ఎస్ఎల్‌‌‌‌బీసీని ఎండబెట్టి.. ఎస్ఆర్‌‌‌‌‌‌‌‌బీసీకి నీళ్లు

ఎస్ఎల్‌‌‌‌బీసీని ఎండబెట్టి.. ఎస్ఆర్‌‌‌‌‌‌‌‌బీసీకి నీళ్లు
  • ఉమ్మడి ఏపీలో ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీకి నీటి కేటాయింపులు కానివ్వలేదు  
  • ఎస్ఆర్‌‌‌‌‌‌‌‌బీసీకి నికర జలాలు.. ఎస్ఎల్‌‌‌‌బీసీకి మిగులు జలాలు పెట్టారు 
  • బ్రజేశ్‌‌‌‌కుమార్ ట్రిబ్యునల్​ ముందు తెలంగాణ వాదనలు 
  • తెలంగాణకు 555 టీఎంసీలు ఇచ్చినా ఏపీకి నష్టం ఉండదని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఏపీలో ఎస్ఎల్‌‌‌‌బీసీకి తీవ్ర అన్యాయం చేసి.. ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌బీసీ (శ్రీశైలం రైట్​బ్యాంక్​ కెనాల్)కి నీటి కేటాయింపులను చేసుకున్నారని కృష్ణా వాటర్​ డిస్ప్యూట్స్ ​ట్రిబ్యునల్​2 (బ్రజేశ్ కుమార్ ​ట్రిబ్యునల్) ముందు తెలంగాణ వాదించింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు గ్రావిటీ ద్వారా నీటిని తీసుకెళ్లేందుకు ఉమ్మడి ఏపీలో 150 టీఎంసీల సామర్థ్యంతో ఎస్ఎల్‌‌‌‌బీసీ ప్రాజెక్టును తలపెట్టారని.. కానీ, ఉమ్మడి ఏపీ పాలకులు బచావత్ ట్రిబ్యునల్ ముందు నీటి వాటాల కేటాయింపులకు పట్టుబట్టలేదని తెలిపింది. బుధవారం మూడోరోజు బ్రజేశ్​కుమార్ ట్రిబ్యునల్​ ముందు తెలంగాణ తన వాదనలను వినిపించింది. ఉమ్మడి ఏపీ పాలకులు ఎస్ఎల్‌‌‌‌బీసీని పక్కనపెట్టి.. ఏపీలోని ఔట్‌‌‌‌సైడ్​ బేసిన్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయించుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొంది. 

ఎస్ఆర్‌‌‌‌‌‌‌‌బీసీ కింద ఔట్‌‌‌‌సైడ్​ బేసిన్‌‌‌‌కు, ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీ కింద ఇన్‌‌‌‌సైడ్​బేసిన్‌‌‌‌కే నీళ్లు ఇచ్చేలా ప్రతిపాదించి తీవ్ర అన్యాయం చేశారని వాపోయింది. అందుకు 1980ల్లో జీవోలు కూడా జారీ చేశారని గుర్తు చేసింది. ఎస్ఆర్‌‌‌‌‌‌‌‌బీసీకి 75 శాతం డిపెండబిలిటీ ఆధారంగా వచ్చే నికర జలాలను కేటాయించేందుకు జీవోలు ఇవ్వగా.. ఎస్ఎల్‌‌‌‌బీసీకి మాత్రం మిగులు జలాలను కేటాయించేలా ప్రతిపాదించిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత బ్రజేశ్ కుమార్​ట్రిబ్యునల్ ముందు ఎస్ఆర్‌‌‌‌‌‌‌‌బీసీకి నీళ్లు కేటాయించాలని అడగాల్సింది పోయి.. ఔట్‌‌‌‌సైడ్​బేసిన్‌‌‌‌లోని తెలుగు గంగ ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వాలంటూ ప్రతిపాదించిందని పేర్కొంది.

కేడీఎస్‌‌‌‌కు 125 టీఎంసీలు తీస్కపోయిన్రు.. 

కృష్ణా డెల్టా స్కీమ్ (కేడీఎస్)​కు పరిధికి మించి ఏపీ నీటిని తీసుకుపోయిందని ట్రిబ్యునల్‌‌‌‌కు తెలంగాణ వివరించింది. ఒక ఏడాదిలో 125 టీఎంసీల నీటిని తరలించిందని వెల్లడించింది. ఏపీలోని ప్రాజెక్టులకు నీళ్లిచ్చేందుకు ఇతర వనరులు ఉన్నాయని, వాటి ద్వారా వాడుకోగా మిగిలిన నీళ్లు తెలంగాణలోని ఇన్​బేసిన్ అవసరాలకు వాడుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ‘‘కృష్ణా డెల్టా స్కీమ్‌‌‌‌కు డ్రెయిన్ల ద్వారా 43.2 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉంటాయి. అదికాకుండా పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి నీటిని తరలించుకునేందుకూ అవకాశం ఉంటుంది. పోలవరం దిగువన నీటిని తీసుకునేందుకు ఏపీ పట్టిసీమ లిఫ్ట్​ స్కీమ్‌‌‌‌నూ నిర్మించింది. 

దాని ద్వారా కూడా కేడీఎస్‌‌‌‌కు నీళ్లు వెళ్తాయి. 2023–24లో అత్యంత కరువున్న కృష్ణా డెల్టాకు 125 టీఎంసీల నీళ్లను ఏపీ తరలించింది. అందులో పట్టిసీమ లిఫ్ట్​ నుంచే 40 టీఎంసీలను తీసుకెళ్లిపోయింది. ఆ సమయంలో శ్రీశైలానికి వచ్చిన ఇన్​ఫ్లోస్​కేవలం 145 టీఎంసీలే’’ అని వాదించింది. తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వడం వల్ల ఏపీకి వచ్చే నష్టమేమీ ఉండదని స్పష్టం చేసింది. 

ఔట్‌‌‌‌సైడ్​బేసిన్‌‌‌‌కు ఎన్ని నీళ్లు తీసుకెళ్తున్నారని ట్రిబ్యునల్​చైర్మన్​ ప్రశ్నించగా.. ప్రస్తుతం ఏపీకి 512 టీఎంసీల కోటా ఉండగా, అందులో 323 టీఎంసీలను ఔట్‌‌‌‌సైడ్​ బేసిన్‌‌‌‌కే తీసుకెళ్తున్నదని తెలంగాణ వివరించింది. ఏపీ ఇన్‌‌‌‌సైడ్​ బేసిన్‌‌‌‌లో వాడుకుంటున్నది 189 టీఎంసీలేనని తేల్చి చెప్పింది. ఈ లెక్కన తెలంగాణకు 555 టీఎంసీలు కేటాయించినా, ఏపీకి నష్టం జరగదని స్పష్టం చేసింది.