V6 News

ఆర్టీసీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ఆర్టీసీ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
  • అధికారులతో గంటపాటు చర్చించి ఓకే చెప్పిన గవర్నర్​
  • ప్రభుత్వానికి పలు సిఫార్సులు.. సభలో ఏకగ్రీవంగా బిల్లు పాస్​
  • ప్రభుత్వానికి పలు సిఫార్సులు
  • సభలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన సభ్యులు

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ విలీన బిల్లుకు తెలంగా ణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అంతకుముందు ఆర్టీసీ విలీన బిల్లుపై రవాణ శాఖ సెక్రటరీ శ్రీనివాస రాజు, ఆర్ అండ్ బీ సెక్రటరీ విజయేంద్ర బోయిలు, ఆర్టీసీ ఈడీలు మునిశేఖర్, కృష్ణకాంత్ తో ఆదివారం మధ్యాహ్నం గవర్నర్ తమిళిసై గంట పాటు సమావేశమయ్యారు. బిల్లుకు ఆమోదం తెలిపే ముందు ప్రభుత్వానికి గవర్నర్ కొన్ని సిఫార్సులు చేశారు. తర్వాత బిల్లును రవాణా శాఖ అధికారులు అసెంబ్లీకి తీసుకొచ్చారు. బిల్లు ఆమోదానికి ముందు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ బండ్లగూడకు బస్ డిపో శాంక్షన్ చేయాలని సీఎం కేసీఆర్​ను కోరారు. 

ఈ సందర్భంగా ఏ పరిస్థితుల్లో సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాల్సి వస్తున్నదో కేసీఆర్ సభకు వివరించారు. ‘‘గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసి ప్రభుత్వంలో కలపాలని కోరారు. గతంలో వద్దనుకున్నాం. సంస్థ మనుగడ సాధించే పరిస్థితి లేదు. డీజిల్ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజుకు రూ.2.50 కోట్ల నష్టం వస్తున్నది. నష్టాలు తగ్గించుకునేందుకు ఎండీగా సజ్జనార్​ను, చైర్మన్​గా బాజిరెడ్డి గోవర్దన్​ను నియమించాం. వాళ్లు ఎంతో కష్టపడ్డారు. అయినా నష్టాలు తప్పలేదు” అని కేసీఆర్ సభకు వివరించారు.


సంస్థను సాకేది గవర్నమెంటే..
‘‘ఆర్టీసీకి ఏడాదికి రూ.1,500 కోట్లు ఇస్తున్నాం. గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో లేదన్నట్టే కానీ.. సాకేది ప్రభుత్వమే. కాబట్టి, ప్రజలకు తప్పకుండా ప్రజారవాణా ఉండా లనే ఉద్దేశంతో ప్రభుత్వంలోకి తీసుకున్నాం” అని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. కేబినెట్​లో సుదీర్ఘంగా చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ‘‘ఆర్టీసీ విలీనంపై కొందరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారు. కొందరేమో ఆర్టీసీ ఆస్తుల మీద కన్నేసినం అని అంటున్నారు. ఇలాంటివి వింటే బాధేస్తున్నది. కార్మికులకు భద్రత కల్పిస్తాం. బస్టాండ్లను ఇంకా అభివృద్ధి చేస్తాం. బండ్లగూడ డిపో కావాలని అక్బరుద్దీన్ ఒవైసీ అడిగారు. త్వరలో శాంక్షన్ చేస్తాం” అని కేసీఆర్ వెల్లడించారు. 


గవర్నర్ పనిలేని పని పెట్టుకున్నరు: కేసీఆర్​
ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ కామెంట్లపై కేసీఆర్ మాట్లాడారు. ‘‘గవర్నర్‌‌‌‌‌‌‌‌ కూడా తెలిసీతెలియక అనవసరంగా వివాదం కొనితెచ్చుకున్నారు. పనిలేని పని పెట్టుకున్నారు. బిల్లుపై క్లారిఫికేషన్ అడిగారు. రెండు సార్లు అడిగితే ఇచ్చేశాం. ఇప్పుడు గవర్నర్​కు జ్ఞానోదయం అయిందనుకుంటున్న. అందుకే బిల్లు ప్రవేశపెట్టేందుకు అనుమతిచ్చారు. ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్న”అని కేసీఆర్ అన్నారు. 


వాళ్లు అలాగే కొనసాగుతారు : పువ్వాడ అజయ్
ఆర్టీసీలో ఉన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుఅలాగే కొనసాగుతారని, కార్పొరేషన్ ఏజెన్సీ జీతాలు ఇస్తుందని మంత్రి పువ్వాడ తెలిపారు. విలీనం తర్వాత ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు జీతాలను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ఈ బిల్లు పాసైన తర్వాత యూనియన్ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

గవర్నర్ చేసిన సిఫార్సులు
ఆర్టీసీ భూములు, ఆస్తుల రక్షణ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌కే అప్పగించాలి.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తున్నట్లు సర్కారు స్పష్టమైన హామీ ఇవ్వాలి.
ఏపీ రీ ఆర్గనైజేషన్ చట్టం ప్రకారం ఆస్తులను విభజించి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కార్పొరేషన్ విభజన ప్రక్రియ పూర్తి చేయాలి.
కార్మికుల బకాయిలు క్లియర్ చేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి.
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాక వేతనాలు, బదిలీలు, పదోన్నతులు, పదవీ విరమణ పింఛన్లు, పే స్కేల్, సర్వీస్ రూల్స్, గ్రాట్యుటీలు, పీఎఫ్ వంటివన్నీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఉండాలి.
ఆర్టీసీ ఉద్యోగులు అన్ ఫిట్ అయినా, చనిపోయినా వారి కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద జాబ్ ఇవ్వాలి.
ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న నిబంధనలనూ ఆర్టీసీ ఉద్యోగులకు వర్తింపజేయాలి.
ఆర్టీసీ కార్మికులను, ఉద్యోగులను ఇతర శాఖల్లో డిప్యూటేషన్ కింద బదిలీ చేస్తే.. వారి గ్రేడ్, జీతం, ప్రమోషన్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు. కాంట్రాక్టు, ఔట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించి, రాష్ట్ర సర్వీస్ రూల్స్ ప్రకారం సమానమైన ప్రయోజనాలు, జీతాలు ఇవ్వాలి.
 రెగ్యులర్ ఉద్యోగుల్లాగే కాంట్రాక్టు ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ అమలు చేయటంతో పాటు, ఈహెచ్ఎస్ వర్తింపజేయాలి. ఆర్టీసీ హాస్పిటల్​లో ట్రీట్ మెంట్ అందించాలి.
ప్యాసింజర్ల భద్రత దృష్ట్యా ఆర్టీసీ బస్సులను ప్రభుత్వమే రన్ చేయాలి. బయటి వాళ్లకు ఇవ్వకూడదు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలకు గవర్నర్ గ్రీటింగ్స్ తెలిపారు. విలీనం సందర్భంగా కార్మికులకు మంచి ప్రయోజనాలు అందాలని కోరుకుంటున్నట్లు గవర్నర్ తమిళిసై చెప్పారు.