- కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలి: మంత్రి తుమ్మల
- ఇది ప్రాణాంతకం, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు: ఎమ్మెల్యేలు
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయంలో గడ్డి నివారణకు వాడుతున్న పారాక్వాట్ డైక్లోరైడ్ 24% ఎస్ఎల్ అనే రసాయనం ప్రాణాంతకమని, దీనిని దేశవ్యాప్తంగా తక్షణమే నిషేధించాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ కీలక తీర్మానం చేసింది. సోమవారం శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ నిషేధ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సమాజ హితం, పర్యావరణ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని ఆయన స్పష్టం చేశారు. పారాక్వాట్ వినియోగంతో రైతులు, కూలీలు తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
‘ఇది అత్యంత విషపూరితమైనది. పొలాల్లో వాడేటప్పుడే కాకుండా, క్షణికావేశంలో దీన్ని తాగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రసాయనంతో కలిగే అనర్థాలను అరికట్టాలంటే నిషేధమే ఏకైక మార్గం’ అని ఆయన పేర్కొన్నారు.
పారాక్వాట్ డైక్లోరైడ్ తయారీ, దిగుమతి, నిల్వ, రవాణాతో పాటు విక్రయాలపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల్లో పారాక్వాట్ డైక్టోరైడ్ మందును నిషేధించారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. దీన్ని ఉత్పత్తి చేసే స్విట్జర్లాండ్ లోనూ దీన్ని వినియోగించడం లేదన్నారు. తెలంగాణలో ఏటా 2 వేల మంది దీన్ని తాగి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈ గడ్డి మందును నిషేధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు.
ఈ మందు అన్ సీజన్ ఏప్రిల్, మే నెలల్లోనూ అమ్ముతున్నారని ఎమ్మెల్యే విజయరమణరావు చెప్పారు. తన సెగ్మెంట్ లోని ఓ తండాలో ఏకంగా 12 మంది చనిపోయారని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ అన్నారు. కేరళం, ఒడిశా రాష్ట్రాల్లో దీన్ని బ్యాన్ చేశారని, మన దగ్గర వెంటనే బ్యాన్ చేయాలని ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు. ఎమ్మెల్యేలు సామేలు, భూపతిరెడ్డి, మట్టా రాగమయి తదితరులు దీన్ని బ్యాన్ చేయాలని కోరారు.
పారాక్వాట్ నిషేధంపై తీర్మానం అభినందనీయం
పారాక్వాట్ గడ్డిమందు తయారీ, అమ్మకాలను నిషేధించాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని టీపీసీసీ డాక్టర్ సెల్, మెడికల్ అండ్ హెల్త్ విభాగం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ రాజీవ్ స్వాగతించారు. ఈ మేరకు సోమవారం వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ తీర్మానం ప్రభుత్వం మానవతా దృక్పథంతో తీసుకున్న బాధ్యతాయుతమైన నిర్ణయమని డాక్టర్ రాజీవ్ కొనియాడారు.
