హైదరాబాద్, వెలుగు: గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, ఉపాధి రక్షణ కోసం ఆదివారం అసెంబ్లీలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి బిల్లును ప్రవేశపెట్టారు. తెలంగాణ వ్యాల్యూ యాడెడ్ టాక్స్ సవరణ బిల్లును మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రవేశపెట్టారు. అలాగే తెలంగాణ పంచాయతీ రాజ్ మూడో సవరణ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టి సభ ఆమోదం పొందారు. ‘తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్-2026’ను ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టి బిల్లు వివరాలను సభకు వెల్లడించారు.
చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని, అందుకే బిల్లు తీసుకొచ్చామన్నారు. నిర్లక్ష్యం వహించే ఉద్యోగుల జీతాల నుంచి కొంత భాగాన్ని కట్చేసి తల్లిదండ్రులకు అందించేలా ఈ బిల్లును తీసుకొచ్చామని వివరించారు. వృద్ధుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తల్లిదండ్రులు భద్రత కోసం తీసుకొస్తున్న బిల్లు చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొనాలని మంత్రి కోరారు.
