- ఎనిమిదేండ్ల తర్వాత ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అంశం తెరపైకి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు అంశం ఎనిమిదేండ్ల తర్వాత మళ్లీ తెరపైకి వచ్చింది. బీఆర్‌ఎస్ హయాంలో సభలో దురుసుగా ప్రవర్తించారనే కారణంలో సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సభ్యత్వాలను స్పీకర్ రద్దు చేశారు. తాజాగా, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వం రద్దుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో సీఎం రేవంత్ దీనిపై స్పందిస్తూ ఎథిక్స్ కమిటీ వేసి, దానికి పంపిస్తామని చెప్పారు.
దీంతో పలువురు నేతలకు 2018 మార్చి 13 నాడు అసెంబ్లీలో జరిగిన ఘటన గుర్తుకువస్తున్నది. ఆనాడు కాంగ్రెస్ తరపున నల్గొండ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యేగా ఉన్న సంపత్.. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలుపుతూ సభలో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో అక్కడే గవర్నర్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఉన్నారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ సభ్యులతో ఈ ఇద్దరికి వివాదం ముదిరి చివరకు పోడియం పైకి కోమటిరెడ్డి, సంపత్ తమ హెడ్ ఫోన్స్ విసిరారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై అవి పడడం, ఆయనకు గాయాలయ్యాయనే కారణంతో వీరి శాసన సభ్యత్వాలను అదే రోజు రద్దు చేస్తూ స్పీకర్ గెజిట్ విడుదల చేశారు. తెలంగాణ సభలో ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు కావడడం ఇదే మొదటిసారి. ఇప్పుడు కౌశిక్ శాసన సభ్యత్వం రద్దుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడం, ఎథిక్స్ కమిటీని వేసి, దానికి ఈ అంశాన్ని పంపిస్తామని సీఎం రేవంత్ సభలో ప్రకటించడంతో కౌశిక్ రాజకీయ భవిష్యత్తుపై చర్చ సాగుతున్నది.
