిషనర్ల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏడుగురి పేర్లను గవర్నర్​కు  పంపింది. అయితే కొందరి పేర్లపై గవర్నర్​ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇందులో కప్పర హరిప్రసాద్​ (జర్నలిస్టు కోటా), పీఎల్​ఎన్​ ప్రసాద్​, రాములు, వైష్ణవి పేర్లు ఉన్నాయి.  అయినప్పటికీ గవర్నర్ ఒప్పుకోకపోవడంతో వీరి నియామకం పెండింగ్​లో పడింది. అయితే ప్రభుత్వం దేశాల భూపాల్ పేరును విడిగా పంపింది. దీనికి గవర్నర్​ ఓకే చెప్పారు. ఆర్టీఐ కమిషన్​ కు చీఫ్​ ఇన్ఫర్మేషన్​​ కమిషనర్​తో కలిపి మొత్తం 10 మందిని కమిషనర్లుగా నియమించుకునే వెసులుబాటు ఉంది.

 ఇటీవలే చీఫ్​ ఇన్ఫర్మేషన్​ కమిషనర్​గా చంద్రశేఖర్​ రెడ్డిని నియమించారు. తాజాగా సోమవారం మరో నలుగురిని కమిషనర్లుగా ప్రభుత్వం నియమించింది. ఆర్టీఐ కమిషనర్ల( చీఫ్​ ఇన్ఫర్మేషన్​ కమిషనర్​తో కలిపి)లో ముగ్గురు ఓసీలు, ఒక ఎస్సీ మాదిగ, ఒక మైనార్టీ మహిళ ఉన్నారు. కమిషనర్​గా నియమితులైన పీవీ శ్రీనివాస రావు  సీనియర్ జర్నలిస్ట్. అయోధ్య రెడ్డి సీఎం చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్​వో)గా ఉన్నారు. భూపాల్​ దేశాల  హైకోర్టు అడ్వకేట్​గా పనిచేస్తున్నారు. మొహసినా పర్వీన్ న్యాయవాదిగా కొనసాగుతున్నారు.